The government of Singapore
-
సింగపూర్ ప్రభుత్వమే నిర్మించే రాజధాని తుళ్లూరు
నేలపాడు(తుళ్లూరు) : పూర్తిస్థాయిలో సింగపూర్ ప్రభుత్వం నిర్మించే రాజధాని నవ్యాంధ్రప్రదేశ్ మాత్రమేనని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పి. నారాయణ వెల్లడించారు. సీఆర్డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్‌తో కలసి శుక్రవారం నేలపాడు వచ్చిన మంత్రి భూ సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఒక్కరోజు 40 మంది రైతులు తమ 106.48 ఎకరాల భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ మంత్రికి అంగీకార పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడారు. నేలపాడులో మొత్తం 1470 ఎకరాల భూమి ఉందన్నారు. దీనిలో 1206 ఎకరాల పట్టాభూమిని మొత్తం 685 మంది రైతులు రాజధానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ భూసేకరణ చట్టం ద్వారా భూములు తీసుకుంటే రైతులకు తీవ్ర నష్టం వస్తుందని భావించిన సీఎం ల్యాండ్ పూలింగ్ చేపట్టినట్టు తెలిపారు. నూతన రాజధానిలో మొదటి లబ్ధి ఈ ప్రాంత రైతులకే దక్కుతుందన్నారు. జూన్‌లో సింగపూర్ ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్ ఇస్తే వెంటనే మంచి రోజు చూసుకుని రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.తొలి దశ పనులు మూడేళ్లలో పూర్తి కాగలవని అంచనా వేశామన్నారు. మురుగు నీరు బయటకు వెళ్లే అవకాశం లేని నేలపాడు గ్రామాన్ని ప్రభుత్వం తీసు కోవాలని ఓ రైతు కోరగా ప్రస్తుతం గ్రామాలను కదిలించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు, వివాదాలను పరిష్కరిస్తూ రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ అనుమతి ప్రతాలను తీసుకునేందుకు డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసమూర్తిని భూ సమీకృత అధికారిగా నియమిస్తున్నట్లు చెప్పి ఆయనను రైతులకు పరిచయం చేశారు. అనంతరం మంత్రి, సీఆర్డీఏ కమిషనర్ భూములు ఇచ్చే రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుని రశీదులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, జేసీ చెరుకూరి శ్రీధర్,ఆర్డీవో భాస్కరనాయుడు, తహశీల్దార్ సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలు అందజేసిన రైతులు కొమ్మినేని ఆదిలక్ష్మి 3.5 ఎకరాలు, కాటా అప్పారావు ఎకరం, ధనేకుల రామారావు 11 ఎకరాలు, భూక్యా సాలి 80 సెంట్లు, కొమ్మినేని శేషగిరిరావు 5 ఎకరాలు, ఇందుర్తి నాగమల్లేశ్వరరావు 55 సెంట్లు, గుజ్జర్లపూడి తిరుపతిరావు ఎకరం, కణతరపు సాంబశివరావు 4.75 ఎకరాలు, పారా పార్వతి 95 సెంట్లు, ఆలూరి వెంకటేశ్వరరావు 6 ఎకరాలు, మూల్పూరి రాంబాబు 5.75 ఎకరాలు, కె.రాఘవయ్య 5 ఎకరాలు, ఇందుర్తి వెంకటేశ్వరరావు 55 సెంట్లు, యంపరాల నవత 1.50 ఎకరాలు, కొమ్మగూర ఇసాక్ 1.70 ఎకరాలు, కణతరపు శ్రీమన్నారాయణ 3.5 ఎకరాలు. ఇంకా పలువురు ఉన్నారు. తొలిరోజు 106.48 ఎకరాలు నేలపాడులో శుక్రవారం జరిగిన ల్యాండ్ పూలింగ్ కార్యక్రమంలో 106ఎకరాల 48 సెంట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు 40 మంది రైతులు అంగీకార పత్రాలను సమర్పించారు. మొదటి రోజు కనీసం 500 ఎకరాలకు అంగీకార పత్రాలు తీసుకోవాలనే లక్ష్యంతో అధికారులు, మంత్రి, సీఆర్డీఏ కమిషనర్ గ్రామానికి వచ్చారు. అయితే శుక్రవారం కావడం ఒక కారణమైతే, మరోవైపు భారీ వర్షం కురవడంతో రైతులు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. దీనిపై తహశీల్దార్ సుధీర్‌బాబు మాట్లాడుతూ తొలిరోజు 40 మంది రైతులు ముందుకు రావడం ఆశించదగిన పరిణామం అన్నారు. శనివారం ఎక్కువ మంది రైతులు వచ్చే అవకాశం వుందని అన్నారు. వారంలోపు నేలపాడులో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
సింగపూర్ ప్రభుత్వంతో బాబు రహస్య ఒప్పందం
నిడమర్రు రైతుల సమావేశంలో ఎమ్మెల్యే ఆర్కే ఆరోపణ సింగపూర్ మంత్రి పర్యటనను అడ్డుకుంటామని అన్నదాతల స్పష్టీకరణ నిడమర్రు (మంగళగిరి) ఆరు నెలలుగా రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలను మోసంచేస్తూ కాలయాపన చేస్తున్న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు రాజధాని భూ సమీకరణ గ్రామాల్లో సింగపూర్ మంత్రి పర్యటనకు గుట్టుచప్పుడు కాకుండా సిద్ధంచేస్తుండడం ఆయనను మోసగించేందుకా? లేక సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు రహస్య ఒప్పందం చేసుకున్నాడేమోనని అనుమానం కలుగుతోందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. రాజధాని