హ్యుందాయ్ గ్రాండ్ వచ్చేసింది
న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ కొత్త కాంపాక్ట్ కారు, గ్రాండ్ ఐ10ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. మందగమనంలో ఉన్న అమ్మకాలకు ఊపునివ్వడానికి ఈ కొత్త కారును తెస్తున్నామని, ధరను రూ.4.29 లక్షల నుంచి రూ.6.41 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని కంపెనీ తెలిపింది. గ్రాండ్ ఐ10 కారు డీజిల్, పెట్రోల్ రెండు వేరియంట్లలలో లభిస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.4.29 లక్షల నుంచి రూ.5.47 లక్షల రేంజ్లోనూ, 1.1 లీటర్ డీజిల్ వేరియంట్ ధర రూ. 5.23 లక్షల నుంచి రూ.6.41 లక్షల రేంజ్లోనూ (రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. 1.1 లీటర్ డీజిల్ సెగ్మెంట్లో చౌక ధరలో లభ్యమవుతున్న కారు ఇదే. ఈ కారు 18.9 కి.మీ.
(పెట్రోల్), 24 కి.మీ.(డీజిల్) మైలేజీనిస్తుందని అంచనా. ఈ కారు మారుతీ స్విఫ్ట్, ఫోర్డ్ ఫిగో, షెవర్లే బీట్, హోండా బ్రియో కార్లకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. 8 రంగులు, 4 వేరియంట్లు(ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా(టాప్ ఎండ్ వేరియంట్))లలో లభ్యమయ్యే ఈ కారు మారుతీ స్విఫ్ట్ కారు ధర కన్నా రూ.20,000-రూ.57,000 తక్కువ. ఈయాన్, శాంత్రో, ఐ10, ఐ20 తర్వాత హ్యుందాయ్ అందిస్తోన్న ఐదవ హ్యాచ్బాక్ ఇది.
కారు ప్రత్యేకతలు: మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ విద్ బ్లూటూత్, స్టార్ట్/స్టాప్ పుష్ బటన్ ఉన్న స్మార్ట్ కీ, 256 లీటర్ల బూట్ స్పేస్, 2 డిన్ ఎంపీ3 ఆడియో సిస్టమ్(1 జీబీ ఇన్బిల్ట్ మెమెరీ), 14 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్, రియర్ పార్కింగ్ సెన్సర్లు, టిల్ట్ స్టీరింగ్, లెదర్ స్టీరింగ్ వీల్, ఆడియో, ట్రిప్ మీటర్ కంట్రోల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ రియర్ వ్యూ మిర్రర్, మిర్రర్స్పై టర్న్ ఇండికేటర్లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, రియర్ స్పాయిలర్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, రియర్ డీ ఫాగర్, రియర్ వాషర్, వైపర్, ఎత్తు అడ్జెస్ట్ చేసుకునే డ్రైవర్ సీట్, డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్, ఏబీఎస్, రియర్ ఏసీ వెంట్స్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ వంటి ప్రత్యేకతలున్నాయి.