సింగపూర్ ప్రభుత్వమే నిర్మించే రాజధాని తుళ్లూరు
నేలపాడు(తుళ్లూరు) : పూర్తిస్థాయిలో సింగపూర్ ప్రభుత్వం నిర్మించే రాజధాని నవ్యాంధ్రప్రదేశ్ మాత్రమేనని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పి. నారాయణ వెల్లడించారు. సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్‌తో కలసి శుక్రవారం నేలపాడు వచ్చిన మంత్రి భూ సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఒక్కరోజు 40 మంది రైతులు తమ 106.48 ఎకరాల భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ మంత్రికి అంగీకార పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడారు.
నేలపాడులో మొత్తం 1470 ఎకరాల భూమి ఉందన్నారు. దీనిలో 1206 ఎకరాల పట్టాభూమిని మొత్తం 685 మంది రైతులు రాజధానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలిపారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ భూసేకరణ చట్టం ద్వారా భూములు తీసుకుంటే రైతులకు తీవ్ర నష్టం వస్తుందని భావించిన సీఎం ల్యాండ్ పూలింగ్ చేపట్టినట్టు తెలిపారు. నూతన రాజధానిలో మొదటి లబ్ధి ఈ ప్రాంత రైతులకే దక్కుతుందన్నారు. జూన్‌లో సింగపూర్ ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్ ఇస్తే వెంటనే మంచి రోజు చూసుకుని రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.తొలి దశ పనులు మూడేళ్లలో పూర్తి కాగలవని అంచనా వేశామన్నారు.
మురుగు నీరు బయటకు వెళ్లే అవకాశం లేని నేలపాడు గ్రామాన్ని ప్రభుత్వం తీసు కోవాలని ఓ రైతు కోరగా ప్రస్తుతం గ్రామాలను కదిలించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.
సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు, వివాదాలను పరిష్కరిస్తూ రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ అనుమతి ప్రతాలను తీసుకునేందుకు డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసమూర్తిని భూ సమీకృత అధికారిగా నియమిస్తున్నట్లు చెప్పి ఆయనను రైతులకు పరిచయం చేశారు.
అనంతరం మంత్రి, సీఆర్‌డీఏ కమిషనర్ భూములు ఇచ్చే రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుని రశీదులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, జేసీ చెరుకూరి శ్రీధర్,ఆర్డీవో భాస్కరనాయుడు, తహశీల్దార్ సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలు అందజేసిన రైతులు
కొమ్మినేని ఆదిలక్ష్మి 3.5 ఎకరాలు, కాటా అప్పారావు ఎకరం, ధనేకుల రామారావు 11 ఎకరాలు, భూక్యా సాలి 80 సెంట్లు, కొమ్మినేని శేషగిరిరావు 5 ఎకరాలు, ఇందుర్తి నాగమల్లేశ్వరరావు 55 సెంట్లు, గుజ్జర్లపూడి తిరుపతిరావు ఎకరం, కణతరపు సాంబశివరావు 4.75 ఎకరాలు, పారా పార్వతి 95 సెంట్లు, ఆలూరి వెంకటేశ్వరరావు 6 ఎకరాలు, మూల్పూరి రాంబాబు 5.75 ఎకరాలు, కె.రాఘవయ్య 5 ఎకరాలు, ఇందుర్తి వెంకటేశ్వరరావు 55 సెంట్లు, యంపరాల నవత 1.50 ఎకరాలు, కొమ్మగూర ఇసాక్ 1.70 ఎకరాలు, కణతరపు శ్రీమన్నారాయణ 3.5 ఎకరాలు. ఇంకా పలువురు ఉన్నారు.
తొలిరోజు 106.48 ఎకరాలు
నేలపాడులో శుక్రవారం జరిగిన ల్యాండ్ పూలింగ్ కార్యక్రమంలో 106ఎకరాల 48 సెంట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు 40 మంది రైతులు అంగీకార పత్రాలను సమర్పించారు. మొదటి రోజు కనీసం 500 ఎకరాలకు అంగీకార పత్రాలు తీసుకోవాలనే లక్ష్యంతో అధికారులు, మంత్రి, సీఆర్‌డీఏ కమిషనర్ గ్రామానికి వచ్చారు.
అయితే శుక్రవారం కావడం ఒక కారణమైతే, మరోవైపు భారీ వర్షం కురవడంతో రైతులు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. దీనిపై తహశీల్దార్ సుధీర్‌బాబు మాట్లాడుతూ తొలిరోజు 40 మంది రైతులు ముందుకు రావడం ఆశించదగిన పరిణామం అన్నారు. శనివారం ఎక్కువ మంది రైతులు వచ్చే అవకాశం వుందని అన్నారు. వారంలోపు నేలపాడులో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.