Governmental institutions
-
మా పిల్లల్ని సర్కార్ బడికే పంపుతాం
గుర్రాలగొంది గ్రామస్తుల తీర్మానం చిన్నకోడూరు: పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలకు సీజన్ ప్రారంభమైంది. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా తమ ప్రచారం చేస్తున్నాయి. గుర్రాలగొందిలో సోమవారం గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేసి తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపేది లేదని, ప్రభుత్వ పాఠశాలలకే పంపుతామని తీర్మానించారు. ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం బోధిస్తే తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపబోమని తీర్మానిస్తూ వినతి పత్రాన్ని ఎంఈఓ గోపాల్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో కనీస వసతులు ఉండవని, నాణ్యమైన విద్య అందదన్నారు. ప్రైవేటు మోజులో పడితే డబ్బులు వృథా అవుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందజేస్తారన్నారు. నైపుణ్యం కలిగిని ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తారన్నారు. ఎవరూ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపవద్దని సూచించారు. గ్రామంలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ మల్లేశం, విద్యాకమిటీ చైర్మన్‌తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. డబ్బులు చెల్లించడం కష్టంగా మారింది... కరువు పరిస్థితుల్లో కుటుంబ పోషణ భారంగా ఉన్న సమయంలో తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్‌కు పంపించడం కష్టంగా మారింది. స్కూల్లలో వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. చదువు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. తమ గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు ఉన్నందున ఇక్కడే చదివించాలనుకుంటున్నాం. - బోయిని మధు, విద్యార్ధి తండ్రి వత్తిడి ఎక్కువ అవుతోంది... తమ పిల్లలు సిద్దిపేటలోని ప్రైవేట్ పాఠశాలకు ఉదయం వెళితే తిరిగి ఇంటికి చేరుకునే సరికి రాత్రి పడుతుంది. దీంతో ఇంటి వద్ద చదువుకోవడానికి సమయం దొరకడం లేదు. అలాగే పిల్లలు రోజంతా స్కూల్లోనే గడుపడం ద్వారా వత్తిడికి గురవుతున్నారు. ప్రయాణాల్లో సైతం ప్రమాదాలు జరిగే అవకాశముంది. -ఎస్. రమేష్, విద్యార్ధి తండ్రి -
రేపే టీఎస్ ఐసెట్
సాక్షి, హైదరాబాద్/కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం (19న) నిర్వహించనున్న టీఎస్ ఐసెట్-2016కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె. ఓంప్రకాశ్ మంగళవారం వెల్లడించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని.. పరీక్ష ప్రారంభానికి గంట ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తామన్నారు. కాకతీయవర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పరీక్షకు 72,474 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 16 రీజినల్ సెంటర్ల పరిధిలో 127 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, అన్నీ ప్రభుత్వ విద్యాసంస్థలేనని తెలి పారు. పరీక్ష కోసం 127 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 32 మంది ప్రత్యేక పరిశీలకులను, 140 మంది లోకల్ అబ్జర్వర్లను నియమించామని, ఐసెట్‌కు తొలిసారిగా బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నామని ఓంప్రకాశ్ వివరించారు. ఇందుకోసం ప్రతి పరీక్ష కేంద్రంలో బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. వారు అభ్యర్థుల వేలిముద్రలతోపాటు డిజిటల్ ఫొటోలనూ తీసుకుంటారన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్లతోపాటు పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం, బ్లూ లేదా బ్లాక్ పెన్నులు తెచ్చుకోవాలని సూచించారు. అభ్యర్థుల కోసం గతేడాది ఐసెట్ ప్రశ్నపత్రం, ‘కీ’ని www.tsicet.org వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. పరీక్ష కేంద్రాలకు సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమన్నారు. ఈ నెల 21న ప్రాథమిక ‘కీ’ని విడుదల చేస్తామని, 24 వరకు అభ్యంతరాలను స్వీకరించి 31న తుది ‘కీ’తోపాటు ఫలితాలను వెల్లడిస్తామన్నారు.