కేజ్రీవాల్‌కు ఎల్జీ షాక్.. రూ. 97 కోట్లు కట్టాల్సిందే!
ఇంతకుముందున్న లెఫ్టినెంట్ గవర్నర్‌తో దాదాపు ప్రతిరోజూ కొట్లాటలకు దిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కొత్త ఎల్జీ అనిల్ బైజల్‌తోనూ తలనొప్పి తప్పలేదు. ప్రభుత్వ ప్రకటనలలో కేజ్రీవాల్‌ను చూపించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రూ. 97 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంఎం కుట్టిని బైజల్ ఆదేశించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈ ప్రకటనలు ఉల్లంఘించాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రకటనలలో ముఖ్యమంత్రుల ఫొటోలు ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రూ. 97 కోట్లు చెల్లించడానికి పార్టీకి నెల రోజుల గడువు ఇచ్చారు. ఈ ప్రకటనలన్నింటికీ రాష్ట్ర ఖజానా నుంచి డబ్బు చెల్లించారు.
అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన నోటీసులు ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీకి అందినట్లు లేవు. ఇప్పటివరకు ముఖ్యమంత్రికి గానీ, ఉప ముఖ్యమంత్రికి గానీ, పార్టీకి గానీ ఈ నోటీసుల గురించి ఎలాంటి సమాచారం లేదని, తమకు ఏమైనా సమాచారం వస్తే గానీ దీనిపై వ్యాఖ్యానించలేమని ఆప్ వర్గాలు అన్నాయి. ప్రభుత్వ ప్రకటనలలో కేవలం ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫొటోలు మాత్రమే ఉండాలని సుప్రీంకోర్టు 2015లో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షించాలంటూ కేంద్ర ప్రభుత్వం, అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దానివల్ల దేశంలో సమాఖ్య వ్యవస్థకు ముప్పు కలుగుతుందని వాదించాయి. దాంతో గత సంవత్సరం మార్చిలో సుప్రీంకోర్టు తన ఉత్తర్వులను వాయిదా వేసింది. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రుల ఫొటోలను కూడా అనుమతిస్తామని చెప్పింది.