ప్రభుత్వాసుపత్రిలో బాలింత మృతి
ప్రభుత్వాసుపత్రిలో బాలింత మృతి
Published Thu, Oct 27 2016 12:57 AM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
తణుకు అర్బన్ : బిడ్డకు జన్మనిచ్చిన గంటల వ్యవధిలోనే ఓ బాలింత మృతిచెందిన దుర్ఘటన తణుకు ఏరియా ఆసుపత్రిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ బంధువులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం.. పెనుమంట్ర మండలం సత్యవరం చిన్నపేటకు చెందిన మంగం రాజేశ్వరి (27) ప్రసవం కోసం మంగళవారం ఉదయం తణుకు ఏరియా ఆసుపత్రిలో చేరారు. అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.అరుణ ఆమెకు సిజేరియన్ చేశారు. రాజేశ్వరి మగబిడ్డకు జన్మనిచ్చారు. రక్తం తక్కువగా ఉందని బీ పాజిటివ్ రక్తం తీసుకురావాలని సిబ్బంది ఆమె కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో వారు రక్తం తీసుకొచ్చారు. సిబ్బంది రాత్రి 10.20 గంటలకు బాలింతకు రక్తం ఎక్కించారు. అర్ధరాత్రి 12 గంటలకు ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యబృందం సేవలందించింది. తెల్లవారుజామున ఆమెను మెరుగైన వైద్యం కోసం తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆరా తీసేసరికి రాజేశ్వరి అప్పటికే మృతిచెందినట్టు తెలిసింది. దీంతో వారు ఆందోళనకు దిగారు. రక్తం తీసుకొచ్చిన వెంటనే సిబ్బంది ఎక్కించలేదని, బయటే ఉంచారని, పరిస్థితి విషమంగా ఉందన్న విషయం తమకు ముందు చెప్పలేదని, చనిపోయిన తరువాత కూడా సమాచారం ఇవ్వలేదని, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మృతురాలి భర్త నాగరాజుతోపాటు బంధువులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై కె.శ్రీనివాస్ సిబ్బందితో ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. పదేళ్లక్రితం మంగం నాగరాజుతో రాజేశ్వరికి వివాహమైంది. ఆమెకు ఇది మూడో కాన్పు. మొదట మగబిడ్డ పుట్టి చనిపోగా, రెండో కాన్పులోనూ మగబిడ్డ జన్మించాడు. మూడో కాన్పులోనూ జన్మించిన మగబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
డీసీహెచ్‌ఎస్ విచారణ
విషయం తెలుసుకున్న జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్) డాక్టర్ కె.శంకరరావు ఆసుపత్రికి వచ్చి విచారణ చేశారు. వైద్యులు, బాధితులతో చర్చించారు. బిడ్డ జన్మించిన తరువాత తల్లీబిడ్డ బాగానే ఉన్నారని రక్తం ఎక్కించిన తర్వాత రియాక్షన్ రావడం వల్లే గుండె పనితీరులో ఇబ్బంది తలెత్తి తల్లి చనిపోయిందని వివరించారు. రాజేశ్వరికి ట్యూబెక్టమీ చేసిన నేపథ్యంలో మరణించడం వల్ల రూ. 2 లక్షలు వస్తాయని, వాటిని వెంటనే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. బిడ్డ జన్మించిన తరువాత తల్లి పాలు కూడా పట్టిందని, అందరితోనూ మాట్లాడిందని సూపరింటెండెంట్ డాక్టర్ వి.అరుణ చెప్పారు. బాలింతకు 8.9 గ్రాముల రక్తం మాత్రమే ఉండడంతో మరింత రక్తం అవసర మైందని, అది ఎక్కించిన తరువాతే ఇబ్బంది వచ్చిందని ఆమె వివరించారు.
Advertisement
Advertisement