బీజేపీకి కలాం బంధువు గుడ్ బై
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నివసించిన బంగ్లాను స్మారకభవనంగా ప్రకటించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినందుకు నిరసనగా ఆయన సోదరుడి మనువడు ఏపీజే అబ్దుల్ షేక్ బీజేపీకి రాజీనామా చేశారు. కలాం మరణాంతరం గత సెప్టెంబర్‌లో బీజేపీలో చేరిన అబ్దుల్ షేక్ మూణ్నెళ్ల లోపే పార్టీకి గుడ్ బై చెప్పారు.
పదవీ విరమణ అనంతరం కలాం ఢిల్లీలో రాజాజీ మార్గ్‌లోని 10 బంగ్లాలో ఉండేవారు. కలాం మరణించేవరకు అబ్దుల్ షేక్ కూడా అక్కడే ఉన్నారు. కలాం మరణాంతరం ఈ భవనాన్ని స్మారక చిహ్నంగా ప్రకటించాలని అబ్దుల్ షేక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈ బంగ్లాను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మకు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా అబ్దుల్ షేక్ బీజేపీ నుంచి వైదొలిగారు. కలాం అన్న ఏపీజే మరకేయర్ మనువడు అయిన అబ్దుల్ షేక్ సొంతూరు తమిళనాడులోని రామేశ్వరంలో సామాజిక కార్యకర్త.