Granite Illegality
-
కరీంనగర్ గ్రానైట్ కంపెనీలపై ఈడీ నజర్!
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్లో గ్రానైట్ దందాపై ఈడీ దృష్టి సారించింది. మైనింగ్ పరిమితులు దాటి మరీ గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేశారని, చెల్లించాల్సిన జరిమానాలను కూడా ఎగ్గొడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆయా అక్రమాలపై ఆరా తీస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ వ్యాపారం చేస్తున్న పలు కంపెనీలు తీవ్రస్థాయిలో ఉల్లంఘనలకు పాల్పడ్డాయని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన జరిమానాలు కట్టడం లేదని కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భేతి మహేందర్‌రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించిన ఈడీ.. సదరు కంపెనీలు చేసిన ఎగుమతులపై ‘ఫారిన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)–1999’కింద విచారణ చేపట్టింది. ఇంతకీ ఏం జరిగింది? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ వ్యాపారం చేస్తున్న కొన్ని కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి రూ.124.94 కోట్ల నష్టం వాటిల్లిందని కరీంనగర్ న్యాయవాది భేతి మహేందర్‌రెడ్డి ఈ ఏడాది జూలై 8న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి లేఖ రాశారు. సదరు లేఖ, రాష్ట్ర మైనింగ్ శాఖ వివరాల ప్రకారం.. రాష్ట్రం లో మొత్తం 17 చోట్ల భారీగా మైనింగ్ జరుగుతోంది. ప్రధానంగా గ్రానైట్ ఎగుమతుల్లో ముందంజ లో ఉన్న కరీంనగర్లో ఒద్యారం (మల్టీకలర్), మానకొండూరు(మేపిల్ కలర్), సుల్తానాబాద్ (కాఫీ బ్రౌన్), ములంగూరు–హుజూరాబాద్ (రెడ్ రోజ్), కత్వాల (బ్లూబ్రౌన్)లలో మైనింగ్ నడుస్తోం ది. వీటిని శ్వేత ఏజెన్సీస్, శ్వేత గ్రానైట్స్, ఏఎస్ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జేఎం బక్సీ అండ్ కంపెనీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్పోర్ట్, కేవీకే ఎనర్జీ, అరవింద్ గ్రానైట్స్, సంధ్య ఏజెన్సీస్ సంస్థలు నిర్వ హిస్తున్నాయి. ఇవి ఏళ్ల తరబడి నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీగా లబ్ధి పొందాయని ఆరోపణలు రావడంతో ఉమ్మడి రాష్ట్రంలోనే విజిలెన్స్ దాడులు జరి గాయి. నిర్దేశించిన పరిమాణాన్ని మించి ఉన్న గ్రానై ట్ బ్లాక్‌లను విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు అధి కారులు గుర్తించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి ఏ సంస్థ వల్ల ఎంత నష్టం జరిగిందో లెక్కించారు. ఉల్లంఘనులకు జరిమానా విధించినా.. శ్వేత ఏజెన్సీస్ నుంచి రూ.4,19,49,318 నష్టం, శ్వేత గ్రానైట్స్ రూ.57,77,75,250, ఏఎస్ షిప్పింగ్ రూ.6,64,12,011, జేఎం బక్సీ కంపెనీ రూ.19,32,95,375, మైథిలీ ఆదిత్య రూ.33,65,83,000, కేవీకే ఎనర్జీ రూ.92,38,653, అరవింద్ ఏజెన్సీస్ రూ.94,86,290, సంధ్య ఏజెన్సీస్‌తో రూ.1,46,99,750.. కలిపి మొత్తంగా రూ.124,94,46,147 నష్టం వచ్చినట్టుగా విజిలెన్స్ అధికారులు తేల్చారు. ఈ మేరకు 2013లో అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ అధికారులు.. ఆయా కంపెనీలు పాల్పడిన అక్రమాలకు ఐదు రెట్లు పెనాల్టీ కలిపి రూ.749.66,76,882 జరిమానా (సినరేజీ ఫీజు) విధించారు. కానీ ఆ కంపెనీలు జరిమానా చెల్లించకుండా.. వ్యాపారాన్ని యధేచ్ఛగా కొనసాగిస్తూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆయా కంపెనీల యజమానులు రాజకీయ పలుకుబడితో ఒత్తిడి తెచ్చి.. ఐదు రెట్ల పెనాల్టీని తగ్గించుకుని ఒక వంతుకు (మెమో నం.6665/ఆర్1/2016) తగ్గించుకున్నారు. ఈ మొత్తాన్ని కూడా సరిగా చెల్లించలేదు. కేవలం రూ.11 కోట్ల వరకు మాత్రమే చెల్లించారు. న్యాయ వాది మహేందర్‌రెడ్డి ఈ అంశాలన్నీ వివరిస్తూ ఈడీకి ఫిర్యాదు చేశారు. సదరు కంపెనీలు ఎగవేసిన పెనాల్టీలను తిరిగి వసూలు చేయాలని కోరా రు. ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాలు, పద్దుల నిర్వహణపై ప్రత్యేకంగా ఆడిటింగ్ చేస్తే మరిన్ని ఎగవేతలు, అక్రమాలు, భారీగా నల్లధనం వెలుగు లోకి వస్తాయని వివరించారు. వెంటనే ఆ సంస్థల బ్యాంకు ఖాతాలను సీజ్ చేయాలని కోరారు. విచారణ షురూ! న్యాయవాది భేతి మహేందర్‌రెడ్డితోపాటు పలువురు రాజకీయ నాయకులు కూడా గ్రానైట్ అక్రమాల వ్యవహారంపై ఈడీకి వేర్వేరుగా లేఖలు రాశారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. కరీంనగర్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసిన గ్రానైట్ విషయంగా విచారణ మొదలుపెట్టింది. కరీంనగర్లో ఉత్పత్తి అయిన ఈ గ్రానైట్‌ను ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించి.. సదరు షిప్పింగ్ కంపెనీ ‘ఎలైట్ షిప్పింగ్ ఏజెన్సీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’కు లేఖ రాసింది. శ్వేత ఏజెన్సీస్, ఏఎస్ షిప్పింగ్, జేఎం బక్సీ అండ్ కంపెనీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్పోర్ట్, కేవీకే ఎనర్జీ, అరవింద్ గ్రానైట్స్, సంధ్య ఏజెన్సీస్, పీఎస్ఆర్ ఏజెన్సీస్, శ్రీవెంకటేశ్వర గ్రానైట్స్/ వెంకటేశ్వర లాజిస్టిక్స్ కంపెనీలు.. కరీంనగర్ నుంచి కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా ఎంతమేర గ్రానైట్ విదేశాలకు తరలించారు? కంపెనీల వివరాలు, యజమానులు/ భాగస్వాముల వివరాలు, ఈమెయిల్ ఐడీలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ కంపెనీలకు సంబంధించి ఇతర ఏ డాక్యుమెంట్లు ఉన్నా 10 రోజుల్లోగా పంపాలని కోరింది. గ్రానైట్ కంపెనీలకు ఈడీ జారీ చేసిన నోటీసు -
నకిలీ మకిలీ..!
