మార్కెట్ విలువల పెంపునకు నో!
► రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలను తిరస్కరించిన సర్కారు
► సవరిస్తే ఏటా రూ.400 కోట్ల ఆదాయం పెరుగుతుందన్న కమిషనర్
► నోట్ల రద్దు నుంచి రియల్ఎస్టేట్ ఇంకా కోలుకోలేదన్న స్పెషల్ సీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూము లు, భవనాల మార్కెట్ విలువల పెంపునకు సర్కారు విముఖత వ్యక్తం చేసింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రస్తుత విలువలే కొనసాగనున్నాయి. వాస్తవానికి నాలుగేళ్లుగా మార్కెట్ విలువలను ప్రభుత్వం సవరించకపోవడంతో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆశించిన మేర రాబడి లభించడం లేదు. ఏటా ఈ శాఖ ఆదాయ లక్ష్యాన్ని పెంచుకుంటూ పోతున్నా.. మార్కెట్ విలువలను సవరించ కపోవడంతో ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నా రు. 2016–17లోనైనా మార్కెట్ విలువలను సవరించాలని రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ గతేడాది ఏప్రిల్లోనే ప్రభు త్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆలస్యంగా స్పందించిన సర్కారు.. అది సరైన సమయం కాదంటూ ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టిం ది.కొద్ది రోజుల్లో 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుంది. ఇక ప్రభుత్వ తాజా నిర్ణ యంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా భూములు, భవనాల మార్కెట్ విలువలు పెరిగే అవకాశం ఉండకపోవచ్చని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఆదాయానికి గండి: ఏపీ మార్కెట్ విలువ సవరణ నిబంధనలు, మార్గదర్శకాలు–1998 మేరకు ఏటా భూములు, భవనాల మార్కెట్ విలువలను రిజిస్ట్రేషన్ల శాఖ సవరించాల్సి ఉంది. ఒక ఏడాది పట్టణ ప్రాంతాల్లో, మరుసటి ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ విలువలను సవరించాలి. ఏటా ఏప్రిల్లో మార్కెట్ విలువల పెంపు కసరత్తు ప్రారంభించి.. ఆగస్టు 1 నుంచి సవరణ ప్రతిపాదనలను అమలు చేయాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్లో ధరలను అనుసరించి రిజిస్ట్రేషన్ విలువలను సమీక్షిస్తారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 2013లో చివరిసారిగా భూములు, భవనాల మార్కెట్ విలువలను సవరించారు. ఆ తర్వాతగానీ, రాష్ట్రం ఏర్పాటయ్యాకగానీ సవరణ చేపట్టలేదు. గత మూడేళ్లుగా రిజిస్ట్రేషన్ శాఖ విలువల సవరణ ప్రతిపాదనలను సమర్పిస్తున్నా.. ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు.
సవరిస్తే రూ.400 కోట్ల ఆదాయం
రాష్ట్ర ఏర్పాటు అనంతరం అన్ని జిల్లాల్లో రియల్ ఎస్టేట్ క్రమేపీ పుంజుకుంటోందని.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూములు, భవనాల మార్కెట్ విలువలను సవరించేందుకు అనుమతించాలని రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ గత ఏప్రిల్లోనే ప్రభుత్వానికి ప్రతిపాదించారు. సవరణ జరిపితే ఏటా రూ.400 కోట్లకు పైగా రాబడి పెరుగుతుందని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో భూములు, భవనాల మార్కెట్ విలువలు పెంచేందుకు ఇది సరైన సమయం కాదని రెవెన్యూ (రిజిస్ట్రేషన్లు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా రిజిస్ట్రేషన్ల శాఖకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2014, 2015 సంవత్సరాల్లో మార్కెట్ విలువలను పెంచేందుకు సరైన కారణాలు లేవని.. ఇటీవల వృద్ధిరేటు తక్కువగా ఉండడం, పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో రిజిస్ట్రేషన్ల రాబడి తగ్గిందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశముందని, ఈ పరిస్థితుల్లో మార్కెట్ విలువల సవరణ సరికాదని సూచించారు.