greenhouses
-
‘రెడ్ జోన్’లో గ్రీన్హౌస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రీన్హౌస్ రైతుల వెతలు ఇవి. గ్రీన్హౌస్లో కూరగాయలు సాగుచేసిన రైతులంతా నష్టాల పాలై అప్పుల్లో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం గ్రీన్హౌస్ సాగుకు ప్రోత్సాహం కోసం 75 శాతం సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రీన్హౌస్ సాగుకు ఎకరానికి దాదాపు రూ.40 లక్షల వరకు ఖర్చయితే.. ప్రభుత్వమే రూ.30 లక్షలు భరిస్తుండగా, రైతులు రూ.10 లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,042 ఎకరాల్లో గ్రీన్హౌస్లకు అనుమతి ఇచ్చారు. అందులో 600 ఎకరాల్లో జరబెర, 150 ఎకరాల్లో గులాబీ, చామంతి తదితర పూల సాగు జరుగుతోంది. మిగతా 292 ఎకరాల్లో రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. అయితే సరైన విత్తనాలు, సాంకేతిక అవగాహన కరువై నష్టాలపాలవుతున్నారు. పూలతో లాభాలు జరబెర వంటి పూల సాగుతో రైతులు లాభాలు పొందుతున్నారు. కూరగాయల సాగుతో మాత్రం చాలా చోట్ల నష్టాలే వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో అయితే పూల సాగులోనూ పెద్దగా లాభాలు రాని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. రైతులకు అవగాహన లేకపోవడం, అధికారుల నుంచి సహకారం లభించకపోవడం, వాతావరణంలో వచ్చే మార్పులను అంచనా వేసే పరిస్థితి లేకపోవడం తదితర కారణాల వల్ల రైతులు నష్టపోతున్నారు. ఉదాహరణకు చేవెళ్ల మండలం చెనుపల్లిలో ఒక రైతు సీజన్లో టమాటా సాగు చేశారు. కానీ ధర కిలో రెండు మూడు రూపాయలకు పడిపోవడంతో తీవ్రంగా నష్టాల పాలయ్యారు. ఏ సమయంలో ఏయే కూరగాయలు సాగు చేయాలన్న అవగాహన లేక ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. సూచనలతో లాభదాయకం అయితే పలు చోట్ల రైతులు స్వయంగా సొమ్ము ఖర్చు చేసుకుని.. శాస్త్రవేత్తల సూచనలతో లాభాలు పొందుతున్నారు. చేవెళ్ల మండలం చెనుపల్లిలో 45 గ్రీన్‌హౌస్‌ల సాగును పరిశీలించేందుకు నెలకోసారి పుణే నుంచి శాస్త్రవేత్త వస్తుంటారు. వచ్చినప్పుడల్లా ఒక్కో రైతు రూ.3 వేల చొప్పున రూ.1.35 లక్షలు ఆయనకు చెల్లించి.. తగిన సూచనలు పొందుతుంటారు. దీంతో అక్కడ గ్రీన్హౌస్ సాగు లాభదాయకంగా ఉంది. మిగతా చోట్ల ఈ పరిస్థితి లేదు. సాధారణ రైతులకు అవగాహన లేక, ప్రభుత్వం నుంచి తగిన తోడ్పాటు లేక నష్టాలపాలవుతున్నారు. నెట్హౌస్లపై దృష్టి.. గ్రీన్ హౌస్‌లకు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చయ్యే నెట్ హౌస్‌పై రైతులు దృష్టి సారిస్తున్నారు. దీనికి ఎకరానికి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. పంజాబ్, హరియాణాల్లో నెట్‌హౌస్ పద్ధతిలో కూరగాయల సాగు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా కూరగాయల సాగుకు నెట్హౌస్లను ప్రోత్సహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రైతు పేరు నాగిరెడ్డి.