రేపట్నుంచి నర్సుల రాష్ట్ర వ్యాప్త ఆందోళన
విశాఖ మెడికల్: నర్సుల నియామకాలు, ఇతర డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించనున్నట్టు ప్రభుత్వ నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.భాగ్యలక్ష్మి తెలిపారు. విశాఖలో శనివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 31 నుంచి రాష్ట్ర వ్యాప్తం గా అన్ని ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి ఆస్పత్రుల ఎదుట గంట పాటు నినాదాలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ధర్నాలు చేపట్టి దశలువారీగా ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.
2007 నుంచి ప్రభుత్వం పోస్టుల నియామకాలను నిలిపివేసిందని ఆరోపించా రు. ఇటీవల ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది నర్సు పోస్టుల భర్తీ చేపడతామని చెప్పినప్పటికీ ఇంతవరకూ ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. గుంటూరు జీజీహెచ్ ఆస్ప త్రి ఘటనకు సంబంధించి ఇద్దరు నర్సులను సేవా లోపం నెపంతో సస్పెండ్ చేయడాన్ని ఖండించారు.