పార్టీ కంటే కులమే ముఖ్యం: కేఈ
ఒంగోలు సెంట్రల్: పార్టీ కంటే కులమే ముఖ్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గౌడ సంక్షేమ సంఘం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం ఒంగోలులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గౌడ కులస్తులందరూ ఐక్యంగా ఉంటే అభివృద్ధి చెందుతారన్నారు. శనివారం రాజ్యసభలో ఏపీకి అవమానం జరిగిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు విజయవాడలో ఆదివారం ఎంపీలతో సమావేశం నిర్వహించారని చెప్పారు.
ఇందులో ఎంపీలంతా ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని రాష్ర్ట పరిస్థితిని వివరించి, ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలని సీఎం సూచించినట్టు తెలిపారు. ప్రధాన మంత్రి ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వకపొతే పార్లమెంటులో లేచి నిలబడి ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడాలని చెప్పారన్నారు.