రూప్ఖాన్పేట పంచాయతీ నిధుల గోల్మాల్
పరిగి, న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి గోల్మాల్ జరిగింది. జాయింట్ ఖాతాలో రెండో వ్యక్తిగా ఉన్న ఈఓఆర్డీ సంతకం లేకుండానే ఎస్టీఓ కార్యాలయం నుంచి నిధులు డ్రాచేశారు. ఈఓఆర్టీ వెంకటేశం ఆరా తీయటంతో ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని రూప్ఖాన్పేట సర్పంచ్ బసమ్మ అనారోగ్యంతో మూడు నెలల క్రితం అకస్మాత్తుగా మృతి చెందింది.
దీంతో పంచాయతీ జాయింట్ ఖాతాను ఈఓఆర్డీ వెంకటేశం, ఉపసర్పంచ్ నర్సింహులు పేర్లమీదకు డీపీఓ బదిలీ చేశారు. అయితే గత జనవరి మాసంలో పరిగి ఎస్టీఓ కార్యాలయంలోని పంచాయతీ ఖాతా నుంచి రూ.1,11,936లు డ్రాఅయ్యాయి. ఆ గ్రామ కార్యదర్శి, ఉపసర్పంచ్లు సంతకాలు చేసి డబ్బులు తీసుకున్నారు. బుధవారం ఈఓఆర్టీ వెంకటేశం ఎస్టీఓ కార్యాలయంలో వివరాలు సేకరించటంతో తన సంతకం లేకుండానే నిధులు డ్రాచేశారనే విషయం బయట పడింది.
దీంతో ఎంపీడీఓ విజయప్ప, ఎస్టీఓ రాజ్గోపాల్చారిలు కావాలనే నిధులు డ్రాచేయించారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ఎస్టీఓను వివరణ కోరగా ఎంపీడీఓ లెటర్ ఇవ్వటం వల్లే నిధులు డ్రా చేయటానికి అనుమతిచ్చామన్నారు.ఎంపీడీఓ విజయప్పను వివరణ కోరగా జాయింట్ ఖాతాకు సంబంధించి డీపీఓ నుంచి వచ్చిన లెటర్‌ను ఎస్టీఓ కార్యాలయంలో ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఈఓఆర్డీదేనని అన్నారు.