ఐక్యత పరిరక్షణకు పాటుపడాలి: ఎల్జీ
న్యూఢిల్లీ: జాతీయ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభ్‌భాయ్ 139వ జయంతి సందర్భంగా ఎల్జీ... రాజ్‌నివాస్‌లో శుక్రవారం తన సిబ్బంది ‘రాష్ట్రీయ ఐక్యతా దినోత్సవ’ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జంగ్ మాట్లాడుతూ చరిత్రను మరిచిన జాతి కొత్త చరిత్రను సృష్టించలేదంటూ 30 సంవత్సరాల నాటి సిక్కుల ఊచకోత, అనంతరం ఆనాటి ప్రధానమంత్రి ఇంది రాగాంధీ హత్య ఘటనను ఆయన ప్రస్తావించారు. మరోవైపు రాజ్నివాస్తోపాటు ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన వివిధ కార్యాలయాల్లోనూ అధికారులతోపాటు సిబ్బం ది రాష్ట్రీయ ఏక్త దివస్ ప్రమాణం చేశారు.
ఈ సందర్భంగా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఉపకులపతి దినేష్ సింగ్.. దేశ తొలి హోం శాఖ మంత్రికి ఘననివాళులర్పించారు. విశ్వవిద్యాలయంలోని వివిధ శాఖలతోపాటు దీని పరిధిలోని వివిధ కళాశాలల్లో రాష్ట్రీయ ఏక్త దివస్ ప్రమాణ కార్యక్రమం జరిగింది. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ... సర్దార్ వల్లభ్‌భాయ్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా ప్రకటించిన సంగతి విదితమే. యూనిటీ రన్‌కు రాష్ట్రపతి పచ్చజెండా సర్దార్ వల్లభ్‌భాయ్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్ వద్ద శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ‘యూనిటీ ఫర్ రన్’ను ప్రారంభించారు. ఈ రన్లో దాదాపు రెండు వేలమంది ఔత్సాహికులు పాల్గొన్నారు.