కడియం పాలనలో అధ్వానంగా విద్యా వ్యవస్థ
టీడీపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు
చిట్యాల : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాలనలో విద్యా వ్యవస్థ అధ్వానంగా ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ధ్వజ మెత్తారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పార్టీ మండల అధ్యక్షుడు పులి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సత్యనారాయణరావు మాట్లాడుతూ హాస్టల్ భవనం నాలుగేళ్లుగా నిర్మాణానికే పరిమితం కావడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులు ఇన్నేళ్లుగా రాకపోకలు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మోడల్ స్కూల్లో ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యం లేదని, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఉపాధ్యాయుల కొరత తీర్చాలని కోరారు. మధ్యాహ్న భోజనంలో నీళ్లచారు పోస్తుండగా విద్యార్థులు ఇంటి నుంచి బాక్సు లు తెచ్చుకుంటున్నారని తెలిపారు. కనీసం స్పీకర్ పట్టించుకోవడంలేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా, మండల నాయకులు తిరుపతిరెడ్డి, దొడ్డి కిష్టయ్య, రత్నాకర్‌రెడ్డి, తోట గట్టయ్య, చిలుకల రాయకొమురు, బుర్ర శ్రీనివాస్‌గౌడ్, గుమ్మడి శ్రీదేవి, సత్యం, పర్లపల్లి కుమార్, మల్లేష్, రామకృష్ణ, రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.