Grand i10
-
మార్కెట్లోకి హ్యుందాయ్ ‘గ్రాండ్ ఐ10 నియోస్’
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్).. తాజాగా తన కాంపాక్ట్ సెగ్మెంట్ పోర్ట్ ఫోలియోలో ‘గ్రాండ్ ఐ10 నియోస్’ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇందులో పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.4.99 లక్షలు (ఎక్స్‌షోరూం) కాగా, హైఎండ్ కారు ధర రూ.7.14 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.4.99 లక్షలుగానూ, టాప్ఎండ్ ధర రూ.7.99 లక్షలుగా నిర్ణయించింది. నూతన వేరియంట్లలో 1.2 డీజిల్, పెట్రోల్ ఇంజిన్లను అమర్చింది. మోడల్ ఆధారంగా ప్రతి లీటరుకు 20.7 నుంచి 26.2 కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్నట్లు వివరించింది. ఈ సందర్భంగా హెచ్ఎంఐఎల్ ఎండీ, సీఈఓ ఎస్ఎస్ కిమ్ మాట్లాడుతూ.. ‘నూతన మోడల్ అంతర్జాతీయ మార్కెట్లో మేడిన్ ఇండియా ఉత్పత్తిగా లభిస్తుంది. భారత్‌లో అమ్ముడయ్యే ప్యాసింజర్ వాహనాల్లో (కాంపాక్ట్ విభాగం) 50 శాతానికి మించి వాటాను ఐ10 కలిగి ఉంది. వచ్చే ఐదేళ్లలో కూడా ఈ మోడల్‌దే హవాగా కొనసాగనుంది. నియోస్ విడుదలతో 19.4 శాతంగా ఉన్న ప్రస్తుత కంపెనీ మార్కెట్ వాటా మరింత పెరగనుందని భావిస్తున్నాం’ అని అన్నారు. జీఎస్టీ తగ్గితేపరిశ్రమ గాడినపడుతుంది వాహనాలపై వస్తు సేవల పన్ను రేట్లను ప్రభుత్వం తగ్గిస్తే ఆటో పరిశ్రమకు ఇది సానుకూల అంశంగా మారుతుందని హెచ్ఎంఐఎల్ ఎండీ, సీఈఓ ఎస్ఎస్ కిమ్ అన్నారు. అమ్మకాలు అంతంత మాత్రంగా ఉండడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న పరిశ్రమకు జీఎస్టీ తగ్గింపు ఊతమిస్తుంది. రానున్నది పండుగల సీజన్ కావడం చేత ఈ సమయంలోనే ప్రభుత్వం రేట్లను తగ్గించడం అనేది సరైన నిర్ణయంగా ఉంటుందని విశ్లేషించారు. పండుగల సమయంలో కొనుగోళ్లు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున రేట్ల కోతకు ఇదే మంచి సమయమని చెప్పారాయన. ప్రభుత్వ నిర్ణయమే ఇప్పుడు పరిశ్రమను గాడిలో పడేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘వాహన రుణాలకు రుణ లభ్యత తగ్గిపోవడం, బీఎస్–6 అమలు, పెరిగిన బీమా ధరలు, వినియోగదారుల సెంటిమెంట్ దెబ్బతినడం వంటి ప్రతికూలతల్లో పరిశ్రమ ఇబ్బందుల్లో పడిపోయింది. అయితే, త్వరలోనే కోలుకునే అవకాశం ఉందని భావిస్తున్నా. ఇందుకు తగిన నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంది’ అని వ్యాఖ్యానించారు. -
10 వేరియంట్లలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ త్వరలో లాంచ్ చేయనున్న గ్రాండ్ ఐ10 నియోస్ 2019ని బుధవారం ప్రటకించింది. 3వ జనరేషన్ ఐ10 బుకింగ్స్ ను ప్రారంభించింది. కేవలం రూ.11 వేలకు ఈ కారును ప్రీ బుకింగ్ అవకాశాన్ని కల్పిస్తోంది. గ్రాండ్ ఐ 10 నియోస్ పది వేరియంట్లలో, ఆగస్టు 20న భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. డెలివరీలు ఈ నెలాఖరులో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. హ్యుందాయ్ కొత్త కారులో ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్‌ను పూర్తిగా మార్చేసింది. దీంతోపాటు యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఇన్ఫోటైమెంట్ ఫీచర్లను జతచేర్చింది. బీఎస్-6 నిబంధనల కనుగుణంగా 1.2-లీటర్ పెట్రోల్ డీజిల్ ఇంజన్లతో ఇది లాంచ్ చేయనుంది. ప్రస్తుతం వున్న 4 స్పీడ్‌కు బదులుగా..5-స్పీడ్ మాన్యువల్ లేదా ఎఎమ్‌టి గేర్‌బాక్స్‌తో రానుంది. గ్రాండ్ ఐ 10 నియోస్ పెట్రోల్ బేస్ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. మాగ్నా, స్పోర్ట్జ్ వేరియంట్లలో ఆప్షన్‌గా కంపెనీ ఏఎంటీ గేర్‌బాక్స్‌ను అందిస్తుంది. గత 21 ఏళ్లుగా ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందిస్తున్న హ్యుందాయ్ సరికొత్త సాంకేతికతతో భారతీయ ఆటో పరిశ్రమలో హ్యుందాయ్ ఆటోమొబైల్ పలు సరికొత్త కొలమానాలను సృష్టించిందని హ్యుందాయ్ సీఎండీ ఎస్ఎస్ కిమ్ వెల్లడించారు. కొత్త గ్రాండ్ ఐ 10 నియోస్ మా మార్కెట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు ఫోర్డ్ ఫిగో వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. -
గ్రాండ్ ఐ 10కి పోటీగా మారుతి కొత్త కారు
మారుతి సుజుకీ ఇండియా వచ్చే ఏడాది ఆరంభంలో తన కొత్త మోడల్ కారును మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. హుందయ్ త్వరలో గ్రాండ్ ఐ 10 కారును విడుదలచేయనున్న నేపథ్యంలో దానికి పోటీగా మారుతి కొత్త మోడల్ కారు తయారుచేస్తోంది. మార్కెట్లో పోటీని తట్టుకుని తమ వాటా పెంచుకునేందుకు మారుతి ఈదిశగా అడుగులు వేస్తోంది. తాము విడుదల చేయబోయే కొత్త మోడల్ వేగనార్ ఆర్, స్విఫ్ట్‌కు మధ్యలో ఉంటుందని మారుతి సుజుకీ ఇండియా వర్గాలు వెల్లడించాయి. దీన్ని వచ్చే ఏడాది జరగనున్న ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నారు. ఫిబ్రవరి 6 నుంచి 12 వరకు గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్పో జరగనుంది. మారుతి స్విఫ్ట్‌కు పోటీగా గ్రాండ్ ఐ 10 కారును సెప్టెంబర్ 3న విడుదల చేయాలని హుందయ్ భావిస్తోంది.