భూ సమీకరణపై చంద్రబాబు విధి విధానాలు ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 10వ తేదీ సింగపూర్ మంత్రి రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారనే సమాచారంతో రైతులను సమాయత్తం చేసేందుకు ఎమ్మెల్యే ఆర్కే సోమవారం రాత్రి నిడమర్రు గ్రామంలో రైతులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులు, రైతుకూలీలు, కౌలు రైతులతో పాటు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి కుటుంబం సంఘటితమై పర్యటనను అడ్డుకుంటారని చెప్పారు. భూ సమీకరణ గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ తాను అండగా వుంటానని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అధికార గర్వంతో చంద్రబాబు ఎవ్వరినీ పరిగణలోకి తీసుకోవడం లేదని, తాము భూములను ఇచ్చే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. తమ భూములను కాపాడుకునేందుకు ఆత్మ బలిదానాలకైనా సిద్ధమని, సింగపూర్ మంత్రి పర్యటన అడ్డుకుని తీరుతామని తేల్చిచెప్పారు. సమావేశంలో ఎంపీపీ పచ్చల రత్నకుమారి, సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఉప సర్పంచ్ గాదె సాగర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కొదమకొండ్ల నాగరత్నం, రైతు సంఘం నాయకులు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. అన్నదాతలకు అండగా ఉంటా: ఆర్కే పెనుమాక (తాడేపల్లి రూరల్):రాజధాని భూ సేకరణ విషయంలో ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, కుయిక్తులు పన్నిన, అన్నదాతలకు కడదాక అండగా ఉంటానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణరెడ్డి (ఆర్కే) హామీఇచ్చారు. సోమవారం రాత్రి పెనుమాక గ్రామంలో జరిగిన రైతుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. మంగళగిరి నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా తమ పంట భూములను రాజధాని నిర్మాణం నిమిత్తం ఇవ్వడానికి సిద్ధంగా లేడన్నారు. ప్రాణాలైనా ఆర్పిస్తాం, సెంటు భూమి కూడా వదలుకునేది లేదంటూ, రైతులు ఒక పక్కన మొత్తుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం అన్నదాత గోడు పట్టించుకోకుండా సింగపూర్, జపాన్ పర్యటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చట్టబద్ధత లేని ప్యాకేజీల వల్ల రైతన్నలకు ప్రయోజనం లేదన్నారు. మాజీ ఎంపీపీ దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎంపీపీ పచ్చల రత్నకుమారి, ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి, మండల పార్టీ కన్వీనర్ పాటిబండ్ల కృష్ణమూర్తి, భీమవరపు సాంబిరెడ్డి, దంటూ గోవర్ధనరెడ్డి, సొసైటీ ప్రెసిడెంట్ మేకా శివారెడ్డి తదితర పెద్దలు అన్నదాతలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. -
ఏపీ రాజధాని నిర్మాణంలో మేమూ కలుస్తాం
సింగపూర్ ప్రభుత్వం ప్రతిపాదన జీ టూ జీ విధానంలో నిర్మిద్దామని సూచన న్యూఢిల్లీ: ఏపీ రాజధాని నిర్మాణం, అభివృద్ధిపై సింగపూర్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఏపీ రాజధానిని జీ టూ జీ (ప్రభుత్వం -ప్రభుత్వం) విధానంలో అభివృద్ధి చేయవచ్చ ని, ఇందులో తామూ భాగస్వాములవుతామని సూచించింది. ముగ్గురు మంత్రుల సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధి బృందం బుధవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో సుదీర్ఘంగా చ ర్చించింది. సింగపూర్ మంత్రులు గో చోక్ టాం గ్, ఎస్.ఈశ్వరన్, డెస్మాండ్ లీ ఈ బృందంలో ఉన్నారు. ఈ నగరాన్ని ప్రభుత్వాల భాగస్వామ్యంతో జీ టూ జీ విధానంలో అభివృద్ధి చేయాలని బృందం వెంకయ్యకు సూచించింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు సింగపూర్ ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామిగా ఉంటుం దని ప్రతిపాదించింది. ఈ సూచనను పరిశీలిస్తామని, పట్టణాభివృద్ధి కార్యదర్శి శంకర్ అగర్వాల్ తదుపరి సంప్రదింపులు జరుపుతారని వెంకయ్య చెప్పారు. కేంద్రం చేపట్టిన వంద స్మార్ట్ సిటీల పథకం మౌలిక స్వరూపం, విధివిధానా లు, రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం తదితర వివరాలను ఈ బృందం తెలుసుకుంది. పట్టణాభివృద్ధి రంగంలో ఇరు దేశాల పరస్పర సహకారానికి సంబంధించి పలు అంశాలపైన కూడా చర్చించారు. ఈ సందర్భంగా నగరాల్లో ప్రజలకు మెరుగైన సేవలు, నీటి శుద్ధి, సరఫరా, గ్యాస్ సరఫరా, రవాణా, ఇంధన నిర్వహణ, వైద్యం, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానంపై చర్చ జరిగింది.