ధరలపై పోరు ... దువ్వూరి సారు !
సాక్షి, బిజినెస్ డెస్క్:భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధిపతిగా దువ్వూరి సుబ్బారావు పగ్గాలు చేపట్టేనాటికి పశ్చిమ దేశాల ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. చెక్కుచెదరని చిరునవ్వు... ఆత్మవిశ్వాసంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న దువ్వూరి... ఆ సంక్షోభ ఛాయలు మన బ్యాంకులపై పడకుండా చూశారు. నాటి నుంచి ద్రవ్యోల్బణంతో ఐదేళ్లుగా పోరాడుతూనే వచ్చారు. ప్రధాని, ఆర్థిక మంత్రితో సహా అంతా వృద్ధి గురించే మాట్లాడుతుండగా... ధరల్ని అదుపు చేయాలంటే కొంత వృద్ధిని త్యాగం చేయాల్సిందేనన్నారు దువ్వూరి. బుధవారంతో పదవీ విరమణ చేస్తున్న ఈ 1972 సివిల్స్ టాపర్ ఐదేళ్ల ప్రస్థానమిదీ...
ధరల కట్టడికే ప్రాధాన్యం...
ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్‌తో సహా పశ్చిమ దేశాల కేంద్ర బ్యాంకులు ప్యాకేజీలంటూ వ్యవస్థలోకి ద్రవ్య సర ఫరాను పెంచాయి. దీంతో చమురు, లోహాల ధరలకు రెక్కలొచ్చాయి. వాటి దిగుమతులపైనే ఆధారపడ్డ భారత్‌లో ధరలు నింగినంటాయి. ఇటు దేశంలో పంటల దిగుబడి పెరగడానికి, వాటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి తగు ప్రోత్సాహకాలు, చర్యలు లేకపోవటంతో ఆహారోత్పత్తుల ధరలూ పెరిగిపోయాయి. ఈ రెండు రకాల ద్రవ్యోల్బణాలు రెండంకెల స్థాయికి చేరి పేద, మధ్యతరగతి ప్రజల్ని బెంబేలెత్తించాయి.
ఈ ద్రవ్యోల్బణానికి కళ్ళెం వేయడమే తమ ప్రాధాన్యతంటూ... 2010 మార్చి నుంచి దువ్వూరి ఏకంగా 13 దఫాలు వడ్డీ రేట్లు పెంచారు. వడ్డీరేట్లు తగ్గించాలని కార్పొరేట్లు, ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిళ్లను పక్కనబెట్టారు. టోకు ద్రవ్యోల్బణం రేటును 10 నుంచి 4 శాతానికి దించగలిగారు. అయితే ఆర్బీఐ చర్యలతో సంబంధం లేని, కేవలం ప్రభుత్వ విధానాల మీదే ఆధారపడే రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం ఇంకా గరిష్టస్థాయిలోనే సెగలు కక్కుతోంది.
రూపాయిపై ఒంటరి పోరు...
అంతలోనే రూపాయి పతనం మొదలైంది. సబ్సిడీలకు తోడు అస్తవ్యస్త విధానాల వల్ల కరెంటు ఖాతా లోటు (దేశంలోకి వచ్చే డాలర్లు మైనస్ వెళ్లే డాలర్లు) పెరిగిపోయింది. ఈ ప్రమాదంపై గతేడాది ప్రథమార్ధంలోనే దువ్వూరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయినా విదేశీ మారక నిల్వలు పెంచేలా, లేదా విదేశీ మారక ఖర్చు తగ్గించేలా కేంద్రం ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో కరెంటు ఖాతా లోటు 4.8 శాతానికి చేరింది. ఫలితంగా గడిచిన ఏడాదిలో 20 శాతానికి పైగా రూపాయి విలువ పతనమైంది. దాంతో దిగుమతుల కోసం ఎక్కువ రూపాయల్ని వెచ్చించాల్సి వచ్చింది.
