greevence cell
-
అధికారుల తీరుతో విసిగి..
మాయదారి తుపాను సర్వం నాశనం చేసి రోడ్డున పడేసింది. ఉండడానికి గూడు లేక..తినేందుకు తిండిలేక..బతుకునీడ్చడానికి పని లేక అవస్థలు పడుతున్నానంటూ ఓ బాధితురాలు అధికారులకు పలుమార్లు విన్నవించుకుంది. అయినా అధికారుల్లో చలనం కనిపించలేదు. కనీసం కలెక్టర్‌ను కలిసి మొరపెట్టుకుందామని యత్నిస్తే కలిసే అవకాశం దొరకలేదు. దీంతో మనస్తాపం చెందిన ఓ మహిళ బతుకుపై తీపిని వదిలేసి ఆత్మాహుతికి యత్నించింది. రాయగడ : వేసవికాలంలో తాత్కాలికంగా నిలిపివేసిన గ్రీవెన్స్‌సెల్‌ను పునఃప్రారంభించిన రాయగడలో తొలిరోజే అపశ్రుతి దొర్లింది. కలెక్టర్ గుహపూనాంతపస్ కుమార్ సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్ దగ్గర జిల్లా యంత్రాంగం తీరుపై మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మాహుతి యత్నానికి ఒడిగట్టింది. ఆమె యత్నాన్ని గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. తనను ఆదుకోవాలని రాయగడ ఒక ఏడాదిగా కలెక్టర్‌కు ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్‌ను కలిసేందుకు సోమవారం ప్రయత్నించింది. అయితే కలెక్టర్‌ను కలిసేందుకు ఆమెకు అనుమతి లభించక పోవడంతో మనస్తాపం చెంది ఆత్మాహుతి చేసుకునేందుకు యత్నించింది. జిల్లాలోని కల్యాణసింగుపురం సమితిలో గత ఏడాది సంభవించిన వరదల కారణంగా సంపూర్ణంగా ఆస్తి, ఇల్లు, కొట్టుకుపొయి అనాథగా మిగిలిన మమతరాణిసాహు తనకు సహాయం అందించాలని కోరుతూ ఏడాది కాలంగా కాళ్లరిగేలా తిరుగుతూ కలెక్టర్‌కు విన్నవించినప్పటగికీ ఆమె సమస్య పరిష్కరం కాలేదు. దీనిపై కలెక్టర్‌ను కలవాలని ప్రయత్నించి విఫలం కావడంతో గ్రీవెన్స్ కార్యాలయం గేటు వద్ద కిరసనాయిల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. తక్షణం గేటు వద్ద పోలీసులు స్పందించి ఆమె దగ్గర నుంచి కిరసనాయిల్ డబ్బాను స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రాయగడలో గ్రీవెన్స్ సెల్ ప్రారంభం వేసవికాలం మూడు నెలలు ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా నిలిపివేసిన గ్రీవెన్స్ సెల్‌ను రాయగడలో సోమవారం ప్రారంభించారు. ఎండలు పూర్తయి వర్షాలు కురవడం ప్రారంభం కావడంతో మళ్లీ గ్రీవెన్స్‌సెల్ నిర్వహించాలని ఆదేశాలు అందాయి. దీంతో రాయగడ కలెక్టర్ గుహపూనాంతపస్‌కుమార్ కలెక్టరేట్లో గ్రీవెన్స్‌సెల్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ రాహుల్‌పీఆర్, ఏడీఎం, డీఆర్డీఏ పీడీ సహా 32విభాగా జిల్లా అధికారులు గ్రీవెన్స్ సెల్లో పాల్గొన్నారు. ఈ గ్రీవెన్స్‌సెల్‌కు వికలాంగులు, వితంతువులు, మారుముల గ్రామీణ ప్రజలతో సహా వృద్ధులు వ్యక్తిగత సమస్యలు, గ్రూపు సమస్యలు, నాణ్యమైన వైద్యానికి సంబంధించి ముఖ్యమంత్రి నిధి నుంచి ఆర్థిక సహాయం కోరే వారు భారీ సంఖ్యలో హాజరయ్యారు. -
కలెక్టర్ ‘కరుణ’
