25 నుంచి బ్యాంకు ఉద్యోగుల సమ్మె!
ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ల వార్నింగ్
న్యూఢిల్లీ: వేతన సవరణ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగ యూనియన్లు శుక్రవారం మళ్లీ సమ్మె సైరన్ మోగించాయి. ఫిబ్రవరి 25-28 మధ్య దేశ వ్యాప్తంగా 4 రోజులపాటు సమ్మె చేయనున్నట్లు బ్యాంక్ కార్మికుల జాతీయ సంఘం జనరల్ సెక్రటరీ అశ్వనీ రాణా చెప్పారు. 19 శాతం వేతన పెంపునకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ నెలారంభంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తన ఆఫర్ను 12.5 శాతం నుంచి 13 శాతానికి పెంచింది.
ఈ నేపథ్యంలో చీఫ్ లేబర్ కమిషనర్ సలహామేరకు ఫిబ్రవరి 23న సమస్య పరిష్కారం దిశగా యూనియన్ల ఐక్య వేదిక (యూఎఫ్బీయూ)తో చర్చలకు ఐబీఏ అంగీకరించింది. చర్చలు విఫలమై సమ్మె జరిగితే, బడ్జెట్ సమయంలో ప్రభుత్వ నిధుల బదలాయింపుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దేశంలో మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు పనిచేస్తున్నాయి. మొత్తమ్మీద 50,000 బ్రాంచీలలో దాదాపు 8 లక్షల మంది పనిచేస్తున్నారు. జనవరి 21 నుంచి 4 రోజుల సమ్మెకు యూనియన్లు పిలుపునిచ్చినా... ఫిబ్రవరి ఆరంభానికల్లా వేతన పెంపుపై తగిన పరిష్కారం చూపుతామన్న ఐబీఏ హామీతో అప్పుడు వాయిదా పడింది.