అధికారుల తీరుతో విసిగి.. | Women Attempt To Suicide | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మాహుతి యత్నం

Published Tue, Jul 3 2018 11:55 AM | Last Updated on Tue, Jul 3 2018 11:55 AM

Women Attempt To Suicide - Sakshi

మహిళను అడ్డుకుంటున్న పోలీసులు

మాయదారి తుపాను సర్వం నాశనం చేసి రోడ్డున పడేసింది. ఉండడానికి గూడు లేక..తినేందుకు తిండిలేక..బతుకునీడ్చడానికి పని లేక అవస్థలు పడుతున్నానంటూ ఓ బాధితురాలు అధికారులకు పలుమార్లు విన్నవించుకుంది. అయినా అధికారుల్లో చలనం కనిపించలేదు. కనీసం కలెక్టర్‌ను కలిసి మొరపెట్టుకుందామని యత్నిస్తే  కలిసే అవకాశం దొరకలేదు. దీంతో మనస్తాపం చెందిన ఓ మహిళ బతుకుపై తీపిని వదిలేసి ఆత్మాహుతికి యత్నించింది.

రాయగడ : వేసవికాలంలో తాత్కాలికంగా నిలిపివేసిన గ్రీవెన్స్‌సెల్‌ను పునఃప్రారంభించిన రాయగడలో తొలిరోజే అపశ్రుతి దొర్లింది.  కలెక్టర్‌ గుహపూనాంతపస్‌ కుమార్‌ సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్‌ దగ్గర జిల్లా యంత్రాంగం తీరుపై మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మాహుతి  యత్నానికి ఒడిగట్టింది. ఆమె యత్నాన్ని గమనించిన పోలీసులు  అడ్డుకున్నారు.

వివరాలిలా ఉన్నాయి. తనను ఆదుకోవాలని రాయగడ ఒక ఏడాదిగా కలెక్టర్‌కు ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ  ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రీవెన్స్‌ సెల్‌లో కలెక్టర్‌ను కలిసేందుకు సోమవారం ప్రయత్నించింది. అయితే కలెక్టర్‌ను కలిసేందుకు ఆమెకు అనుమతి లభించక పోవడంతో మనస్తాపం చెంది ఆత్మాహుతి చేసుకునేందుకు యత్నించింది.

జిల్లాలోని కల్యాణసింగుపురం సమితిలో గత ఏడాది సంభవించిన వరదల కారణంగా సంపూర్ణంగా ఆస్తి, ఇల్లు,  కొట్టుకుపొయి అనాథగా మిగిలిన మమతరాణిసాహు తనకు సహాయం అందించాలని కోరుతూ ఏడాది కాలంగా కాళ్లరిగేలా తిరుగుతూ కలెక్టర్‌కు విన్నవించినప్పటగికీ ఆమె సమస్య పరిష్కరం కాలేదు.

దీనిపై   కలెక్టర్‌ను కలవాలని ప్రయత్నించి విఫలం కావడంతో గ్రీవెన్స్‌ కార్యాలయం గేటు వద్ద కిరసనాయిల్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. తక్షణం గేటు వద్ద పోలీసులు స్పందించి ఆమె దగ్గర నుంచి కిరసనాయిల్‌ డబ్బాను స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

రాయగడలో గ్రీవెన్స్‌ సెల్‌ ప్రారంభం

వేసవికాలం మూడు నెలలు ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా నిలిపివేసిన గ్రీవెన్స్‌ సెల్‌ను రాయగడలో సోమవారం ప్రారంభించారు.  ఎండలు పూర్తయి వర్షాలు కురవడం ప్రారంభం కావడంతో మళ్లీ గ్రీవెన్స్‌సెల్‌ నిర్వహించాలని ఆదేశాలు అందాయి. దీంతో రాయగడ కలెక్టర్‌ గుహపూనాంతపస్‌కుమార్‌   కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌సెల్‌ను నిర్వహించారు.

కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ రాహుల్‌పీఆర్, ఏడీఎం, డీఆర్‌డీఏ పీడీ   సహా 32విభాగా జిల్లా అధికారులు గ్రీవెన్స్‌ సెల్‌లో పాల్గొన్నారు.  ఈ గ్రీవెన్స్‌సెల్‌కు వికలాంగులు, వితంతువులు, మారుముల గ్రామీణ ప్రజలతో సహా వృద్ధులు వ్యక్తిగత సమస్యలు, గ్రూపు సమస్యలు, నాణ్యమైన వైద్యానికి సంబంధించి ముఖ్యమంత్రి నిధి నుంచి ఆర్థిక సహాయం కోరే వారు భారీ సంఖ్యలో హాజరయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement