నత్తనడకన ‘ఆహార భద్రత’!
దరఖాస్తుల్లో పది శాతమే పూర్తయిన పరిశీలన
పింఛన్ దరఖాస్తుల పరిస్థితీ అంతే
భారీగా దరఖాస్తులు రావడం వల్లే ఆలస్యమవుతోందంటున్న అధికారులు
హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార భద్రత కార్డులు, పింఛన్ల మంజూరు కోసం స్వీకరించిన దర ఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతోంది. ఈ నెల 15వ తేదీ నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభించగా... ఇప్పటివరకు ఆహార భద్రత కు సంబంధించి పది శాతం, పింఛన్‌కు సం బంధించి 20 శాతం దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయింది. అయితే భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పరిశీలన ఆలస్యమవుతోందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. వృద్ధులు, వితంతువులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ. 1,500 పింఛన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో... అర్హులతో పాటు అనర్హులు కూడా భారీ సంఖ్యలో వీటికోసం దరఖాస్తులు చేసుకున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశముందని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం సంతృప్త స్థాయిలోనే 31.67 లక్షల పెన్షన్లు ఉండగా... తాజాగా వచ్చిన దరఖాస్తులు 37.94 లక్షలను మించిపోయాయని అధికారవర్గాలు తెలిపాయి. అదే విధంగా ప్రస్తుతమున్న రేషన్‌కార్డుల్లో లక్షల సంఖ్యలో బోగస్ అని ప్రభుత్వం భావిస్తుండగా... తాజా గా ఆహార భద్రత కార్డుల కోసం 92.73 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయని పేర్కొన్నాయి.
ఇందులోనూ శనివారం నాటికి 8.33 లక్షల దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే నవంబర్ 8వ తేదీన కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని భావిస్తున్నప్పటికీ.. అది సాధ్యమయ్యే అవకాశం కనిపించకపోవడంతో నవంబర్ 20వ తేదీకి పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆహా ర భద్రత దరఖాస్తుల్లో 30 లక్షలకుపైగా.. పింఛన్ దరఖాస్తుల్లోనూ సగం వరకూ తిరస్కరణకు గురయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ‘సమగ్ర సర్వే’ ఆధారంగా చూస్తే.. తెలంగాణలో పింఛన్లు ఇరవై లక్షలకు మించరాదన్న అభిప్రాయాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా వచ్చేనెల మాత్రమే పెన్షన్‌దారులకు నేరుగా నగదు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్లను పూర్తిగా పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర పోస్టుమాస్టర్ జనరల్ సంధ్యారాణి, ఇతర అధికారులతో సంప్రదింపులు జరిపింది.