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం లక్ష్మీపురం. రెండేళ్ల కింద ఎకరా విస్తీర్ణంలో గ్రీన్హౌస్ సాగు మొదలుపెట్టారు. రూ.10 లక్షలు అప్పుచేసి మార్జిన్ మనీగా ప్రభుత్వానికి చెల్లించారు. భూమిలో మట్టి మార్పు, ఎరువులు, విత్తనాలు, ఇతర ఖర్చులకు మరో రూ.5 లక్షలు ఖర్చుచేశారు. గ్రీన్హౌస్లో క్యాప్సికం, టమాటా సాగుచేశారు. కానీ దిగుబడులు సరిగా రాలేదు. సీజన్లో టమాటా బాగా పండినా ధర లేక నష్టం వాటిల్లింది. ఏడాదిగా గ్రీన్‌హౌస్‌ను ఖాళీగా ఉంచారు. ఇప్పుడా భూమిని అమ్మకానికి పెట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం మారెపల్లికి చెందిన ఈ రైతుపేరు రాజిరెడ్డి. రెండేళ్ల క్రితం మూడెకరాల్లో గ్రీన్హౌస్ సాగు మొదలుపెట్టారు. కీరా, క్యాప్సికం, టమాటా పంటలు వేశారు. టమాటా ఏపుగా పెరిగినా దిగుబడి రాలేదు. గతేడాది క్యాప్సికం వేసినా.. గ్రీన్హౌస్ నిర్మాణం దెబ్బతిని పంటకు నష్టం వాటిల్లిందని, వేసవిలో కీరా వేస్తే వైరస్ కారణంగా నష్టం వాటిల్లిందని ఆయన వాపోతున్నారు. మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని పేర్కొంటున్నారు. ప్రత్యేక నిర్వహణ అవసరం గ్రీన్హౌస్లో కూరగాయలు సాగు చేయాలంటే ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రోజువారీగా పరిజ్ఞానం పెంచుకోవాలి. నిర్వహణ సరిగా లేకపోతే నష్టాలు తప్పవు. ఏ సీజన్లో ఏ పంటలు వేసుకోవాలన్న అవగాహన ఉండాలి. వర్షాకాలంలో ఆకుకూరలు, చలికాలంలో బెండ, బీర, కాకరకాయలు పండించాలి. క్యాప్సికం, కీరాలకు ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. మార్కెట్ సరళిని బట్టి పూల సాగు చేపట్టాలి.. – వెంకట్రామిరెడ్డి, ఉద్యానశాఖ కమిషనర్ -
కుటుంబంలా పనిచేద్దాం..
♦ సమష్టి కృషితోనే సమగ్రాభివృద్ధి ♦ సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి ♦ హరితహారం విజయవంతానికి ♦ గ్రామ హరిత రక్షణ కమిటీలు ♦ ఏ జిల్లాలో కూడా పథకాల అమలు సక్రమంగా లేదు ♦ పోడు విషయంలో పేద వాడితో యుద్ధం చేయొద్దు ♦ ఐదు జిల్లాల స్థాయి సమీక్ష సమావేశంలో ♦ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ♦ హాజరైన మంత్రులు ఈటల రాజేందర్, చందూలాల్ హన్మకొండ: అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల అమలుకు కలెక్టర్లు, అధికారులు ప్రాధాన్యం ఇస్తూ.. సమష్టి కృషితో కుటుంబంలా పనిచేస్తూ అభివృద్ధిని పరుగెత్తించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. హన్మకొండ నక్కలగుట్టలోని నందన గార్డెన్స్‌లో వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయం, హరితహారం, మత్స్స్యశాఖ, గొర్రెల పంపిణీతో పాటు ఇతర సంక్షేమ పథకాలపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ సమీక్షించారు. ఈ సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు తీరు ఐదు జిల్లాల్లోనూ సరిగ్గా లేద ని, దీనిపై ప్రజాప్రతినిధులు అసంతృప్తితో ఉన్నారన్నారు. ఇక నుంచైనా కలెక్టర్లు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. అప్పుడే వారికీ మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. 2015–2016 సంవత్సరానికి సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఇచ్చే రాయితీ విడుదలైందని.. నెలాఖారులోపు లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందేలా చూడాలన్నారు. ఈ విషయమై బ్యాంకు అధికారులతో కలెక్టర్లు స్వయంగా మాట్లాడాలని.. సహకరించని బ్యాంకుల లైసెన్స్ రద్దుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో పాత పద్ధతులు ఆటంకంగా కనిపిస్తే.. కొత్తగా ఏం చేయాలో ఆలోచించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కార్యక్రమాలు నత్తనడకన నడుస్తున్నాయని శ్రీహరి పేర్కొన్నారు. