మచిలీపట్నం: పోర్టులు, టూరిజం ద్వారానే సింగపూర్ అభివృద్ధి చెందిందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) కార్యాలయాన్ని శనివారం మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని అమరావతి తరహాలోనే మచిలీపట్నంలో పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం 33,177 ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు చెప్పారు.
మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎంఏడీఏ కార్యాలయం ప్రారంభించిన రోజే భూసమీకరణ 1370 ఎకరాలను రైతులను ప్రభుత్వానికి అప్పగించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో 14 పోర్టులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. మొదటి ప్రాధాన్యత మచిలీపట్నం పోర్టుకు ఇస్తున్నారన్నారు. సింగపూర్ 720 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఉందన్నారు. పోర్టుల ద్వారా సరుకులు ఎగుమతులు, దిగుమతులు చేస్తూ అభివృద్ధి చెందిన దేశంగా పేరొందిందన్నారు.
జపాన్ జనభా 13 కోట్లు ఉండగా అక్కడ 1020 పోర్టులు ఉన్నాయన్నారు. వీటిలో 106 మేజర్ పోర్టులు, 22 స్పెషల్ మేజర్ పోర్టులు, చైనాలో 2వేల పోర్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కారణంతోనే ఆ దేశాలు అభివృద్ధి చెందాయన్నారు. మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ పట్టిసీమను నిర్మిస్తుంటే కొందరు అడ్డుకున్నారని, పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం భూసమీకరణ చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు అడ్డుకుంటున్నారని అయినా పోర్టు నిర్మించి తీరుతామని అన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు పోర్టు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణాన్ని అడ్డుకోకుండా తమకు సహకరించాలని కోరారు. శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, ఎమ్మెల్సీ పీతా రవిచంద్ర, ఇన్‌చార్జ్ కలెక్టర్ గంధం చంద్రుడు, మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
'3 నెలల్లో భూ సమీకరణ పూర్తిచేస్తాం'
Published Sat, Oct 15 2016 6:23 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
Advertisement