గందరగోళం సృష్టించారు
♦ కేంద్రానికి ఉత్తరాఖండ్ హైకోర్టు అక్షింతలు
♦ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ హక్కును లాగేసుకున్నారు
నైనిటాల్: ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం హడావిడిగా తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు మరోసారి కేంద్రంపై అక్షింతలు వేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధికారాలను లాగేసుకున్నారని, అలాగే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితిని సృష్టించారని ఆక్షేపించింది. అవినీతి, ఎమ్మెల్యేల బేరసారాల్లాంటి ఆరోపణలు కాకుండా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించడమొక్కటే రాజ్యాంగబద్ధ పరిష్కారమంది.
రాష్ర్టపతి పాలనను సవాల్చేస్తూ పదవీచ్యుత సీఎం రావత్, ఇతర పిటిషన్లపై కోర్టు మంగళవారం విచారణ జరిపింది. రాష్ట్రపతిపాలనపై హైకోర్టు డివిజన్ బెంచ్ కేంద్రంపై ప్రశ్నలు సంధించింది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికార పార్టీలు వేరైనప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి ఎలాంటి అవకాశం దొరుకుతుందా అని కేంద్ర ప్రభుత్వం భూతద్దం పెట్టుకొని వెతుకుతున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాన్ని రద్దుచేసేందుకు అవినీతి ఆరోపణలే సరిపోతే దేశంలో ఏ ప్రభుత్వమైనా కనీసం ఐదు నిమిషాలైనా మనుగడ సాగిస్తుందా అని ప్రశ్నించింది.