‘గ్రామజ్యోతి’ని బహిష్కరిస్తున్నాం..
నిజామాబాద్‌లో మంత్రి పోచారం ఎదుట ఎంపీటీసీ సభ్యుల నిరసన
ప్రగతినగర్ : నిజామాబాద్ గ్రామజ్యోతి డివిజన్‌స్థాయి సమావేశం ఆదివారం రసాభాసగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు చేపట్టిన గ్రామజ్యోతిలో తమకు సముచిత న్యాయం కల్చించలేదంటూ నిజామాబాద్ డివిజన్ మండలాల ఎంపీటీసీ సభ్యులు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎదుట నిరసన తెలిపారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో మంత్రి ప్రసంగిస్తుండగా వేదిక ముందు బైఠాయించారు.
తమకు గ్రామజ్యోతిలో సముచిత న్యాయం కల్పించాలని, లేనిపక్షంలో నేటి నుంచి జరిగే గ్రామజ్యోతిని తమ ఎంపీటీసీల ఫోరం తరఫున బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్యెల్యేలు తమ నియెజక వర్గాల ఎంపీటీసీ సభ్యులను పక్కకు తీసుకెళ్లి బుజ్జగించారు. ఎమ్యెల్యేలు జీవన్‌రెడ్డి,ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, జెడ్పీ చైర్మన్ ధపెధర్‌రాజు,వైస్ చైర్మన్ గడ్డం సుమనారెడ్డి పాల్గొన్నారు.