డీపీసీ నగారా మోగింది
ఎన్నికలకు సర్కారు అనుమతి
సమాయత్తమవుతున్న అధికారులు
డిసెంబర్ 8న నోటిఫికేషన్ విడుదల
12న నామినేషన్లు..15న పరిశీలన
17న పోలింగ్.. అదేరోజు ఫలితాలు
పదిరోజులపాటు సాగనున్న ప్రక్రియ
నిజామాబాద్: జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) సభ్యుల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా, డీపీసీ ఖరారు కాకపోవడంతో రెండు పర్యాయాలు పాత కమిటీతోనే సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగా క డీపీసీ సభ్యులను ఎన్నుకోవడం ఆనవాయితీ. ఆలస్యంగానైనా డీపీసీ ఏర్పాటుకు తెర లేసింది. డిసెంబర్ 17న ఎన్నికలునిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్ ఖరారు చేసుకోవాలని ప్రభుత్వ ముఖ్య కా ర్యదర్శి జె. రేమండ్ పీటర్ గురువారం జిల్లా ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
కమిటీ రూపం ఇదీ
జిల్లా ప్రణాళిక కమిటీలో మొత్తం 30 మంది సభ్యులుంటారు. చైర్మన్‌గా జడ్పీ చైర్పర్సన్ ఉంటారు. కన్వీనర్,మెంబర్ సెక్రెటరీగా కలెక్టర్ వ్యవహరిస్తారు. నలుగురిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మిగతా 24 మందిని స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు. జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. డీపీసీ సభ్యులను 20 శాతం నగరం/పట్టణాల నుంచి, 80 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి ఎన్నుంటారు. జిల్లాలో వివిధ పథకాల కింద చేపట్టే అభివృద్ది పనుల ప్రతి పాదన, ఆమోదాలలో డీపీసీ కీలకంగా వ్యవహరిస్తుంది. బీఆర్‌జీఎఫ్‌లోనూ చురుకుగా ఉంటుంది. దీంతో సుమారు పది రోజు లపాటు జరిగే ఎన్నికల ప్రక్రియ కూడా అధికారులకు కీలకంగా మారనుంది.
ఇదీ వరుస
24 మంది డీపీసీ సభ్యుల కోసం జరిగే ఎన్నికలకు డిసెంబర్ ఎనిమిదిన షెడ్యూల్ విడుదల అవుతుంది. అదేరోజు ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితాను రూపొందించేందుకు నోటిఫికేషన్ ఇస్తారు. 8,9,10 తేదీలలో ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. 11న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారు. 12న నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 15న వాటిని పరిశీలించి, అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తారు. 16న నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా, 17న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఓట్లను లెక్కించి సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ ఎన్నికలలో 50 మంది జడ్పీటీసీ సభ్యులు, 141 మంది కార్పొ రేటర్లు, కౌన్సిలర్లు ఓటు వేసేందుకు, పోటీచేసేందుకు అవకాశం ఉంది. దాదాపుగా డీపీసీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అవుతుందన్న చర్చ కూడ జరుగుతోంది.