జరీనాసుల్తానా మృతదేహం , జరీనాసుల్తానాకు పుట్టిన మగబిడ్డ
సర్కారు ఆస్పత్రిలో మెరుగైన ప్రసవాలు చేస్తున్నారని వస్తే... ఓ బాలింత ప్రాణం పోయింది. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన ఎస్.కే.జరీనాసుల్తానా(25)ఆరోగ్యం విషమించి మంగళవారం రాత్రి మృతిచెందింది. తొలుత కుటుంబ సభ్యులు, బం ధువుల ఆందోళనల మధ్య జరీనాసుల్తానాకు మెరుగైన వైద్యం అందించడానికి కరీంనగర్‌లోని ఎంసీహెచ్ కేంద్రంకు తరలించారు. చికిత్స ప్రారంభించేలోగా ఆమె మృతి చెందింది.
మగబిడ్డకు జన్మనిచ్చి..
ఎన్టీపీసీలోని పీకే రామయ్యకాలనీకి చెందిన ఎస్‌కే ఫయాజ్, జరీనాసుల్తానా దంపతులు. వివాహమై 11 మాసాలవుతోంది. ఫయాజ్ సబ్ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలిసారి గర్భందాల్చిన ఎస్.కే.జరీనాసుల్తానాకు గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. ప్రసూతీ కోసం ఈనెల 17న అడ్మిట్ చేశారు. మంగళవారం ఉదయం పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు.
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత బాలింతల వార్డుకు తరలించారు. సాయంత్రం వరకు బాగానే ఉంది. తరువాత కడుపులో నొప్పిగా ఉందని తల్లడిల్లింది.ఆపరేషన్ చేసిన సమయంలో ఒక బ్యాగు రక్తం ఎక్కించిన వైద్యులు, వార్డుకు తరలించాక మళ్లీ రక్తం అవసరం ఉందని చెప్పడంతో ఆమె భర్త స్వయంగా రక్తదానం చేశారు. అయినా బాధితురాలి ఆరోగ్య కుదుటపడలేదు. హుటాహుటిన ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకుపోయిన వైద్యులు, మళ్లీ రక్తం అవసరం ఉందని కోరడంతో, సింగరేణి ఏరియా ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్ నుంచి తెప్పించారు.
బంధువుల ఆందోళన...
వైద్యులు ప్రయత్రించినప్పటికీ బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. బాలింత రోగ్యం ఎందుకు విషమించిందో సరైన వైద్యులు సమాధానం చెప్పడం లేదని కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌కు రెఫర్ చేయాలంటున్న వైద్యులు, బాధితురాలికి ఏదైనా జరిగితే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే జరినాసుల్తానా ఆరోగ్యం విషమించిందని ఆరోపించారు. ఆపరేషన్ థియేటర్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు.
చనిపోయిన మృతదేహాన్ని మెరుగైన చికిత్స కోసమంటూ తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాబర్ సలీంపాషా, పోలీసులు జోక్యం చేసుకొసి బాధితురాలిని కరీంనగర్‌లోని ప్రభుత్వ ఎంసీహెచ్ కేంద్రంకు తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభించేలోగా మృతి చెందింది. ఆస్పత్రిలో గొడవలు చోటుచేసుకోకుండా వన్‌టౌన్ సీఐ పర్శ రమేష్, ఎస్సైలు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment