కుటుంబంలా పనిచేద్దాం..
♦ సమష్టి కృషితోనే సమగ్రాభివృద్ధి
♦ సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
♦ హరితహారం విజయవంతానికి
♦ గ్రామ హరిత రక్షణ కమిటీలు
♦ ఏ జిల్లాలో కూడా పథకాల అమలు సక్రమంగా లేదు
♦ పోడు విషయంలో పేద వాడితో యుద్ధం చేయొద్దు
♦ ఐదు జిల్లాల స్థాయి సమీక్ష సమావేశంలో
♦ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
♦ హాజరైన మంత్రులు ఈటల రాజేందర్, చందూలాల్
హన్మకొండ:
అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల అమలుకు కలెక్టర్లు, అధికారులు ప్రాధాన్యం ఇస్తూ.. సమష్టి కృషితో కుటుంబంలా పనిచేస్తూ అభివృద్ధిని పరుగెత్తించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. హన్మకొండ నక్కలగుట్టలోని నందన గార్డెన్స్‌లో వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయం, హరితహారం, మత్స్స్యశాఖ, గొర్రెల పంపిణీతో పాటు ఇతర సంక్షేమ పథకాలపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ సమీక్షించారు.
ఈ సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు తీరు ఐదు జిల్లాల్లోనూ సరిగ్గా లేద ని, దీనిపై ప్రజాప్రతినిధులు అసంతృప్తితో ఉన్నారన్నారు. ఇక నుంచైనా కలెక్టర్లు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. అప్పుడే వారికీ మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. 2015–2016 సంవత్సరానికి సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఇచ్చే రాయితీ విడుదలైందని.. నెలాఖారులోపు లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందేలా చూడాలన్నారు. ఈ విషయమై బ్యాంకు అధికారులతో కలెక్టర్లు స్వయంగా మాట్లాడాలని.. సహకరించని బ్యాంకుల లైసెన్స్ రద్దుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో పాత పద్ధతులు ఆటంకంగా కనిపిస్తే.. కొత్తగా ఏం చేయాలో ఆలోచించాలని ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కార్యక్రమాలు నత్తనడకన నడుస్తున్నాయని శ్రీహరి పేర్కొన్నారు. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడే భరించేలా మార్పులు చేసి పథకాలు అమలయ్యేలా చూడాల్సిన అవసరముందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఐదు జిల్లాల్లోనూ భూమి కొనుగోలు పథకం నత్తనడకన నడుస్తోందని కడియంశ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్లు ఉన్నత స్థానంలో ఉండి నిర్ణయాలు తీసుకోకపోవడంతో కాలయాపన జరుగుతుందన్నారు. వెంట వెంట నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అలాగే, జిల్లాల్లో రెండు పడుకల గదుల నిర్మాణంలో వెనుకబడి ఉన్నామని కడియం తెలిపారు. కాగా, ఆశించిన మేరకు వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగులో నిమగ్నమయ్యారని.. ఈ మేరకు నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో మహబూబాబాద్ జిల్లా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
12 నుంచి ‘హరితహారం’
హరితహారం కార్యక్రమం ఈ నెల 12 నుంచి మొదలుకానుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆలోపే అన్ని గ్రామాల్లో హరిత రక్షణ కమిటీలు వేయాలన్నారు. ఒక్కో గ్రామానికి ఒక్క అధికారిని ఇన్‌చార్జిగా నియమించాలని సూచించారు. నాటిని ప్రతీ మొక్క బతకాలన్న లక్ష్యంతో పనిచేస్తేనే హరితహారం విజయవంతమవుతుందన్నారు. ఇక పోడు చేసుకుంటున్న రైతులను ముట్టుకోకుండా.. కొత్తగా అడవులు నరుకకుండా చూస్తే చాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. పేద వాడితో యుద్ధం చేయాల్సి అవసరం లేదని అటవీ అధికారులకు కడియం హితవు పలికారు. వరంగల్ మహానగర పాలక సంస్థ సొంత నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాగా, గొర్రెల పంపిణీలో సమస్యలను అధిగమనించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది 70 కోట్ల చేప పిల్లలను ఐదు జిల్లాలోని చెరువుల్లో విడిచిపెట్టనున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు.
బ్యాంకర్లకు గట్టిగానే చెప్పాం..
ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలుకు ఆర్థిక సహాయం అందించాలని బ్యాంకర్లకు గట్టిగానే చెప్పామన్నారు. బ్యాంకులకు రుణాలు ఇవ్వాలని సక్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. హరిత హారం కార్యక్రమం మొక్కుబడిగా కాకుండా నాటిన ప్రతి మొక్క బతికేలా చూడాలన్నారు. సంఖ్య కోసం కాకుండా మొక్కను కాపాడే దిశగా ఆలోచించాలన్నారు. 8వ తరగతి పైచదువులు చదువుతున్న విద్యార్థులను హరితహారంలో భాగస్వామలను చేయాలన్నారు. అటవీ ప్రాంతంలో పండ్ల మొక్కలను నాటితే ఈ ప్రాంత ప్రజలకు ఉపాది లబిస్తుందన్నారు. చెరువులను బట్టి చేప పిల్లలను వదలాలని ఈటల సూచించారు.
సమీక్ష సమావేశంలో శాసనమండలి విప్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కనకయ్య, ఒడితల సతీష్‌కుమార్, రాష్ట్ర సహకార సంస్థల చైర్మన్లు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వి.ప్రకాశ్, కన్నెబోయిన రాజయ్య, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, గుండు సుధారాణి, బొల్లం సంపత్‌కుమార్, యూసఫ్ జావేద్, కిషన్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ లచ్చిరాంనాయక్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య, ఎస్టీ కార్పొరేషన్ ఎండీ లక్ష్మణ్, మైనార్టీ కార్పోరేషన్ జీఎం బారి, కలెక్టర్లు ఆమ్రపాలి కాట, ప్రశాంత్‌జీవన్ పాటిల్, శ్రీదేవసేన, ప్రీతిమీనా, ఆకునూరి మురళి, వరంగల్ మహానగర పాలక సంçస్థ కమిషనర్ శృతి ఓఝా పాల్గొన్నారు.