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడే భరించేలా మార్పులు చేసి పథకాలు అమలయ్యేలా చూడాల్సిన అవసరముందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఐదు జిల్లాల్లోనూ భూమి కొనుగోలు పథకం నత్తనడకన నడుస్తోందని కడియంశ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్లు ఉన్నత స్థానంలో ఉండి నిర్ణయాలు తీసుకోకపోవడంతో కాలయాపన జరుగుతుందన్నారు. వెంట వెంట నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అలాగే, జిల్లాల్లో రెండు పడుకల గదుల నిర్మాణంలో వెనుకబడి ఉన్నామని కడియం తెలిపారు. కాగా, ఆశించిన మేరకు వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగులో నిమగ్నమయ్యారని.. ఈ మేరకు నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో మహబూబాబాద్ జిల్లా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. 12 నుంచి ‘హరితహారం’ హరితహారం కార్యక్రమం ఈ నెల 12 నుంచి మొదలుకానుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆలోపే అన్ని గ్రామాల్లో హరిత రక్షణ కమిటీలు వేయాలన్నారు. ఒక్కో గ్రామానికి ఒక్క అధికారిని ఇన్చార్జిగా నియమించాలని సూచించారు. నాటిని ప్రతీ మొక్క బతకాలన్న లక్ష్యంతో పనిచేస్తేనే హరితహారం విజయవంతమవుతుందన్నారు. ఇక పోడు చేసుకుంటున్న రైతులను ముట్టుకోకుండా.. కొత్తగా అడవులు నరుకకుండా చూస్తే చాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. పేద వాడితో యుద్ధం చేయాల్సి అవసరం లేదని అటవీ అధికారులకు కడియం హితవు పలికారు. వరంగల్ మహానగర పాలక సంస్థ సొంత నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాగా, గొర్రెల పంపిణీలో సమస్యలను అధిగమనించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది 70 కోట్ల చేప పిల్లలను ఐదు జిల్లాలోని చెరువుల్లో విడిచిపెట్టనున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు. బ్యాంకర్లకు గట్టిగానే చెప్పాం.. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలుకు ఆర్థిక సహాయం అందించాలని బ్యాంకర్లకు గట్టిగానే చెప్పామన్నారు. బ్యాంకులకు రుణాలు ఇవ్వాలని సక్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. హరిత హారం కార్యక్రమం మొక్కుబడిగా కాకుండా నాటిన ప్రతి మొక్క బతికేలా చూడాలన్నారు. సంఖ్య కోసం కాకుండా మొక్కను కాపాడే దిశగా ఆలోచించాలన్నారు. 8వ తరగతి పైచదువులు చదువుతున్న విద్యార్థులను హరితహారంలో భాగస్వామలను చేయాలన్నారు. అటవీ ప్రాంతంలో పండ్ల మొక్కలను నాటితే ఈ ప్రాంత ప్రజలకు ఉపాది లబిస్తుందన్నారు. చెరువులను బట్టి చేప పిల్లలను వదలాలని ఈటల సూచించారు. సమీక్ష సమావేశంలో శాసనమండలి విప్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కనకయ్య, ఒడితల సతీష్‌కుమార్, రాష్ట్ర సహకార సంస్థల చైర్మన్లు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వి.ప్రకాశ్, కన్నెబోయిన రాజయ్య, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, గుండు సుధారాణి, బొల్లం సంపత్‌కుమార్, యూసఫ్ జావేద్, కిషన్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ లచ్చిరాంనాయక్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య, ఎస్టీ కార్పొరేషన్ ఎండీ లక్ష్మణ్, మైనార్టీ కార్పోరేషన్ జీఎం బారి, కలెక్టర్లు ఆమ్రపాలి కాట, ప్రశాంత్‌జీవన్ పాటిల్, శ్రీదేవసేన, ప్రీతిమీనా, ఆకునూరి మురళి, వరంగల్ మహానగర పాలక సంçస్థ కమిషనర్ శృతి ఓఝా పాల్గొన్నారు. -
114 మండలాలకు ‘గ్రీన్హౌస్’!
