పాలమూరులో 56 శాతం
జిల్లాలో ‘మండలి’ పోలింగ్ ప్రశాంతం
మహబూబ్‌నగర్‌లో అత్యల్ప ఓటింగ్
తలకొండపల్లిలో ప్రలోభాల పర్వం?
జడ్చర్లలో మంత్రి లక్ష్మారెడ్డి ఓటింగ్
25న హైదరాబాద్‌లో లెక్కింపు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ ఒకటి రెండు స్వల్పఘటనలు మిన హా అంతా సవ్యంగానే సాగింది. జిల్లాలో 68,721 మంది ఓటర్లకు 56శాతం మంది పట్టభద్రులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మహబూబ్‌నగర్‌లో అత్యల్పం గా పోలింగ్ శాతం నమోదైంది. మహబూబ్‌నగర్ ప్ర భుత్వ మహిళా డిగ్రీ కాలేజీలోని 41వ పోలింగ్ బూత్‌లో 650 మంది ఓటర్లకు 170 మంది మాత్రమే (26శాతం) ఓటువేశారు. గద్వాల ఆదిలక్ష్మమ్మ కాలేజీలోని 83వ పో లింగ్ బూత్లోనూ కేవలం 27 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. సీసీకుంట మండలంలో అత్యధికంగా 85.37 శాతం నమోదైంది. 335 మంది ఓటర్లకు 286 మంది పట్టభద్రులు ఓట్లువేశారు. తలకొండపల్లి మం డల కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ.41వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంపిణీ కోసం తెచ్చారనే అనుమానంతో అధికారులకు సమాచారమందించారు. ఘటనపై విచారణ జరిపిన అధికారులు సదరు ఓటరు వ్యక్తిగత అవసరాల కోసమే డబ్బులు వెంట తెచ్చుకున్నట్లు నిర్ధారించుకుని తిరిగి ఇచ్చేశారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ వద్ద ఓ ఉపాధ్యాయ సంఘానికి చెందిన కొందరు ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు తోపులాటకు దిగడంతో పోలీసులు చెదరగొట్టారు. ఆ తర్వాత ఇరువర్గాలు స్థానిక పోలీసుస్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
మందకొడిగా పోలింగ్
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఉదయం 10 గంటల వరకు 8శాతం, మధ్యాహ్నం 12 గంటలకు 22శాతం పోలింగ్ నమోదైంది. కోస్గిలో సాయంత్రం నాలుగు గంటల తర్వాత కూడా ఓటర్లు బారులు తీరడంతో టోకెన్లు అందజేసి మరో అరగంట పాటు పోలింగ్ కొనసాగించారు. పోలింగ్ కేంద్రాల వద్ద టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ శిబిరాలు ఏర్పాటు చేసి ఓటర్లను చివరి నిముషంలో ప్రసన్నం చేసుకునేందుకు యత్నించారు. ఆరోగ్యశాఖ మంత్రి సి.ల క్ష్మారెడ్డి జడ్చర్లలో, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రవికుమార్‌గుప్తా కొత్తూరులో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు బాలానగర్, జడ్చర్ల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నియోజకవర్గ కేంద్రంలో మకాం వేసి పోలింగ్ సరళిపై ఆరాతీశారు.
కలెక్టర్ టీకే శ్రీదేవి కల్వకుర్తిలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అభ్యర్థుల తరఫున కార్యకర్తలు ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలను సమకూర్చారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో బ్యాలెట్ బాక్స్‌లను ఆదివారం రాత్రికి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌కు తరలిస్తున్నారు. సోమవారం ఉదయం బ్యాలెట్ బాక్సులను హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ విక్టరీ ప్లే గ్రౌండ్‌కు తరలిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ నెల 25న వీపీజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.