త్వరలో గ్రేటర్..!?
మారనున్న నగర రూపు
ప్రస్తుత నగర జనాభా 11.97 లక్షలు
గ్రామాల విలీనం అనంతరం 15.20 లక్షలు
ప్రస్తుత నగర విస్తీర్ణం 64 చదరపు కిలోమీటర్లు
గ్రేటర్ అయ్యాక 403.70 చ.కిలోమీటర్లు
విజయవాడ సెంట్రల్ /విజయవాడ రూరల్ : గ్రేటర్ దిశగా విజయవాడ పరుగుతీస్తోంది. విజయవాడ రూరల్ మండలాన్ని నగరంలో విలీనం చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ సిద్ధం చేసింది. మండలంలోని 11 గ్రామాలను విలీనం చేసేవిధంగా ప్రత్యేక జీవోను సిద్ధం చేసిందని సమాచారం. రూరల్ మండలంలోని నున్న, పాతపాడు, పి.నైనవరం, అం బాపురం, జక్కంపూడికాలనీ, గొల్లపూడి,రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి గ్రామాలు విజయవాడలో విలీనం కానున్నాయి. కొత్తూరు తాడేపల్లి, పైడూరుపా డు, రాయనపాడు గ్రామాలను జి.కొండూరు మండలంలో కలిపి, రూరల్ మండలాన్ని పూర్తి గా తొలగించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. నగరంలో కొత్తగా ఏర్పాటుచేసే మండల రెవెన్యూ కార్యాలయాల పరిధిలోకి ఈ గ్రామాలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఫైల్ సిద్ధం
గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన 2011లోనే తెరపైకి వచ్చింది. అప్పట్లో శివారు గ్రామ పంచాయతీలు దీన్ని వ్యతిరేకించాయి.రాజధాని నేపథ్యంలో బెజవాడ ప్రాధాన్యత పెరిగింది. మెట్రోరైలు ఏర్పాటు నేపథ్యంలో గ్రేటర్ తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలో సర్కార్ మళ్లీ గ్రేటర్ పల్లవి అందుకుంది. ఎనిమిది నెలల క్రితం టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేను నిర్వహించి నివేదిక ఇచ్చారు. గ్రేటర్‌కు సంబంధించి నగరపాలక సంస్థ ఐదునెలల క్రితమే కౌన్సిల్లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. గన్నవరం, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, బుద్ధవరం, వెదురుపావులూరు, కంకిపాడు, పెనమలూరు, పోరంకి, కానూరు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, ముస్తాబాద, నున్న, పాతపాడు, నైనవరంతో పాటు మరో 28 గ్రామలను విజయవాడలో విలీనం చేయడం ద్వారా గ్రేటర్ రూపుతెచ్చేందుకు కసరత్తు ముమ్మరమైంది. దీనికి సంబంధించిన ఫైల్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి టేబుల్‌పైకి చేరి నట్లు సమాచారం. కొద్ది రోజుల్లోనే గ్రేటర్ జాబితాలో బెజవాడ చేరనున్నట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలుస్తోంది.
పాలకుల్లో గుబులు
గ్రేటర్ కదలికలు ముమ్మరం కావడంతో మండలస్థాయి పాలకుల్లో గుబులు రేగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో విజయవాడ రూరల్ మండలం ఇక కనుమరుగుకానుంది.ఈ మేరకు మార్చి రెండో వారంలో మండల పరిషత్ చివరి సమావేశాన్ని నిర్వహించేందుకు పాలకవర్గం ఏర్పాట్లు చేస్తోంది. ఐదేళ్లకు ఎన్నికైన మండల పరిషత్ పాలకులు మూడేళ్ల పదవీకాలంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మొత్తం 45 గ్రామాలను విలీనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా కొన్ని గ్రామపంచాయతీలు ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా అన్న చందంగా పంచాయతీల విముఖతను ప్రభుత్వం పట్టించుకొనే పరిస్థితి లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.