సాక్షి, ఒంగోలు : జిల్లాలో నకిలీ వే బిల్లులతో గ్రానైట్ లారీలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయి. అడ్రస్ లేని కంపెనీలకు ఎటువంటి విచారణ లేకుండా అడ్డగోలుగా వే బిల్లులు ఇచ్చేస్తుండటంతో అక్రమ దందా యథేశ్ఛగా కొనసాగుతోంది. చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పెట్టి వందల కంపెనీలు సృష్టించేస్తున్నారు. ఫోన్ నంబర్లు, ఈ మెయిల్ అడ్రస్‌లు వంటి కనీస వివరాలు కూడా లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేయగానే వెంటనే ఈ– వేబిల్లులు ఇచ్చేస్తున్నారు. రోజుకు సుమారుగా 200 వరకూ గ్రానైట్ లారీలు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటే అందులో సగానికిపైగా లారీలకు బిల్లులు లేకుండా నకిలీ వే బిల్లుల ద్వారా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. గ్రానైట్ అక్రమ వ్యాపారుల జీరో దందా వల్ల ట్యాక్స్‌ల రూపంలో ప్రభుత్వ ఖజానాకు వచ్చే వందల కోట్ల రూపాయలకు గండి పడుతుంది. ఓ అదృశ్య వ్యక్తి మార్టూరు కేంద్రంగా 33 కంపెనీలను ఏర్పాటు చేసి 133 వే బిల్లులు పొందడమే కాకుండా వాటితో గ్రానైట్‌ను ఇతర రాష్ట్రాలకు తరలించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన 18 శాతం పన్నును చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న పరిస్థితి. దీన్ని గుర్తించిన సేల్స్‌ట్యాక్స్ అధికారులు నెల 7వ తేదీన అడ్రస్ లేకుండా వే బిల్లులు పొందిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మార్టూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఒక్క మార్టూరుకే పరిమితం కాకుండా జిల్లాలో గ్రానైట్ క్వారీలు ఉన్న బల్లికురవ, చీమకుర్తిల్లో సైతం నకిలీ వే బిల్లుల ద్వారా జోరుగా అక్రమ రవాణా జరుగుతందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షాలాది మంది గ్రానైట్ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారు. కొందరు అక్రమ వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా ఈ వ్యాపారాన్ని కలుషితం చేసేస్తున్నారు. జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ, మార్టూరు వంటి ప్రాంతాల్లో కొందరు అక్రమ వ్యాపారులు మాఫియాలాగా ఏర్పడి అవినీతి అధికారుల సహకారం, రాజకీయ నేతల అండదండలతో వక్ర మార్గంలో జీరో వ్యాపారం సాగిస్తున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ఈ అక్రమ దందా సాగుతోంది. గ్రానైట్ రవాణా చేయాలంటే వే బిల్లుల ద్వారా ప్రభుత్వానికి 18 శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు మాత్రం నకిలీ వే బిల్లుల కుంభకోణంతో వందలాది లారీలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన వందల కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతూ తమ జేబులు నింపుకుంటున్నారు. విజిలెన్స్ అధికారులు ఏడాది కాలంలో రూ.2 కోట్ల వరకూ పెనాల్టీలు వేయాలని లక్ష్యంగా ఉంది. అయితే గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడే వారి నుంచి పది నెలల వ్యవధిలోనే రూ.6.70 కోట్లు పెనాల్టీలు వసూలు చేశారంటే అక్రమ దందా ఏ స్థాయిలో జరుగుతందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో పిడుగురాళ్ల, దాచేపల్లి, విజయవాడ, వినుకొండ, వంటి ప్రాంతాల్లో నకిలీ వేబిల్లులతో వెళ్తున్న గ్రానైట్ లారీలు పట్టుబడిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో అయితే టీడీపీ నేతల అండతో అధికారులెవరూ వాటి జోలికి వెళ్లలేని పరిస్థితి ఉండేది. ఇప్పటికీ కొందరు అధికారులు, అక్రమ వ్యాపారులు మాత్రం వారి తీరు మార్చుకోవడం లేదు. అక్రమాలకు పాల్పడుతుందిలా... బిల్లులు లేకుండా నకిలీ వే బిల్లులతో గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రానైట్ రవాణాకు వే బిల్లులు ఇవ్వాలంటే గతంలో స్థానిక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపి నిజంగా కంపెనీ ఉంటేనే వే బిల్లులు మంజూరు చేసేవారు. అయితే జీఎస్టీ వచ్చిన తరువాత ఇందులో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే చాలు వారి గురించి ఎటువంటి విచారణ చేపట్టకుండానే ఇతర ప్రాంతాల అధికారుల ద్వారా వే బిల్లులు ఇచ్చేస్తున్నారు. దీంతో లోపాలను గుర్తించిన అక్రమార్కులు చనిపోయిన వారి ఆధార్‌కార్డులను సేకరించి దరఖాస్తులు చేయడం, ఫేక్ అడ్రస్‌లు, బ్యాంక్ అకౌంట్ నంబర్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తూ వందల సంఖ్యలో వే బిల్లులు సేకరిస్తున్నారు. వీటి ద్వారా అక్రమ రవాణాకు పాల్పడుతూ పక్క రాష్ట్రమైన తెలంగాణాకు వెళ్లగానే వే బిల్లులు రద్దు చేసేస్తున్నారు. కొందరు కోట్ల రూపాయల పన్నులు చెల్లించకుండా ఎగనామం పెట్టినా అడ్రస్ కూడా కనిపెట్టలేక వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నకిలీ వే బిల్లుల వ్యవహారంపై ఇప్పటికే ఏడు కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగతున్నా నకిలీ వే బిల్లుల డొంక మాత్రం కదలడం లేదు. -
సీబీఐకి గ్రానైట్ కుంభకోణం
సాక్షి, చెన్నై: గ్రానైట్ స్కాం కేసు సీబీఐకి అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని విచారణ కమిటీ చైర్మన్, ఐఏఎస్ అధికారి సహాయంకు మదురై పరిసరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రానైట్ అక్రమాలకు పాల్పడ్డ వాళ్లకు శిక్ష పడాలని, అక్రమార్జనను వారి నుంచి కక్కించాలని విన్నవించారు. ఈ మేరకు బుధవారం సహాయం కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మదురై కేంద్రంగా వేలాది కోట్ల మేరకు గ్రానైట్ స్కాం జరిగిన విషయం తెలిసిందే. మద్రాసు హైకోర్టు ఆదేశాలతో ఈ స్కాంపై సమగ్ర విచారణను ఐఏఎస్ అధికారి సహాయం నేతృత్వంలోని కమిటీ చేపట్టింది. తన విచారణను సహాయం పలు దఫాలుగా సాగిస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం, ఆ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించడం, మళ్లీ ఫిర్యాదులు స్వీకరించడం, తనిఖీలు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం బాధితుల నుంచి ఫిర్యాదుల్ని, వారు సమర్పించిన ఆధారాలను ఆయన స్వీకరించే పనిలో పడ్డారు. అధిక శాతం మంది బాధితులు గ్రానైట్ స్కాం విచారణ అనంతరం కేసును సీబీఐకు అప్పగించాలని విన్నవిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు తమరు సమగ్ర విచారణ జరుపుతున్నారని, తరువాత కేసును సీబీఐకు అప్పగిస్తేనే న్యాయం జరుగుతుందని వివరిస్తున్నారు. సీబీఐ కేసులు నమోదు చేసిన పక్షంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభా గం తన పనిని వేగవంతం చేస్తుందని, అప్పుడు అక్రమార్జనను కక్కించేందుకు వీలుందని సూచించే పనిలో పడ్డారు. కేసును రాష్ట్ర పోలీసులకు అప్పగించిన పక్షంలో తమ విచారణ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందన్నారు. తమరు నివేదిక సమర్పించే క్రమంలో కేసును సీబీఐకు అప్పగించే విధంగా కోర్టుకు సూచించాలని విజ్ఞప్తి చేస్తుండడం విశేషం. కొందరు అధికారుల్ని తన విచారణకు రావాలని ఆదేశిస్తూ మదురైలో ఉన్న వారికి సహాయం నోటీసులు పంపించడం గమనార్హం.