114 మండలాలకు ‘గ్రీన్‌హౌస్’!
- హైదరాబాద్ చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిని నిర్ధారించిన ఉద్యానశాఖ
- ఈ మండలాల్లో గ్రీన్‌హౌస్‌లు ఏర్పాటు చేసే రైతులకు సబ్సిడీ
- ఈ మండలాల్లో ‘పరిధి’ మించిన గ్రామాలకు పథకం వర్తింపు ఉండదు
- మొక్కలు, ఇతర వ్యవసాయ పనులకూ 75 శాతం సబ్సిడీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల పరిధిలోని 114 మండలాల రైతులకు ‘గ్రీన్‌హౌస్’ల ఏర్పాటులో సబ్సిడీ లభించనుంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన ఈ మండలాల జాబితాను రాష్ట్ర ఉద్యానశాఖ నిర్ధారించింది. అంతేగాకుండా గ్రీన్‌హౌస్‌ల నిర్మాణంతో పాటు మొక్కల కొనుగోలు, ఇతరత్రా పనులకు సంబంధించి కూడా 75 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో గ్రీన్‌హౌస్‌లను విస్తృతంగా ప్రోత్సహించాలని నిర్ణయించిన ప్రభుత్వం... హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రాంతాల వారికి సబ్సిడీ అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పరిధిలోకి వచ్చే మండలాలు, గ్రామాలను ఉద్యానశాఖ అధికారులు గురువారం గుర్తించారు. దీనిప్రకారం హైదరాబాద్‌లో భూమి ఉన్న రైతులెవరైనా ‘గ్రీన్‌హౌస్’ల నిర్మాణానికి సబ్సిడీ పొందవచ్చు. ఇక మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మిగతా మండలాలు ఉన్నాయి. అయితే పలు మండలాల్లోని కొన్ని గ్రామాలు ‘వంద కిలోమీటర్ల’ పరిధిలోకి రాకపోవడంతో... వాటిని జాబితా నుంచి మినహాయించారు.
గ్రీన్‌హౌస్‌ల నిర్మాణాలతో పాటు మొక్కలపై, ఇతరత్రా రైతులు చేసే పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించింది. వీటికోసం చదరపు మీటరుకు 140 చొప్పున ఎకరానికి రూ. 5.60 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో రూ. 4.20 లక్షలను (75 శాతం) ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వనుండగా... రైతులు రూ. 1.40 లక్షలు (25 శాతం) చెల్లించాల్సి ఉంటుంది. ఈ సొమ్ముతో కలుపుకొని మొత్తంగా గ్రీన్‌హౌస్‌ల నిర్మాణ వ్యయం ఎకరాకు రూ. 39.36 లక్షలు కానుంది. ఇందులో ప్రభుత్వం 75 శాతంగా రూ. 29.52 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. రైతు 25 శాతం వాటాగా రూ. 9.84 లక్షలు చెల్లించాలి. ఈ వివరాలను ఉద్యానశాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
‘గ్రీన్‌హౌస్’ మండలాలు, పలు గ్రామాలు..
మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట, కొందుర్గు, కొత్తూరు, ఫారూఖ్‌నగర్, బాలానగర్, జడ్చర్ల, కల్వకుర్తి, తలకొండపల్లి, నవాజ్‌పేట్, తిమ్మాజీపేట్, బూత్పూర్, మహబూబ్‌నగర్, వెల్దండ, మిడ్చిల్, ఆమనగల్, మాడ్గుల్, వంగూరు, బొమ్మరాసిపేట
నల్లగొండ జిల్లాలో బి.రామారం, బీబీనగర్, భువనగిరి, యాదగిరిగుట్ట, ఎం.తుర్కపల్లి, ఆలేరు, రాజాపేట, వలిగొండ, గుండాల, ఆత్మకూర్ (ఎం), బి.పోచంపల్లి, చౌటుప్పల్, రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి, నారాయణపేట్, మర్రిగూడ, నాంపల్లి, చింతపల్లి, చండూరు, మునుగోడు, నల్లగొండ, కట్టంగూర్, మోత్కూర్
మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, ఆందోల్, పుల్కల్, జిన్నారం, హత్నూర, సిద్దిపేట, చిన్నకోడూర్, నంగనూర్, మిరుదొడ్డి, దుబ్బాక, గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక, వర్గల్, ములుగు, తొగుట, జహీరాబాద్, రాయ్‌కోడ్, మెదక్, పాపన్నపేట, టేక్మల్, శంకరామపేట (ఆర్), సదాశివపేట, ఆర్‌సీ పురం, పటాన్‌చెరు, కొండాపూర్, కోహిర్, మునిపల్లి, రామాయంపేట, చేగుంట, యెల్దుర్తి, దౌల్తాబాద్, తూప్రాన్, నర్సాపూర్, శివంపేట, కౌడిపల్లి, కుల్చారం
నిజామాబాద్ జిల్లాలోని మాచిరెడ్డిపల్లి, కామారెడ్డి, దోమకొండ, భిక్నూర్, తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట
వరంగల్ జిల్లాలోని చేర్యాల, మద్దూర్, నర్మెట, బచ్చన్నపేట, జనగాం, లింగాల ఘనపురం, రఘునాథపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, దేవరుప్పుల
రంగారెడ్డి జిల్లాలోని ధరూర్, పరిగి, దోమ, కులకచర్ల, మహేశ్వరం, కందుకూర్, షాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్, మేడ్చల్, శామీర్‌పేట్, బాలానగర్, ఉప్పల్, శేరిలింగంపల్లి, కీసర, ఘట్‌కేసర్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, తాండూర్, మోమినిపేట్, మార్పల్లి, బంట్వారం, యాలాల్, పెద్దేముల్, చేవెళ్ల, పూడూర్, వికారాబాద్, నవాబుపేట, శంకర్‌పల్లి, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల్, సరూర్‌నగర్, హయత్‌నగర్.