ఏపీలో అల్ట్రాటెక్ సిమెంట్ భారీ ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ అల్ట్రాటెక్... ఆంధ్రప్రదేశ్‌లో భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి సంస్థకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కర్నూలు జిల్లా పెట్నికోట వద్ద రానున్న ఈ ప్రాజెక్టుకై అల్ట్రాటెక్ సుమారు రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇప్పటికే కంపెనీ 431.92 హెక్టార్ల స్థలాన్ని ప్లాంటు కోసం కొనుగోలు చేసింది. ప్రతిపాదిత ప్రాజెక్టులో భాగంగా 40 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో క్లింకర్ యూనిట్, 60 లక్షల టన్నుల సామర్థ్యంతో సిమెంటు తయారీ కేంద్రాలు ఏర్పాటవుతాయి.
అలాగే ప్లాంటు అవసరాల కోసం 60 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుతోపాటు తయారీ ప్రక్రియలో జనించే వేడి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 15 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కూడా రానుంది. 900 మందికి ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి లభించనుందని సమాచారం. ప్రాజెక్టు ఏర్పాటు, నిర్వహణకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి అల్ట్రాటెక్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. విభిన్న రంగాల్లో ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీయే అల్ట్రాటెక్ సిమెంట్. సామర్థ్యం పరంగా భారత్‌లో అతిపెద్ద సిమెంటు ఉత్పత్తిదారుగా నిలిచింది. అయిదు దేశాల్లో విస్తరించిన ఈ సంస్థకు ఏటా 6.8 కోట్ల టన్నుల సిమెంటు తయారీ సామర్థ్యం ఉంది.