govt hsopital
-
ప్రసవానికి వస్తే మృత శిశువును చేతిలో పెట్టారు.. న్యాయం చేయండి!
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తే, మృత శిశువును చేతిలో పెట్టారంటూ బుధవారం బాధితురాలి బంధువులు పాత ప్రభుత్వాస్పత్రి మాతా శిశు విభాగం ఎదుట ఆందోళనకు దిగారు. సేకరించిన వివరాల ప్రకారం నందిగామకు చెందిన జి.మమతకు పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం ఈ నెల 13వ తేదీ సాయంత్రం విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. ఆమె నార్మల్ డెలివరీ అవుతుందని భావించిన వైద్యులు అబ్జర్వేషన్ రూమ్‌లో ఉంచారు. ఆమె బుధవారం ఉదయం నార్మల్ డెలివరీ అయింది. అయితే పుట్టిన శిశువు మృతి చెంది ఉండటంతో విషయాన్ని బంధువులకు తెలిపారు. ఇప్పటివరకూ ఆరోగ్యంగా ఉన్న శిశువు పుట్టగానే ఎలా మృతి చెందుతుందని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందంటూ మృతశిశువును పెట్టుకుని ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. విచారణకు ఐదుగురు సభ్యుల కమిటీ పాత ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగంలో మృతశిశువు ప్రసవంపై విచారణకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యేకుల కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ కమిటీలో గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పి.హిమబిందు, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ టి.సూర్యశ్రీ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వి.సుధీర్‌బాబు, సివిల్‌సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ ఎ.హనుమంతరావు, ఏఆర్ఎం డాక్టర్ ఎస్.మాధవీలతతో కూడిన కమిటీ అన్ని అంశాలపై విచారణ జరపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని డాక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. వైద్యుల తప్పులేదు శిశువు మృతి విషయంలో వైద్యుల తప్పిదం లేదు. శిశువు మెడకు మూడుసార్లు పేగు చుట్టుకుని ఉండటంతో ఊపిరి ఆడక మృతి చెంది ఉండవచ్చు. సాధారణంగా కొందరికి ఒక మెలిక పేగు మెడకు చుట్టుకుని ఉంటుంది. కానీ ఈ శిశువుకు మూడు మెలికలు చుట్టుకుంది. బాధితులు ఫిర్యాదు చేస్తే, విచారణ చేస్తాం. –డాక్టర్ నాగేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్, పాత ఆస్పత్రి చదవండి: భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్ రికార్డు చేయడం నేరం: హైకోర్టు -
జవాబుదారీతనం ఉండాలి
కోటా (రాజస్తాన్): రాజస్థాన్‌లోని కోటాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జేకే లోన్ ఆస్పత్రిలో 107 మంది చిన్నారుల మరణాలపై ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ విమర్శించారు. చిన్నారుల మరణం చాలా బాధించిందని, దీనికి ఎవరో ఒకరు జవాబుదారీతనం వహించాలని వ్యాఖ్యానించారు. శిశువుల మరణాలపై ప్రభుత్వ స్పందన సంతృప్తికరంగా లేదన్నారు. ఈ విషయంపై తాము మరింత సున్నితంగా వ్యవహరించి ఉండాల్సిందన్నారు. పిల్లలను కోల్పోయిన కుటుంబాలను పైలట్ శనివారం పరామర్శించి ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటనపై తాము మరింత బాధ్యతగా ఉండాలి, ఆ తర్వాత వచ్చే పరిణామాలను ఎదుర్కోవాలన్నారు. -
కన్నపేగును చూసుకోకుండానే కనుమూసింది
సర్కారు ఆస్పత్రిలో మెరుగైన ప్రసవాలు చేస్తున్నారని వస్తే... ఓ బాలింత ప్రాణం పోయింది. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన ఎస్.కే.జరీనాసుల్తానా(25)ఆరోగ్యం విషమించి మంగళవారం రాత్రి మృతిచెందింది. తొలుత కుటుంబ సభ్యులు, బం ధువుల ఆందోళనల మధ్య జరీనాసుల్తానాకు మెరుగైన వైద్యం అందించడానికి కరీంనగర్‌లోని ఎంసీహెచ్ కేంద్రంకు తరలించారు. చికిత్స ప్రారంభించేలోగా ఆమె మృతి చెందింది. మగబిడ్డకు జన్మనిచ్చి.. ఎన్టీపీసీలోని పీకే రామయ్యకాలనీకి చెందిన ఎస్కే ఫయాజ్, జరీనాసుల్తానా దంపతులు. వివాహమై 11 మాసాలవుతోంది. ఫయాజ్ సబ్ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలిసారి గర్భందాల్చిన ఎస్.కే.జరీనాసుల్తానాకు గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. ప్రసూతీ కోసం ఈనెల 17న అడ్మిట్ చేశారు. మంగళవారం ఉదయం పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత బాలింతల వార్డుకు తరలించారు. సాయంత్రం వరకు బాగానే ఉంది. తరువాత కడుపులో నొప్పిగా ఉందని తల్లడిల్లింది.