ఎవరీ గోవింద్ భాయ్ డోలాకియా? బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక
బీజేపీ రాజ్యసభ అభ్యర్థల రెండో జాబితాను బుధవారం విడుదల చేసింది. అయితే గుజరాత్ నుంచి జేపీ నడ్డా, గోవింద్ భాయ్ డోలాకియా, మయాంక్‌భాయ్ నాయక్, శ్వంత్‌సిన్హ్ జలంసింహ పర్మార్‌లను ఎంపిక చేసింది. అయితే ప్రస్తుతం గోవింద్ భాయ్ డోలాకియా ఎవరు? ఆయను బీజేపీ ఇంత ప్రాధన్యం ఇవ్వటం ఏంటి? అని చర్చజరుగుతోంది.
రాజ్యసభ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించిన అనంతరం గోవింద్ భాయ్ డోలాకియా మీడియాతో మాట్లాడారు. ‘వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నా ప్రయాణం వ్యాపారవేత్తగా సాగటం ఆనందం. కొన్ని గంటల ముందు నేను రాజ్య సభ అభ్యర్థిగా ఎంపిక అయినట్లు తెలిసింది. అయితే నా పేరును ఫైనల్ చేసేముందు బీజేపీ అధిష్టానం ఆలోచించి ఉండాల్సింది’ అని అన్నారు.
ఎవరీ గోవింద్ భాయ్ డోలాకియా..?
గుజరాత్‌లోని సూరత్‌లో శ్రీ రామ కృష్ణా ఎక్స్‌పోర్ట్స్ పప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంస్థకు గోవింద్ భాయ్ డోలాకియా వ్యవస్థాపకుడు, చైర్మన్. ఇది సూరత్ కేంద్రంగా ఉన్న వజ్రాల తయారీ కంపెనీ. 1970లో ఈ వజ్రాల కంపెనీని ఆయన ప్రారంభించారు. లింక్డ్ఇన్ ఫోఫైల్ ప్రకారం ఆయన కంపెనీలో ఐదు వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ మొత్తం ఆదాయం ప్రస్తుతానికి 1.8 బిలియన్ డాలర్లు ఉన్నట్లు సమాచారం.
ఇక.. ఆయన ఒక ప్రముఖ ప్రజా వక్త, సామాజిక సేవకుడు. దేశంలో పేరుమోసిన పలు విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో వక్తగా వ్యవహరించారు. 2011లో అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం కోసం రూ.11 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. 2014లో తన దాతృత్వం ద్వారా ఎస్ఆర్కే నాలెడ్జ్ ఫౌండేషన్‌ని స్థాపించారు.
ఆమ్రేలికి చెందిన గోవింద్ భాయ్ డోలాకియా వజ్రాల వ్యాపార రంగంలో మొదట ఒక కార్మికుడి తన ప్రయాణం ప్రారంభించారు. తర్వాత అంచెలంచెలుగా వజ్రాల వ్యాపారిగా ఎదిగారు. ఇక.. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు దీపావళి సందర్భంగా బహుమతులు ఇస్తూ ఉద్యోగుల్లో మంచిపేరు సంపాధించుకున్నారు.
గతంలో తన కంపెనీలో పని చేసే 300 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను గోవింద్ భాయ్ డోలాకియా.. సుమారు రూ.90 లక్షల ఖర్చుతో ఒక ప్రత్యేక ఏసీ రైలు బుక్ చేసి మరీ 10 రోజుల పాటు ఉత్తరఖండ్ పర్యటన తీసుకెళ్లి వార్తల్లో నిలిచారు. ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగులంతా‘కాకాజీ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.