సీబీఐకి గ్రానైట్ కుంభకోణం
సాక్షి, చెన్నై: గ్రానైట్ స్కాం కేసు సీబీఐకి అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని విచారణ కమిటీ చైర్మన్, ఐఏఎస్ అధికారి సహాయంకు మదురై పరిసరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రానైట్ అక్రమాలకు పాల్పడ్డ వాళ్లకు శిక్ష పడాలని, అక్రమార్జనను వారి నుంచి కక్కించాలని విన్నవించారు. ఈ మేరకు బుధవారం సహాయం కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మదురై కేంద్రంగా వేలాది కోట్ల మేరకు గ్రానైట్ స్కాం జరిగిన విషయం తెలిసిందే. మద్రాసు హైకోర్టు ఆదేశాలతో ఈ స్కాంపై సమగ్ర విచారణను ఐఏఎస్ అధికారి సహాయం నేతృత్వంలోని కమిటీ చేపట్టింది.
తన విచారణను సహాయం పలు దఫాలుగా సాగిస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం, ఆ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించడం, మళ్లీ ఫిర్యాదులు స్వీకరించడం, తనిఖీలు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం బాధితుల నుంచి ఫిర్యాదుల్ని, వారు సమర్పించిన ఆధారాలను ఆయన స్వీకరించే పనిలో పడ్డారు. అధిక శాతం మంది బాధితులు గ్రానైట్ స్కాం విచారణ అనంతరం కేసును సీబీఐకు అప్పగించాలని విన్నవిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు తమరు సమగ్ర విచారణ జరుపుతున్నారని, తరువాత కేసును సీబీఐకు అప్పగిస్తేనే న్యాయం జరుగుతుందని వివరిస్తున్నారు. సీబీఐ కేసులు నమోదు చేసిన పక్షంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభా గం తన పనిని వేగవంతం చేస్తుందని, అప్పుడు అక్రమార్జనను కక్కించేందుకు వీలుందని సూచించే పనిలో పడ్డారు.
కేసును రాష్ట్ర పోలీసులకు అప్పగించిన పక్షంలో తమ విచారణ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందన్నారు. తమరు నివేదిక సమర్పించే క్రమంలో కేసును సీబీఐకు అప్పగించే విధంగా కోర్టుకు సూచించాలని విజ్ఞప్తి చేస్తుండడం విశేషం. కొందరు అధికారుల్ని తన విచారణకు రావాలని ఆదేశిస్తూ మదురైలో ఉన్న వారికి సహాయం నోటీసులు పంపించడం గమనార్హం.