‘వీఎంసీ’దే విజయం
విశాఖపట్నం సిటీ: మహా నగర పాలక సం స్థ ఉద్యోగుల గుర్తింపు కార్మికుల సంఘం ఎన్నికల్లో గంట మోగింది. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మద్దతుతో వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ విజయదుందుభి మోగించింది. తెలుగు దేశం పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన గుర్తింపు కార్మిక సంఘానికి జీవీఎంసీ ఉద్యోగులు షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో 700 పైచిలుకు ఓట్ల మెజార్టీ సాధించిన ‘కాగడా’ ఈసారి వెలవెలబోయింది. ఉదయం నుంచీ తొమ్మి ది చోట్ల జరిగిన పోలింగ్‌లో 3143 మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం లెక్కింపు అనంతరం వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూని యన్ 153 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు ప్రకటించారు.
అదనపు డిప్యూటీ లేబర్‌కమిషనర్ ఆర్. శ్రీనివాసరావు నేతృత్వంలోని సభ్యులు ఎన్నికలను నిర్వహించారు.ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతీ రౌండ్లోనూ ఇరు యూనియన్లకు సమానంగానే ఓట్లు వస్తుండడంతో విజయం దోబూచులాడిం ది. సగం ఓట్లు లెక్కించాక వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గుర్తు గంట మోగుతుందని ధీమాతో జీవీఎంసీ నుంచి ఊరేగింపుగా అశీలుమెట్టలోని శ్రీ సంపత్ వినాయగర్ ఆలయానికి వెళ్లి కొబ్బరి కాయ లు కొట్టారు. అక్కడి నుంచి ఊరేగింపుగా యూనియన్ కార్యాలయానికి వెళ్లారు. వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌కు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, బీఎంఎస్, ఇంటక్, సీఐటీయు, హెచ్ఎంఎస్ యూనియన్లు మద్దతు ఇచ్చాయి.
అందరికీ న్యాయం చేస్తా
విజయానికి సహకరించిన జీవీఎంసీ ఉద్యోగులందరికీ న్యాయం చేసేలా కృషి చేస్తాను. ఉద్యోగులంతా తన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా కోరుకున్నారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తన అనుచరులతో కొందరు ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేశారు. తద్వారా మా గెలుపును అడ్డుకోలేకపోయినా మెజార్టీని తగ్గించగలిగారు. అవినీతి, అసమర్ధత నాయకత్వాన్ని జీవీఎంసీ నుంచి పారద్రోలేలా ఉద్యోగులిచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది.
-వి.వి.వామన రావు, ప్రధాన కార్యదర్శి-వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్
విజయంపై వైఎస్సార్ సీపీ హర్షం
జీవీఎంసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బలపర్చిన వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ విజయం సాధించడంపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వంశీకృష్ణ శ్రీనివాస్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రానున్న జీవీఎంసీ ఎన్నికలకు ఇది శుభపరిణామమని పేర్కొన్నారు.