బస్తాపై వచ్చి తన గోడు కలెక్టర్‌కు వివరిస్తున్న పోచవ్వ
-
గ్రీవెన్స్‌కు వచ్చిన వికలాంగురాలు పోచవ్వ
-
తక్షణ సాయంగా ట్రైసైకిల్, రూ.10వేల ఆర్థిక సాయం మంజూరు
హన్మకొండ అర్బన్ : ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ పేరుకు సార్థకత చేకూరుస్తున్న జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ.. ఓ వికలాంగురాలికి చేయూతనిచ్చి ఆమె కళ్లలో ఆనందాన్ని నింపారు. కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు సోమవారం ఓ వృద్ధురాలైన వికలాంగ మహిళ వచ్చింది. సిమెంట్ బస్తాపై కూర్చుని దేకుతూ వచ్చిన ఆమె బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన తనకు ఓ కుమారుడు ఉన్నా బరువు బాధ్యతలు చేసే పరిస్థితి లేదని వాపోయింది. ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్ మందులకు సరిపోతుండగా.. ఉపాధి కోసం ఏదైనా సాయం చేయాలని కలెక్టర్ కరుణను కోరింది. పనిచేసే ఓపిక ఉన్నందున ఓ ట్రైసైకిల్ ఇప్పించడంతో పాటు కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు రూ.10వేలు ఇప్పించాలని రెండు చేతులు జోడించి వేడుకుంది. ఆమె దీనగాథ వినడంతో పరిస్థితి స్వయంగా చూసి చలించిపోయిన కలెక్టర్ వెంటనే రూ.10వేలే ఇస్తే సరిపోతాయా అని పోచవ్వను ఆరా తీశారు. అయితే, సరిపోతాయని ఆమె బదులివ్వగా.. అక్కడే ఉన్న ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్‌ను పిలిచి పోచవ్వ సమస్య పరిష్కరించాలని సూచించారు. తక్షణమే ట్రైసైకిల్, రూ.10వేలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో కన్నీళ్లతో గ్రీవెన్స్‌కు వచ్చిన పోచవ్వ ఆనంద బాష్పాలు రాల్చుకుంటూ అందరికీ నమస్కరిస్తూ వెళ్లిపోయింది.