ప్రజల విశ్వాసాన్ని చూరగొందాం
కార్యకర్తలకు అండగా నిలుద్దాం
ఎంపీ కార్యాలయ ప్రారంభ సభలో వైఎస్ఆర్సీపీ నేతలు
తిరుపతి : ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడి ప్రజల విశ్వాసాన్ని చూరగొందామని వైఎస్ఆర్సీపీ నా యకులు పిలుపునిచ్చారు. స్థానిక కేశవాయనగుంటలో తిరుపతి ఎంపీ వరప్రసాదరావ్ కార్యాలయం బుధవారం ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా ఎంపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూజలు చేసి నివాళులు అర్పించిన అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 100 రోజుల పాలనపట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేశామా అని పశ్చాత్తాప పడుతున్నారన్నారు.
జిల్లాలో ఇక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేని టీడీపీని భవిష్యత్తులో ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మొన్నటి ఎన్నికలలో తిరుపతిలో వైఎస్ఆర్సీపీ పరాజయం చెందడం బాధాకరమని, కరుణాకరరెడ్డి అనునిత్యం ప్రజల మధ్యనే ఉండి వారి సమస్యల పరిష్కారానికి పలు పోరాటాలు చేశారన్నారు. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని చంద్రబాబు ఎన్ని అడ్డదార్లు తొక్కాలో అన్నీ తొక్కారన్నారు.
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధించి భయపెట్టాలని చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తామని ఇన్నాళ్లు పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలను తమ భుజాలపై మోస్తామని కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. దివంగత నేత వైఎస్ఆర్ లాగా కార్యాలయాన్ని ప్రారంభించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎంపీ వరప్రసాదరావ్ను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకరరెడ్డి అభినందించారు. నాయకులు కలసికట్టుగా పనిచేసి పార్టీ ప్రతిష్టను మరింతగా ఇనుమడింప చేద్దామని జిల్లా అధ్యక్షులు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రోద్బలంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతున్న అధికారులకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన కోరారు.
హామీల అమలుకు కృషి చేస్తా
వైఎస్ఆర్సీపీ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఎంపీ వరప్రసాదరావ్ అన్నారు. తిరుపతి తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మన్నవరం, అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం, గాలేరు-నగరి ప్రాజెక్టు, తిరుపతిలో దశాబ్దాల తరబడి నివాసాలు ఉన్న ఇళ్లకు పట్టాలు తదిదర సమస్యలపై దృష్టి సారించినట్లు చెప్పారు.
ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనే ఉద్దేశంతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశానన్నారు. ప్రజలు తాను కార్యాలయంలో అందుబాటులో లేని సమయాల్లో వినతి పత్రాలను కార్యాలయంలో అందచేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, పోకల అశోక్‌కుమార్, షఫీ అహమ్మద్ ఖాద్రీ, పుల్లయ్య, చెలికం కుసుమ, టీ.రాజేంద్ర తదితరులు ప్రసంగించారు. మబ్బు చెంగారెడ్డి, పులుగోరు ప్రభాకర్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్, వైఎస్ జగన్ అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.