govindappa
-
దొంగల దాడిలో వ్యక్తి మృతి
రొళ్ల : మండలంలోని హెచ్.టి.హళ్లిలో గోవిందప్ప(48) అనే వ్యక్తి దొంగల రాళ్ల దాడిలో శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్ఐ నాగన్న తెలిపారు. శుక్రవారం రాత్రి గోవిందప్ప తండ్రి ముద్ద రంగప్ప ఆరుబయట నిద్రిస్తుండగా దొంగలు చోరీ కోసం ఇంటి వద్దకు వచ్చారన్నారు. సరిగ్గా అదే సమయంలో తేరుకున్న రంగప్ప గట్టిగా కేకలు వేయగా, ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు గోవిందప్ప అక్కడికి వచ్చాడని చెప్పారు. అదే సమయంలో దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించగా, దుండగులు రాళ్లు విసరడంతో గోవిందప్పకు తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని పేర్కొన్నారు. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకునే సరికే దొంగలు పరారయ్యారని వివరించారు. గస్తీ పోలీసులు అటుగా రాగా, అపస్మారక స్థితిలో ఉన్న గోవిందప్పను ప్రైవేటు వాహనంలో కర్ణాటక ప్రాంతం తుమకూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని సోదరుడు రంగనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
గంటల వ్యవధిలోనే దంపతుల మృతి
రొళ్ల : ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న తల్లిదండ్రులు గంటల వ్యవధిలోనే తుదిశ్వాస విడిచిపెట్టడంతో ఆ కుటుంబం కకావికలమైంది. వివరాల్లోకి వెళితే... రొళ్ల మండలం హుణిసేకుంటకు చెందిన గోవిందప్ప, భార్య భాగ్యమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గోవిందప్ప గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చూపించా నయంకాలేదు. రెండు రోజుల క్రితం గోవిందప్ప (42) ఇంటి వద్దే చనిపోయాడు. తన కళ్లెదుటే భర్త చనిపోవడంతో మనో వేదనకు గురైన భాగ్యమ్మ (35) కూడా శనివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. దీంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. వారి సమాధులను కూడా పక్క పక్కనే పూడ్చిపెట్టారు. తల్లిదండ్రులిద్దరినీ ఒకే సారి కోల్పోవడంతో వారిద్దరి కుమారులు, కుమార్తె కన్నీరు మున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అనాథలైన వారికి అండగా ఉంటామని గ్రామస్తులు చెప్పారు. వారంతా కలిసే అంత్యక్రియలను పూర్తి చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య
హిందూపురం అర్బన్ : పట్టణంలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లికి చెందిన గోవిందప్ప (24) రైలుకింద పడి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల తెలిపిన మేరకు బెంగళూరులోని ఫ్యాక్టరీలో పని చేస్తున్న గోవిందప్ప ఉదయం గ్రామం నుంచి బెంగళూరుకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరి హిందూపురం వచ్చాడు. అయితే బెంగళూరు వెళ్లకుండా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మతుడి తండ్రి అశ్వర్థప్ప అక్కడికి చేరుకుని కుమారుడి శవం చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.