హైదరాబాద్ చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిని నిర్ధారించిన ఉద్యానశాఖ ఈ మండలాల్లో గ్రీన్‌హౌస్‌లు ఏర్పాటు చేసే రైతులకు సబ్సిడీ ఈ మండలాల్లో ‘పరిధి’ మించిన గ్రామాలకు పథకం వర్తింపు ఉండదు మొక్కలు, ఇతర వ్యవసాయ పనులకూ 75 శాతం సబ్సిడీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల పరిధిలోని 114 మండలాల రైతులకు ‘గ్రీన్హౌస్’ల ఏర్పాటులో సబ్సిడీ లభించనుంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన ఈ మండలాల జాబితాను రాష్ట్ర ఉద్యానశాఖ నిర్ధారించింది. అంతేగాకుండా గ్రీన్‌హౌస్‌ల నిర్మాణంతో పాటు మొక్కల కొనుగోలు, ఇతరత్రా పనులకు సంబంధించి కూడా 75 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో గ్రీన్హౌస్లను విస్తృతంగా ప్రోత్సహించాలని నిర్ణయించిన ప్రభుత్వం... హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రాంతాల వారికి సబ్సిడీ అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పరిధిలోకి వచ్చే మండలాలు, గ్రామాలను ఉద్యానశాఖ అధికారులు గురువారం గుర్తించారు. దీనిప్రకారం హైదరాబాద్‌లో భూమి ఉన్న రైతులెవరైనా ‘గ్రీన్హౌస్’ల నిర్మాణానికి సబ్సిడీ పొందవచ్చు. ఇక మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మిగతా మండలాలు ఉన్నాయి. అయితే పలు మండలాల్లోని కొన్ని గ్రామాలు ‘వంద కిలోమీటర్ల’ పరిధిలోకి రాకపోవడంతో... వాటిని జాబితా నుంచి మినహాయించారు. గ్రీన్‌హౌస్‌ల నిర్మాణాలతో పాటు మొక్కలపై, ఇతరత్రా రైతులు చేసే పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించింది. వీటికోసం చదరపు మీటరుకు 140 చొప్పున ఎకరానికి రూ. 5.60 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో రూ. 4.20 లక్షలను (75 శాతం) ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వనుండగా... రైతులు రూ. 1.40 లక్షలు (25 శాతం) చెల్లించాల్సి ఉంటుంది. ఈ సొమ్ముతో కలుపుకొని మొత్తంగా గ్రీన్‌హౌస్‌ల నిర్మాణ వ్యయం ఎకరాకు రూ. 39.36 లక్షలు కానుంది. ఇందులో ప్రభుత్వం 75 శాతంగా రూ. 29.52 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. రైతు 25 శాతం వాటాగా రూ. 9.84 లక్షలు చెల్లించాలి. ఈ వివరాలను ఉద్యానశాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘గ్రీన్హౌస్’ మండలాలు, పలు గ్రామాలు.. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట, కొందుర్గు, కొత్తూరు, ఫారూఖ్‌నగర్, బాలానగర్, జడ్చర్ల, కల్వకుర్తి, తలకొండపల్లి, నవాజ్పేట్, తిమ్మాజీపేట్, బూత్పూర్, మహబూబ్‌నగర్, వెల్దండ, మిడ్చిల్, ఆమనగల్, మాడ్గుల్, వంగూరు, బొమ్మరాసిపేట నల్లగొండ జిల్లాలో బి.రామారం, బీబీనగర్, భువనగిరి, యాదగిరిగుట్ట, ఎం.తుర్కపల్లి, ఆలేరు, రాజాపేట, వలిగొండ, గుండాల, ఆత్మకూర్ (ఎం), బి.పోచంపల్లి, చౌటుప్పల్, రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి, నారాయణపేట్, మర్రిగూడ, నాంపల్లి, చింతపల్లి, చండూరు, మునుగోడు, నల్లగొండ, కట్టంగూర్, మోత్కూర్ మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, ఆందోల్, పుల్కల్, జిన్నారం, హత్నూర, సిద్దిపేట, చిన్నకోడూర్, నంగనూర్, మిరుదొడ్డి, దుబ్బాక, గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక, వర్గల్, ములుగు, తొగుట, జహీరాబాద్, రాయ్‌కోడ్, మెదక్, పాపన్నపేట, టేక్మల్, శంకరామపేట (ఆర్), సదాశివపేట, ఆర్సీ పురం, పటాన్చెరు, కొండాపూర్, కోహిర్, మునిపల్లి, రామాయంపేట, చేగుంట, యెల్దుర్తి, దౌల్తాబాద్, తూప్రాన్, నర్సాపూర్, శివంపేట, కౌడిపల్లి, కుల్చారం నిజామాబాద్ జిల్లాలోని మాచిరెడ్డిపల్లి, కామారెడ్డి, దోమకొండ, భిక్నూర్, తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట వరంగల్ జిల్లాలోని చేర్యాల, మద్దూర్, నర్మెట, బచ్చన్నపేట, జనగాం, లింగాల ఘనపురం, రఘునాథపల్లి, స్టేషన్ ఘన్పూర్, దేవరుప్పుల రంగారెడ్డి జిల్లాలోని ధరూర్, పరిగి, దోమ, కులకచర్ల, మహేశ్వరం, కందుకూర్, షాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్, మేడ్చల్, శామీర్‌పేట్, బాలానగర్, ఉప్పల్, శేరిలింగంపల్లి, కీసర, ఘట్కేసర్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, తాండూర్, మోమినిపేట్, మార్పల్లి, బంట్వారం, యాలాల్, పెద్దేముల్, చేవెళ్ల, పూడూర్, వికారాబాద్, నవాబుపేట, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల్, సరూర్‌నగర్, హయత్‌నగర్.