రోడ్లతో పాటు పర్యావరణమూ ముఖ్యమే!
గ్రీన్ మిషన్ సలహాదారు ఏకే భట్టాచార్య
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులు పెరగడంవల్ల ట్రాఫిక్‌తో పాటు కర్బన ఉద్గారాలు కూడా పెరుగుతాయని, వాటి ప్రభావాన్ని తగ్గించడమే ‘మిషన్ గ్రీన్ హైవేస్’ లక్ష్యం అని నేషనల్ హైవేస్ అథారిటీ (గ్రీన్ మిషన్) సలహాదారు ఏకే భట్టాచార్య పేర్కొన్నారు. నిర్మాణం పూర్తయిన రోడ్ల వెంట పెద్ద సంఖ్యలో చెట్లను పెంచటం ద్వారా ఈ సమ స్యను పరిష్కరించవచ్చన్నారు. అభివృద్ధి, రోడ్ల నిర్మాణం వల్ల వన్యప్రాణులకు నష్టం కలగకుండా చూడాలన్నారు. పచ్చదనం కోసం తీసుకుంటున్న చర్యల్లో కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు. జాతీయ రహదారులు నిర్మించటం ఎంత ప్రధానమో, వాటి వెంట పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తూ పర్యావరణాన్ని రక్షించుకోవటం కూడా అంతే ముఖ్యమ న్నారు. రోడ్ల విస్తరణలో చెట్ల తొలగింపును వీలైనంత తగ్గించి, అవసరమైతే భారీ చెట్లను మరోచోట నాటే ట్రాన్స్ లోకేషన్ పద్ధతిని అనుసరించాలన్నారు.
శనివారం అరణ్య భవన్లో పర్యావరణ హిత జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, కేంద్ర సహకారంపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, పచ్చదనం ఆవశ్యకత, రహదారులతో ముడిపడిన అభి వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన రాష్ట్ర అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భట్టాచార్య మాట్లాడుతూ, చెట్ల పెంపకానికి సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.
వచ్చే ఎన్ని కల్లో పర్యావరణ పరిరక్షణ కూడా ఒక ప్రధాన అంశం కావాలంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వివిధ రహదారుల వెంట చెట్ల పెంపకం కోసం హైవేస్ అథారిటీ నిధులు విడుదల చేయాలని అటవీ శాఖ ప్రధాన సంరక్షణ అధికారి పి.కె.ఝా, అదనపు ప్రధాన అటవీ సంరక్షణ అధికారి ఆర్.ఎమ్.డోబ్రియల్, భట్టాచార్యను కోరారు. ఈ సమావేశంలో నేషనల్ హైవేస్ రీజనల్ ఆఫీసర్ విజయ్ శ్రీ వాత్సవ్, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అదనపు అటవీ సంరక్షణ అధికారులు మనో రంజన్ భాంజా, మునీంద్ర పాల్గొన్నారు.