ఆ విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వాలి: కేతిరెడ్డి
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన మాత్రమే కాకుండా బాలల హక్కుల్ని కూడా హరిస్తున్నదని.. భాషా అల్ప సంఖ్యాక వర్గాల విద్యార్థుల బాధలకు ప్రతి ఒక్కరు సంఘీభావం తెలపాలని రాష్ట్ర తెలుగు యువశక్తీ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. ఫిబ్రవరి 27న కోర్టు మధ్యంతర ఉత్తరువులు ఇచ్చే వరకు ఉత్తర్వులు రావన్న భయంతో విద్యార్థులు ఉన్నారని.. చిన్న పిల్లలను ప్రభుత్వం మానసికంగా హింసించడాన్ని తప్పుబట్టారు. ఇప్పటికీ పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం.. కనీసం వచ్చే విద్యా సంవత్సరం 2017-18లోనైనా తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులు వారి మాతృభాషలలో చదువుకునేలా హామీ ఇచ్చేలా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విషయం పై రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుకు కేతిరెడ్డి ఓ లేఖ రాశారు. మైనార్టీ విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించాలని కోరారు. గవర్నర్ వెంటనే స్పందించి ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి తమిళనాడులో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని సూచించాలని లేఖలో పేర్కొన్నారు. తెలుగు, మలయాళం, కన్నడ, ఉర్దూ విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. గతంలో గవర్నర్ గా చేసిన చెన్నారెడ్డి తమిళనాడులో కొన్ని సమస్యలను తీర్చారని.. ప్రస్తుత సమస్యను తీర్చుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.