‘ఆరోగ్యలక్ష్మి’కి రూ.800 కోట్లు
నిజాంసాగర్ (నిజామాబాద్): రాష్ట్రంలో సోదరీమణుల అవసరాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని, ఇందుకోసం రూ.800 కోట్లు మంజూరు చేశారని పంచాయతీరాజ్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. ఈ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందని అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కుర్తిలో గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పంట రుణాలు మాఫీ చేశామన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.17 వేల కోట్ల భారం పడిందని తెలిపారు. వచ్చే వేసవి నుంచి వ్యవసాయూనికి పగటిపూట నిరంతరాయంగా 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర పునః నిర్మాణం కోసం ముఖ్యమంత్రి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఆడపడుచులు తాగునీటికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు రూ.250 కోట్లతో వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని, వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా శుద్ధ జలాలను అందిస్తామని చెప్పారు.