ముడిచమురు, బంగారం, బొగ్గు, వంటనూనెలు, ఎలక్ట్రానిక్ పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటంతో రూపాయి పరోక్షంగా ధరల పెరుగుదలకు కారణమయింది. ద్రవ్యోల్బణంపై పోరులో ఆర్బీఐ చేయగలిగింది చేస్తోందని, దానికి ప్రభుత్వ చర్యలు తోడవ్వాలని దువ్వూరి అదేపనిగా చెప్పారు. కానీ భారత్‌లో పెట్టుబడులకు ప్రపంచమంతా ఆసక్తిగా వున్నపుడు కీలక నిర్ణయాల్ని వాయిదా వేస్తూ రావడంతో రూపాయి అదుపు తప్పిపోయింది. విదేశీ పెట్టుబడిదారులు విసిగిపోయిన సమయంలో కొన్ని రంగాల్లో ఎఫ్‌డీఐ పరిమితిని పెంచినా లాభం లేకపోయింది. దాంతో రూపాయిపై దువ్వూరి ఒంటరిపోరు సాగించారు.
ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో బ్యాంకులు విచ్చలవిడి స్పెక్యులేషన్‌కు పాల్పడుతుండటంతో దాన్ని నిరోధించేందుకు ఈ ఏడాది జూలై 15న ఒక్కసారిగా బ్యాంక్ రేటును 2 శాతంపైగా పెంచేశారు. అది ఫలితాల్నిస్తున్న సమయంలో... పెంపు తాత్కాలికమేనంటూ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన ప్రకటన తిరిగి రూపాయిని పడేసింది. ఆర్థికాభివృద్ధే ఆర్బీఐ ప్రధాన లక్ష్యం కావాలని, ధరల అదుపు అంశం అందులో ఒక భాగమేనని ఒక పక్క చిదంబరం అంటుంటే, ధరల కట్టడే తమ ప్రాధాన్యతా లక్ష్యమంటూ దువ్వూరి పేదల పక్షపాతి అనిపించుకున్నారు.
చిదంబరం x దువ్వూరి
అనేకసార్లు తనపై విమర్శనాస్త్రాలు సంధించిన ఆర్థికమంత్రి చిదంబరానికి దువ్వూరి పరోక్షంగానే సమాధానమిచ్చారు. కానీ ఇటీవల పదవీ విరమణకు ముందు ప్రత్యక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఆర్బీఐ ఉండటం వల్లే దేశం బతికి బట్టకట్టిందని చిదంబరం స్వయంగా అనే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. ఏదో ఒక రోజు చిదంబరం సైతం ‘నేను మా రిజర్వ్ బ్యాంక్‌తో విసుగెత్తిపోయా. ఎంతలా అంటే... అవసరమైతే ఒంటరిగానే పోరాటం చేయాలనుకున్నా. కానీ దేవుడి దయవల్ల రిజర్వ్ బ్యాంక్ అనేది ఒకటి ఉండటం మంచిదైంది... అనే రోజు వస్తుంది’ అంటూ జర్మనీ మాజీ చాన్స్‌లర్ గెరార్డ్ ష్రోడర్‌ను ఉటంకించారు దువ్వూరి.
బ్యాంకింగ్ లెసైన్స్‌ల విషయంలోనూ ఇద్దరి మధ్యా మాటలు పేలాయి. ‘కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌లకు పరిమితి ఉండకపోవచ్చు. దరఖాస్తు చేసిన కంపెనీలకు అర్హతలుంటే ఎన్ని లెసైన్స్‌లైనా ఇవ్వొచ్చు. పల్లెలన్నిటికీ బ్యాంకింగ్ సేవలు అందాలంటే భారీ సంఖ్యలో బ్యాంకులు కావాలి’ అని చిదంబరం చెప్పిన రెండు రోజులకే దువ్వూరి స్పందించారు. ‘అర్హతలున్న కంపెనీలన్నింటికీ కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌లు ఇవ్వడం సాధ్యం కాదు’ అని తేల్చిచెప్పారు.
