ఇసుక కష్టాలకు చెక్!
మరో నాలుగు రీచ్‌లకు ప్రభుత్వ అనుమతి
పెదపులిపాక, రొయ్యూరు, శ్రీకాకుళం, చాగంటిపాడులో నూతన రీచ్‌లు
హద్దులు గుర్తించిన అధికారులు
పర్యావరణ అనుమతుల కోసం నిరీక్షణ
వచ్చే నెలలో వేలం పాట
సాక్షి, విజయవాడ : నిర్మాణ రంగానికి శుభవార్త. జిల్లాలో ఇసుక అవసరం బాగా పెరగడంతో మరో నాలుగు రీచ్‌ల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు అధికారులు కార్యాచరణ ప్రణాళికను పూర్తిచేసి పర్యావరణ అనుమతుల కోసం పంపారు. మరో పది రోజుల్లో పర్యావరణ శాఖ నుంచి అనుమతులు లభించే అవకాశం ఉంది. అనంతరం వచ్చే నెలలో వేలం ప్రక్రియ ద్వారా ఇసుక రీచ్‌లను కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
నూతన రీచ్‌లు ఇవే..
పెనమలూరు మండలంలోని పెదపులిపాడు, తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు, రొయ్యూరు, ఘంటసాల మండలంలోని శ్రీకాకుళంలో నాలుగు రీచ్‌లు ఉన్నాయి. ఆయా రీచ్‌లలో గతంలో అనధికారికంగా తవ్వకాలు జరిగేవి. విజిలెన్స్, మైనింగ్ శాఖ అధికారులు దాడులుచేసి కేసులు నమోదు చేయడంతో అక్రమ తవ్వకాలకు బ్రేక్ పడింది.
నూతనంగా ఈ నాలుగు రీచ్‌లకు అనుమతి లభించింది. పెదపులిపాకలో కరకట్ట వద్ద 50 ఎకరాలు, చాగంటిపాడులో 10 ఎకరాలు, శ్రీకాకుళంలో 20 ఎకరాలు, రొయ్యూరులో 40 ఎకరాల్లో ఇసుక తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించారు. మైనింగ్‌శాఖ అధికారులు గత నెల్లో ఆయా మండలాల అధికారులతో చర్చించి కరకట్ట ప్రాంతాల్లో ఇసుక మేటలను సర్వే చేసి రీచ్‌లుగా గుర్తించారు. ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు.
ఈ మేరకు ప్రభుత్వ అనుమతి లభించింది. పర్యావరణ శాఖ అనుమతి కోసం 15 రోజుల క్రితం నివేదిక పంపారు. పర్యావరణ శాఖ నుంచి అనుమతులు వస్తే వెంటనే జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వేలం ప్రక్రియ నిర్వహిస్తారు. త్వరలోనే నాలుగు రీచ్‌లు ప్రారంభమవుతాయని మైనింగ్ శాఖ విజయవాడ డివిజన్ ఏడీ బి.రామచంద్రరావు ‘సాక్షి’కి తెలిపారు. తద్వారా తమ శాఖకు ఆదాయం కొంత పెరుగుతుందని చెప్పారు. ఇప్పుడు నామమాత్రంగానే సీనరేజీ వస్తోందని పేర్కొన్నారు.
ఆ నాలుగు రీచ్‌లలో జోరుగా అక్రమ తవ్వకాలు!
ప్రస్తుతం డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, విజయవాడ రూరల్ మండలంలోని సూరాయిపాలెం, విజయవాడ నగరంలోని భవానీపురం పున్నమి ఘాట్ వద్ద ప్రస్తుతం ఇసుక రీచ్‌లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ అవసరాల నిమిత్తం మైనింగ్ శాఖ అధికారులు ఈ నాలుగు ఇసుక రీచ్‌లకు హద్దులు నిర్ణయించి నీటిపారుదల శాఖ అధికారులకు అప్పగించారు. నీటిపారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో ఇసుక తవ్వి విక్రయిస్తున్నారు.
వేలం పాట కూడా లేకుండా ఇరిగేషన్ శాఖకు ఇసుక రీచ్‌లు అప్పగించడంతో మైనింగ్ శాఖకు నామమాత్రంగానే సీనరేజ్ లభిస్తోంది. నాలుగు రీచ్‌ల ద్వారా అధికారికంగా నెలకు సగటున రెండు వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే నీటిపారుదల శాఖ అధికారులు వారం రోజులు, నెల కాలపరిమితితో పలువురు కాంట్రాక్టర్లకు ఇసుకను తవ్వుకోవటానికి అనుమతులు ఇస్తుంటారు. దీంతో అనధికారికంగా రెట్టింపు స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇతర జిల్లాలకు ఎగుమతులు
విజయవాడ డివిజన్ నుంచి జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు ఎగుమతులు చేస్తున్నారు. మార్కెట్లో ఇసుక కొతర ఎర్పడినప్పుడు ఇక్కడ లారీ ఇసుక (3.5 క్యూబిక్ మీటర్లు)ను అత్యధికంగా 20 వేలకు విక్రయించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ పరిణామాల క్రమంలో జిల్లాలో ఇసుక వినియోగం బాగా పెరిగిందని, గతంతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో అవసరం ఉందని అధికారులు నివేదించడంతో మరో నాలుగు రీచ్‌లకు ప్రభుత్వం అనుమతించింది.