ఖాకీలకు క్వార్టర్లు కరువు..!
పరిగి: పరిగి పోలీసులు క్వార్టర్స్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఐ, ఇద్దరు ఎస్ఐలు, కానిస్టేబుళ్లు కూడా అద్దె ఇళ్లల్లోనే తల దాచుకోవాల్సిన పరిస్థితి. పదన్నోతులు, బదిలీల సమయంలో పోలీసులు పరిగికి వచ్చిన వెంటనే ముందుగా ఇళ్లు వెతుక్కునే పనిలో పడాల్సి వస్తోంది. గతంలో పరిగిలో పోలీస్ క్వార్టర్స్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే స్థలం అందుబాటులో లేకపోయే సరికి ఆ నిధులు వెనక్కి వెళ్లాయి. అయితే నాలు గేళ్ల క్రితం పోలీసు క్వార్టర్స్ నిర్మించేం దుకు పరిగి గ్రామపంచాయితీ స్థలం కేటాయించింది. కాని ప్రభుత్వం ఇప్పు డు నిధులు మంజూరు చేయడం లేదు.
మండలాల్లో అంతా అస్తవ్యస్తం...
పరిగిలోనే కాకుండా నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లో కూడా పోలీసుల క్వార్టర్స్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. కొన్నిచోట్ల క్వార్టర్లు లేకుండా ఉంటే, మరికొన్ని చోట్ల క్వార్టర్లు ఉన్నప్పటికీ అవి నివాసయోగ్యంగా లేకపోవడంతో పోలీసులు అద్దె ఇళ్లలో నివసించక తప్పని పరిస్థితి. పూడూరు, దోమ మండలాల్లో క్వార్టర్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. గండేడ్ మండలం మహ్మదాబాద్లోని క్వార్టర్లు కాస్త బాగుండటంతో మెజార్టీ జవాన్లు, ఎస్సై అక్కడే ఉంటున్నారు.
ఇక తప్పని పరిస్థితుల్లో పోలీసులు వికారాబాద్, పరిగిల్లో నివాసముంటూ విధులకు హాజరవుతున్నారు. అయితే అత్యవసర సమయాల్లో వీరు స్టేషన్ను రావడానికి సమయం తీసుకుంటుండటంతో తీవ్ర ఇబ్బందిగా మారింది. అంతేకాకుండా కొత్తగా విధుల్లో చేరుతున్న పోలీసులకు మాత్రం అద్దె ఇళ్లు తీవ్ర భారంగా మారాయి. వీరికి హెచ్ఆర్ఏ తక్కువగా ఉండటంతో అద్దె చెల్లించడానికి తీవ్ర ఇబ్బందిగా ఉందని వారు చెబుతున్నారు.