ఒక స్థాయిలో ధరలు పెరగడం ఆర్థికాభివృద్ధికి చిహ్నమే. కొన్ని దేశాల్లో డిమాండ్ తగ్గి మందగమన పరిస్థితిల్లో నెగెటివ్ ద్రవ్యోల్బణం నెలకొంది. మనం మాత్రం ద్రవ్యోల్బణం పెరిగి ఇబ్బంది పడుతున్నాం. నేను కొన్ని దేశాల సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లను కలిసినప్పుడు వారు.. మీ ద్రవ్యోల్బణంలో కొంత ఇవ్వరాదూ!! అని అడుగుతున్నారు - 2011 జనవరి 17న కొందరు విద్యార్థులతో...
‘‘ఈ ద్రవ్యోల్బణం లెక్కలేంటో నాకు ఒకపట్టాన అర్థం కావడంలేదు. 20 ఏళ్ల క్రితం హెయిర్ కటింగ్‌కు నేను రూ.25 ఇచ్చాను. తర్వాత నా జుట్టు పలుచబడినా కటింగ్ ఖర్చు మాత్రం రూ.50కి పెరిగింది. ఇప్పుడు జుట్టు రావటం లేదు. అయినా హెయిర్‌కట్‌కు రూ.150 ఇస్తున్నాను. ద్రవ్యోల్బణం ఎంత? రావడం ఆగిపోయిన జుట్టుకు కటింగ్ కోసం నేను చెల్లిస్తున్న ప్రీమియం ఎంత? ఇవి నాకు అర్థం కావటం లేదు’’ - 2012 జూలై 17న యూసీబీ గణాంకాల శాఖ ఉన్నతాధికారులతో...
నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) వద్దని ఎన్‌బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి అంటారు. దానిని కొనసాగించాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి వాదిస్తారు. అందుకని ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ గత రాత్రి సంతకాలు చేశా. సీఆర్ఆర్ ఉండాలా వద్దా అన్నది ఈ కమిటీ తేలుస్తుంది. దీన్లో డాక్టర్ చక్రవర్తి, ప్రతీప్ చౌదరి సభ్యులుగా ఉంటారు. దీనిపై ఒక అంగీకారానికి వచ్చేదాకా వారినొక గదిలో పెట్టి తాళం వేస్తాం. నా పదవీకాలం పూర్తయ్యేలోపు వారు నివేదిక సమర్పించాల్సిన పనిలేదు’’ - 2012 సెప్టెంబర్ 4న జరిగిన బ్యాంకర్లు సదస్సులో
దేశీయంగా, అటు అంతర్జాతీయంగా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో దువ్వూరి ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇంతటి క్లిష్ట సమయంలో ఆయనకంటే వేరెవ్వరూ మెరుగ్గా చేయలేరన్నదే నా ఉద్దేశం.
- శిఖా శర్మ, యాక్సిస్ బ్యాంక్ సీఈఓ, ఎండీ
ఎన్నో ఒడిదుడుకులకు తట్టుకుంటూ దువ్వూరి తనేంటో నిరూపించుకున్నారు. అందుకే ఆయనంటే అమితమైన గౌరవం. జ్ఞానం, అనుభవం వల్ల ఎవరి సత్తాఏంటో తేలిపోతుంది. దువ్వూరి సమర్థంగా పనిచేశారు.
- అదిత్య పురి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ
ఈ ఐదేళ్లలో దువ్వూరి నగదు నిల్వల నిష్పత్తి, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తులను చెరో 4% చొప్పున తగ్గించారు. నా దృష్టిలో ఇది చాలా గొప్ప విషయం. ఆర్థిక వ్యవస్థలో కొద్దోగొప్పో సానుకూల ధోరణి ఉదంటే ఇదే కారణం.
- ప్రతీప్ చౌదరి, ఎస్బీఐ చైర్మన్