ఆపరేషన్ చేసిన సమయంలో ఒక బ్యాగు రక్తం ఎక్కించిన వైద్యులు, వార్డుకు తరలించాక మళ్లీ రక్తం అవసరం ఉందని చెప్పడంతో ఆమె భర్త స్వయంగా రక్తదానం చేశారు. అయినా బాధితురాలి ఆరోగ్య కుదుటపడలేదు. హుటాహుటిన ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోయిన వైద్యులు, మళ్లీ రక్తం అవసరం ఉందని కోరడంతో, సింగరేణి ఏరియా ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్ నుంచి తెప్పించారు. బంధువుల ఆందోళన... వైద్యులు ప్రయత్రించినప్పటికీ బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. బాలింత రోగ్యం ఎందుకు విషమించిందో సరైన వైద్యులు సమాధానం చెప్పడం లేదని కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌కు రెఫర్ చేయాలంటున్న వైద్యులు, బాధితురాలికి ఏదైనా జరిగితే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే జరినాసుల్తానా ఆరోగ్యం విషమించిందని ఆరోపించారు. ఆపరేషన్ థియేటర్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. చనిపోయిన మృతదేహాన్ని మెరుగైన చికిత్స కోసమంటూ తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాబర్ సలీంపాషా, పోలీసులు జోక్యం చేసుకొసి బాధితురాలిని కరీంనగర్‌లోని ప్రభుత్వ ఎంసీహెచ్ కేంద్రంకు తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభించేలోగా మృతి చెందింది. ఆస్పత్రిలో గొడవలు చోటుచేసుకోకుండా వన్‌టౌన్ సీఐ పర్శ రమేష్, ఎస్సైలు పర్యవేక్షించారు. -
ప్రభుత్వాసుపత్రిలో బాలింత మృతి
తణుకు అర్బన్ : బిడ్డకు జన్మనిచ్చిన గంటల వ్యవధిలోనే ఓ బాలింత మృతిచెందిన దుర్ఘటన తణుకు ఏరియా ఆసుపత్రిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ బంధువులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం.. పెనుమంట్ర మండలం సత్యవరం చిన్నపేటకు చెందిన మంగం రాజేశ్వరి (27) ప్రసవం కోసం మంగళవారం ఉదయం తణుకు ఏరియా ఆసుపత్రిలో చేరారు. అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.అరుణ ఆమెకు సిజేరియన్ చేశారు. రాజేశ్వరి మగబిడ్డకు జన్మనిచ్చారు. రక్తం తక్కువగా ఉందని బీ పాజిటివ్ రక్తం తీసుకురావాలని సిబ్బంది ఆమె కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో వారు రక్తం తీసుకొచ్చారు. సిబ్బంది రాత్రి 10.20 గంటలకు బాలింతకు రక్తం ఎక్కించారు. అర్ధరాత్రి 12 గంటలకు ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యబృందం సేవలందించింది. తెల్లవారుజామున ఆమెను మెరుగైన వైద్యం కోసం తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆరా తీసేసరికి రాజేశ్వరి అప్పటికే మృతిచెందినట్టు తెలిసింది. దీంతో వారు ఆందోళనకు దిగారు. రక్తం తీసుకొచ్చిన వెంటనే సిబ్బంది ఎక్కించలేదని, బయటే ఉంచారని, పరిస్థితి విషమంగా ఉందన్న విషయం తమకు ముందు చెప్పలేదని, చనిపోయిన తరువాత కూడా సమాచారం ఇవ్వలేదని, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మృతురాలి భర్త నాగరాజుతోపాటు బంధువులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై కె.శ్రీనివాస్ సిబ్బందితో ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. పదేళ్లక్రితం మంగం నాగరాజుతో రాజేశ్వరికి వివాహమైంది. ఆమెకు ఇది మూడో కాన్పు. మొదట మగబిడ్డ పుట్టి చనిపోగా, రెండో కాన్పులోనూ మగబిడ్డ జన్మించాడు. మూడో కాన్పులోనూ జన్మించిన మగబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డీసీహెచ్ఎస్ విచారణ విషయం తెలుసుకున్న జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్) డాక్టర్ కె.శంకరరావు ఆసుపత్రికి వచ్చి విచారణ చేశారు. వైద్యులు, బాధితులతో చర్చించారు. బిడ్డ జన్మించిన తరువాత తల్లీబిడ్డ బాగానే ఉన్నారని రక్తం ఎక్కించిన తర్వాత రియాక్షన్ రావడం వల్లే గుండె పనితీరులో ఇబ్బంది తలెత్తి తల్లి చనిపోయిందని వివరించారు. రాజేశ్వరికి ట్యూబెక్టమీ చేసిన నేపథ్యంలో మరణించడం వల్ల రూ. 2 లక్షలు వస్తాయని, వాటిని వెంటనే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. బిడ్డ జన్మించిన తరువాత తల్లి పాలు కూడా పట్టిందని, అందరితోనూ మాట్లాడిందని సూపరింటెండెంట్ డాక్టర్ వి.అరుణ చెప్పారు. బాలింతకు 8.9 గ్రాముల రక్తం మాత్రమే ఉండడంతో మరింత రక్తం అవసర మైందని, అది ఎక్కించిన తరువాతే ఇబ్బంది వచ్చిందని ఆమె వివరించారు.