గ్రీవెన్‌స సెల్ ఆసరాగా దోపిడీ
కల్హేర్ : ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌ను ఆసరాగా చేసుకున్న ఓ వ్యక్తి అమాయకులైన దళితుల నుంచి డబ్బులు దోచుకున్నాడు. రుణాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఘరానా మోసం చేశాడు. మండలంలోని చిన్న ముబారక్‌పూర్, రాపర్తి, ఫత్తెపూర్‌లో జరిగిన ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.
తన పేరు దశరథ్ అని చెప్పి చిన్న ముబారక్‌పూర్‌కు చెందిన శరణప్ప, భారతి, అంబావ్వ, సిద్దవ్వ, లక్ష్మి, నాగవ్వ, మేరమ్మ, సుశీల, స్వరూప, శంకరవ్వ, సాయిలు, రాపర్తికు చెందిన విజయ్‌రావు, బాలయ్య మరో కొంత మందిని పరిచయం చేసుకున్నాడు.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తానని నమ్మించాడు. అనంతరం ఒక్కొక్కరి వద్ద రూ. 500 నుంచి రూ. 1,000 వరకు సుమారు రూ. 2 లక్షల వరకు వసూలు చేశాడు. డబ్బులు వసూలు చేసిన వ్యక్తి తెరచాటున ఉండి ప్రజా విజ్ఞప్తుల దినం రోజు బాధితులను సంగారెడ్డిలోని కలెక్టరేట్‌కు తీసుకెళ్లి రుణాల కోసం కలెక్టర్‌కు అర్జీలు ఇప్పించాడు.
వారం రోజుల తర్వాత కల్హేర్‌లో ఎంపీడీఓను కలవాలని సూచించాడు. కలెక్టర్‌కు అర్జీలు పెట్టి వారం రోజులు గడచినా రుణాలు రాక పోవడంతో బాధితులు కల్హేర్‌కు వచ్చి దశరథ్‌కు ఫోన్ చేశారు. అయినా అతను ఎత్తకపోవడంతో తమను మోసం చేశాడని తెలుసుకున్నాడని ఖంగుతిన్నారు. ఈ విషయమై సిర్గాపూర్ ఎస్‌ఐ విజయ్‌రావ్‌తో ప్రస్తావించగా రుణాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన వ్యక్తి గురించి ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామన్నారు.