గ్రీవెన్స్‌కు వచ్చిన వికలాంగురాలు పోచవ్వ తక్షణ సాయంగా ట్రైసైకిల్, రూ.10వేల ఆర్థిక సాయం మంజూరు హన్మకొండ అర్బన్ : ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ పేరుకు సార్థకత చేకూరుస్తున్న జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ.. ఓ వికలాంగురాలికి చేయూతనిచ్చి ఆమె కళ్లలో ఆనందాన్ని నింపారు. కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు సోమవారం ఓ వృద్ధురాలైన వికలాంగ మహిళ వచ్చింది. సిమెంట్ బస్తాపై కూర్చుని దేకుతూ వచ్చిన ఆమె బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన తనకు ఓ కుమారుడు ఉన్నా బరువు బాధ్యతలు చేసే పరిస్థితి లేదని వాపోయింది. ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్ మందులకు సరిపోతుండగా.. ఉపాధి కోసం ఏదైనా సాయం చేయాలని కలెక్టర్ కరుణను కోరింది. పనిచేసే ఓపిక ఉన్నందున ఓ ట్రైసైకిల్ ఇప్పించడంతో పాటు కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు రూ.10వేలు ఇప్పించాలని రెండు చేతులు జోడించి వేడుకుంది. ఆమె దీనగాథ వినడంతో పరిస్థితి స్వయంగా చూసి చలించిపోయిన కలెక్టర్ వెంటనే రూ.10వేలే ఇస్తే సరిపోతాయా అని పోచవ్వను ఆరా తీశారు. అయితే, సరిపోతాయని ఆమె బదులివ్వగా.. అక్కడే ఉన్న ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్‌ను పిలిచి పోచవ్వ సమస్య పరిష్కరించాలని సూచించారు. తక్షణమే ట్రైసైకిల్, రూ.10వేలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో కన్నీళ్లతో గ్రీవెన్స్‌కు వచ్చిన పోచవ్వ ఆనంద బాష్పాలు రాల్చుకుంటూ అందరికీ నమస్కరిస్తూ వెళ్లిపోయింది. -
గ్రీవెన్స సెల్ ఆసరాగా దోపిడీ
కల్హేర్ : ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌ను ఆసరాగా చేసుకున్న ఓ వ్యక్తి అమాయకులైన దళితుల నుంచి డబ్బులు దోచుకున్నాడు. రుణాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఘరానా మోసం చేశాడు. మండలంలోని చిన్న ముబారక్పూర్, రాపర్తి, ఫత్తెపూర్లో జరిగిన ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. తన పేరు దశరథ్ అని చెప్పి చిన్న ముబారక్‌పూర్‌కు చెందిన శరణప్ప, భారతి, అంబావ్వ, సిద్దవ్వ, లక్ష్మి, నాగవ్వ, మేరమ్మ, సుశీల, స్వరూప, శంకరవ్వ, సాయిలు, రాపర్తికు చెందిన విజయ్‌రావు, బాలయ్య మరో కొంత మందిని పరిచయం చేసుకున్నాడు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తానని నమ్మించాడు. అనంతరం ఒక్కొక్కరి వద్ద రూ. 500 నుంచి రూ. 1,000 వరకు సుమారు రూ. 2 లక్షల వరకు వసూలు చేశాడు. డబ్బులు వసూలు చేసిన వ్యక్తి తెరచాటున ఉండి ప్రజా విజ్ఞప్తుల దినం రోజు బాధితులను సంగారెడ్డిలోని కలెక్టరేట్‌కు తీసుకెళ్లి రుణాల కోసం కలెక్టర్‌కు అర్జీలు ఇప్పించాడు. వారం రోజుల తర్వాత కల్హేర్‌లో ఎంపీడీఓను కలవాలని సూచించాడు. కలెక్టర్‌కు అర్జీలు పెట్టి వారం రోజులు గడచినా రుణాలు రాక పోవడంతో బాధితులు కల్హేర్‌కు వచ్చి దశరథ్కు ఫోన్ చేశారు. అయినా అతను ఎత్తకపోవడంతో తమను మోసం చేశాడని తెలుసుకున్నాడని ఖంగుతిన్నారు. ఈ విషయమై సిర్గాపూర్ ఎస్ఐ విజయ్రావ్తో ప్రస్తావించగా రుణాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన వ్యక్తి గురించి ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామన్నారు.