పింఛన్లలోనూ పచ్చపాతమే
♦ జమ్మలమడుగు, బద్వేలుకు మాత్రమే కొత్త పింఛన్లు
♦ బద్వేలుకు అదనంగా మరో 1,270 కొత్త పింఛన్లు పంపిణీ
♦ మిగతా నియోజకవర్గాలను పట్టించుకోని పాలకులు
అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్న చందంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నిధులు, పదవులే కాదు పింఛన్ల మంజూరులోనూ ‘పచ్చ’పాతం చూపిస్తోంది. ఇటీవల టీడీపీలో చేరిన బద్వేలు, జమ్మలమడుగు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని వారికి పింఛన్లను ఓకే చేసిన ప్రభుత్వం.. మిగతా ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు మొండిచేయి చూపించింది.
కడప రూరల్: ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత పాలకులు వింతపోకడలకు పోతున్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించి ఆదర్శంగా ఉండాల్సిన నేతలు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు ఉదాహరణగా జమ్మలమడుగు, బద్వేలు నియోజవర్గ ప్రాంతాల్లోని పింఛన్ల మంజూరు విషయాన్నే చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళితే.. వృద్ధాప్య, వితంతు,వికలాంగ పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించి అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాల్సిన ప్రభుత్వం కేవలం బద్వేలు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లోని వారికే మంజూరు చేసి తన నైజాన్ని మారోమారు చాటుకుంది.
కొత్త పింఛన్లకు ఎదురుచూస్తున్న 15,157 ఆ రెండు నియోజకవర్గాలకు చెందిన వారు కూడా పింఛన్లకు అర్హులే. వారికి కొత్తగా పింఛన్లు మంజూరు కావడం అందరూ హర్షించదగ్గ విషయమే. అయితే మిగిలిన నియోజకవర్గాల్లోని అర్హులు ఏ పాపం చేశారని కొత్త పింఛన్లను మంజూరు చేయడం లేదని పలువు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన రాజకీయ సమీకరణలు మార్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గత నెల జమ్మలమడుగుకు 1500, బద్వేలు నియోజకవర్గానికి 1000 కొత్త పింఛన్లను ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడమేగాక జమ్మలమడుగుకు 3750, బద్వేలుకు 953 కొత్త పింఛన్లను మంజూరు చేసింది.
ప్రస్తుతం వీరు పింఛన్లు తీసుకుంటున్నారు. తాజాగా బద్వేలు ప్రాంతానికి చెందిన 1270 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, వారికి కూడా పాలకులు ఆగమేఘాల మీద కొత్త పింఛన్లను మంజూరు చే శారు. మిగిలిన ఎనిమిది నియోజవర్గాల్లోని అర్హులను ఏమాత్రం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో దాదాపు 14 నెలలకు పైగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఆ రెండు నియోజకవర్గాలకు మాత్రమే కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. జూన్ 1వ తేది నుంచి కొత్తగా వెబ్సైట్లో అర్హులు జమ్మలమడుగు నుంచి 192 మంది, బద్వేలు నుంచి 292 మంది దరఖాస్తు చేసుకున్న వారున్నారు. వీరికి కూడా ప్రభుత్వం మళ్లీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తుందో లేదో చూడాలి. మరి పాలకులు మిగిలిన నియోజకవర్గాల్లోని వారికి కొత్త పింఛన్లను ఎప్పుడు మంజూరు చేస్తారో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.