graduate electoral council
-
మొదలైన రాజకీయ వేడి.. నేతలతో కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మరో మినీ ఎన్నికల సందడి మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషనతో పాటు పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. మరోవైపు ఎన్నికల్లో పోటీకి ఆశావాహులు సిద్ధంగా ఉండగా.. గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో ప్రధాన పార్టీలు పడ్డాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్ పార్టీ దృష్టిసారించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి కేటీఆర్ పార్టీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో పార్టీ నాయకత్వం ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే రంగంలోకి దిగిన కేటీఆర్ గ్రేటర్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో విడతల వారిగా సమీక్షలు నిర్వహించారు. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, డబుల్ బెడ్రూంల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, మేయర్లతో సమావేశం నిర్వహించారు. (అంతుపట్టని రహస్యం: కేసీఆర్ వ్యూహమేంటి?) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహాలతో పాటు అభ్యర్థల ఎంపికలపై తీసుకువాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. అలాగే పట్టభద్రుల కోటాలో అభ్యర్థుల ఎంపికపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి మేయర్ బొంత రామ్మోహన్‌ను బరిలో నిలిపేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. పట్టభద్రుల కోటా ఎన్నికలో తీవ్ర పోటీ ఉండటం, ప్రభుత్వంపై వ్యతిరేకత, ఉద్యోగుల్లో నిరాశ విపక్షాలకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యమ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీతో సత్సంబంధాలు, స్థానిక యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న రామ్మోహన్‌ను బరిలో నిలిపితే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నేటి భేటీలో ఈ అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికపై కూడా సీఎం పార్టీ నేతలతో చర్చించనున్నారు. (‘మండలి’ స్థానంపై.. పార్టీల గురి!) -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరుగునున్న పట్టభద్రల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు, ప్రోఫెసర్ కోదండరాం పోటీచేయనున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొ.కోదండ రామ్‌కు నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా మద్దతునివ్వాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) ప్రతిపక్ష పార్టీలను కోరింది. ఈ మేరకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలకు టీజేఎస్ లేఖలు పంపింది. కోదండరామ్ గెలుపు అవసరమని నిరుద్యోగులు, యువత ఆశిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితులపై మండలిలో గొంతెత్తే నాయకుడిని గెలిపించాలని టీజేఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ బాధ్యులు జి.వెంకట్‌రెడ్డి, ధర్మార్జున్, బైరి రమేశ్, శ్రీశైల్‌రెడ్డి కోరారు. మరోవైపు రెండు స్థానాలకు జరిగే ఈ ఎన్నికలను ప్రతిపక్షాలతో పాటు అధికార టీఆర్ఎస్ సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. -
టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే విషయంలో ఎడతెగని సస్పెన్షన్ కొనసాగుతోంది. గురువారం ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. అధికార పార్టీ తరఫున వరంగల్ జిల్లా నుంచి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు తక్కెల్ల పల్లి రవీందర్రావు, మర్రి యాదవరెడ్డిలను అధినేత గురువారం తన వద్దకు రావాలని ఆదేశించారు. బీజేపీ ఇప్పటికే ఎర్రబెల్లి రాంమోహన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇదిలా ఉంటే కడియం తనకు పట్టభద్రుల కోటాలో సీటు వద్దని అధినేతను కోరినట్లు సమాచారం. దీంతో పోటీ ముగ్గురి మధ్య నెల కొంది. గతంలో కేసీఆర్ జిల్లాకు చెందిన బండా నరేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇవ్వనున్నట్లు సూచాయగా ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గానికి వచ్చినపుడు బండా నరేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని హామీ కూడా ఇచ్చారు. దీంతో ఆయన తనకు టికెట్ ఖాయమని జిల్లాతోపాటు, వరంగల్, ఖ మ్మం జిల్లాల్లో ప్రచార పర్యటనలు చేశారు. ఇదిలా ఉంటే బండా నరేందర్‌రెడ్డికి టికెట్ విషయంలో జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు కేసీఆర్ అభ్యర్థిని ఫ్రకటించే అవకాశం ఉండడంతో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ బండాకు అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవేళ ఏదైనా మార్పు సంభవిస్తే అనూహ్యంగా కొత్త వ్యక్తికి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం.