Grivenssel
-
చచ్చిపోతా... అనుమతివ్వండి
గ్రీవెన్స్‌సెల్‌లో తెలంగాణ ఉద్యమకారుడి విజ్ఞప్తి వరంగల్ రూరల్: తెలంగాణ పోరాటంలో పాల్గొన్న తనను ప్రభుత్వం ఆదుకోవాలని లేని పక్షంలో ‘మెర్సీ కిల్లింగ్’ పద్ధతిలో చనిపోయేందుకు అనుమతించాలని వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం లెంకాలపల్లికి చెందిన ఆకుల సాంబరావు కోరారు. ఈ మేరకు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌సెల్‌లో వినతిపత్రం అందజేశారు. అనంతరం సాంబరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పదిహేనేళ్ల పాటు పాల్గొన్న తాను మానసిక క్షోభకు గురికావడంతో పాటు వివిధ వ్యాధుల బారిన పడ్డానని పేర్కొన్నారు. ఇకనైనా సీఎం సహాయ నిధి నుంచి చికిత్స కోసం ఆర్థిక సాయం అందజేయడంతో పాటు ఉపాధి నిమిత్తం బీసీ కార్పొరేషన్ ద్వారా రుణం ఇప్పించాలని కోరారు. లేనిపక్షంలో మెర్సీ కిల్లింగ్ పద్ధతిలో చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
గ్రీవెన్స్‌సెల్ రద్దుతో ఇబ్బందులు
విజయనగరం గంటస్తంభం: గ్రీవెన్స్‌సెల్ రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎన్నో ఆశలతో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు. గ్రీవెన్స్‌సెల్ రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ వివేక్‌యాదవ్ పేరుతో సోమవారం ఓ ప్రకటన విడుదలైంది. పత్రికలు చదవలేని వారు, సోమవారం ఉదయం పత్రిక చూడని వారు యథావిధిగా తమ సమస్యలు చెప్పుకునేందుకు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అయితే, కొందరు అధికారులు అందుబాటులో ఉండడంతో వినతులు స్వీకరిస్తారని వేచి చూశారు. ఎప్పటికీ అధికారులు స్పందించడంతో నిరాశతో ఇంటిబాట పట్టారు. వ్యయప్రయాసలకు గురయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విశాఖపట్నంలో ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించడంతో గ్రీవెన్స్‌సెల్ రద్దు చేసినట్లు కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ సమావేశానికి కలెక్టర్‌తో పాటు డీఆర్వో మాత్రమే వెళ్లారు. జేసీ జిల్లాలోనే ఉన్నారు. ఆయన స్థానికంగా జరిగిన పోలింగ్ సిబ్బంది అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. జేసీ–2 నాగేశ్వరరావు కార్యాలయంలోనే అందుబాటులో ఉన్నారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి, ఇతర సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. గతంలో జేసీ–2, డీఆర్వో ఉన్నా... ఇద్దరిలో ఒకరున్నా గ్రీవెన్స్‌సెల్ నిర్వహించేవారు. వీరికి డీఆర్డీఏ, డ్వామా పీడీలు, ఇతర ఉప కలెక్టర్లు సహకారం అందించిన సందర్భాలున్నాయి. కేఆర్సీ ఎస్డీసీ ఒక్కరే గ్రీవెన్స్‌సెల్ నిర్వహించిన సందర్భం కూడా జిల్లాలో ఉంది. సోమవారం కూడా కొంతమంది అధికారులు అందుబాటులో ఉన్నా నిర్వహించకపోవడంపై జనం ఆందోళన వ్యక్తంచేశారు. రెండుమూడు రోజుల ముందే గ్రీవెన్స్‌సెల్ రద్దుచేస్తున్నట్టు ప్రకటన ఇస్తే ఒకరి నుంచి ఒకరికి గ్రామీణ ప్రజలకు సమాచారం చేరేది. అదే రోజు ప్రకటన ఇవ్వడంతో దూర ప్రాంతాలకు చెందిన వారు పత్రికలు చూడకుండానే ఇంటి నుంచి బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్ ఫోర్టుకో వద్ద కూర్చున్నారు. 11 గంటలైనా అధికారులు రాకపోవడంతో కారణంపై ఆరా తీశారు. రద్దుచేసినట్టు తెలుసుకుని ఇంటిబాట పట్టారు. కనీసం ఫిర్యాదుల నమోదు కేంద్రం వద్ద తీసుకోవాలని విజ్ఞప్తి చేసినా సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఇంటిబాట పడ్డారు. -
‘మీకోసం’
ప్రజావాణి ఇక ‘మీ కోసం’ పేరుమారుతున్నా ప్రయోజనం దక్కేనా పేరుకుపోతున్న అర్జీలు పట్టించుకునే వారు లేరు.. విశాఖపట్నం: తీరు మారదు.. కానీ తరచూ పేరు మారుతుంది. వేలల్లో కాదు..లక్షల్లో పేరుకుపోతున్న అర్జీలను పట్టించుకునే నాథుడు కన్పించరు. సంవత్సరాల తరబడి తిరుగుతున్నా పరిష్కారానికి నోచుకోని సమస్యలతో సామాన్య, నిరుపేదలు అల్లాడుతూనే ఉన్నారు. మొక్కుబడిగా సాగుతున్న గ్రీవెన్స్‌సెల్ వచ్చే వారం నుంచి ‘మీ కోసం’గా పేరు మార్చుకోబోతుంది. రెండు నెలలు కూడా కాలేదు ప్రజాదర్బార్‌ను ప్రజావాణిగా మార్చి. ఇప్పుడు ‘మీ కోసం’ అంటూ ‘గ్రీవెన్స్ సెల్ ’ కొత్తఅవతారమెత్తుతోంది. 2009లో శ్రీకారం చుట్టిన గ్రీవెన్స్‌సెల్ ప్రతీ సోమవారం డివిజన్ స్థాయిలో ఆర్డీఒ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మండల స్థాయి పలుమార్లు తిరిగినా పరిష్కారానికి నోచు కోని సమస్యలను డివిజనల్ స్థాయిలో జరిగే గ్రీవెన్స్‌లో ఇస్తారు. అప్పటికీ పరిష్కారానికి నోచుకోని సమస్యలను నేరుగా కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్‌సెల్‌లో అంద జేస్తుంటారు. కలెక్టర్ లేదా జేసీ వారిద్దరూ లేకపోతే డీఆర్‌ఒ ఎవరో ఒకరూ వీటిని పరిశీలించి సంబంధిత జిల్లా అధికారులకు ఎండార్స్ చేస్తుంటారు. జిల్లా అధికారులు మళ్లీ మండల స్థాయి అధికారులకు పంపిస్తుంటారు. కొన్ని సమస్యలనైతే నేరుగా మండలాలకే ఎండార్స్ చేస్తూ అర్జీదారులను అక్కడకే వెళ్లి మండల స్థాయి అకారులను కలుసుకోమంటూ హితవు పలుకుతుంటారు. ఇలా అర్జీలు ఎక్కడ నుంచి వస్తాయో అక్కడకే చేరుతుంటాయి. అయినా పరిష్కారానికి నోచుకోవు. ఆన్లైన్లో మాత్రం పరిష్కార మైనట్టుగా కన్పిస్తుంటాయి. ఇదీ ఇప్పటి వరకు గ్రీవె న్స్ఉరఫ్ ప్రజావాణితీరు. పరిష్కారమయ్యేవి 70 శాతం లోపే కలెక్టరేట్లో గ్రీవెన్స్‌కు వచ్చే అర్జీల్లో 70శాతం వరకు పరిష్కారానికి నోచుకుంటున్నా, డివిజన్ స్థాయిలో 50 శాతానికి మించడం లేదంటున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో వీటిని పరిష్కరించాల్సిన మండల, గ్రామ స్థాయి అధికారుల వైఖరే కారణమని చెబుతున్నారు. గడిచిన ఐదేళ్లలో కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌కు 55,410 అర్జీలు రాగా, 45,258 పరిష్కారమైనట్టుగా చెబుతున్నారు. మరో 9,348అర్జీలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో నిర్ణీత గడువు ముగిసినా పరిష్కారానికి నోచుకోని అర్జీలు మరో 8412 వరకు ఉన్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలుండవు. డివిజన్ స్థాయిలో వినతుల సంఖ్య లక్షకుపైగానే ఉంటాయంటున్నారు. వీటిలో పరిష్కారమైనవి 50 శాతమే. ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం మావి కావంటే మావి కావంటూ సరిహద్దు తగాదాల్లో బుట్టదాఖలు చేసేవే ఎక్కువగా ఉంటున్నాయి. జన్మభూమి ఫిర్యాదులకు దిక్కులేదు రెండు నెలల క్రితం నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులెన్నో తెలుసా అక్షరాలా 2,64,829 వచ్చాయి. వీటిలో గ్రామీణప్రాంతాల్లో 1,93,863 రాగా, పట్టణ ప్రాంతాల్లో 70,966 ఉన్నాయి. అత్యధికంగా ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం 76,545, రేషన్ కార్డుల కోసం 64,645, పింఛన్ల కోసం 45,974, రెవెన్యూ సంబంధిత సమస్యలపై 30,168 పిటీషన్లు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు ఏ ఒక్క పిటీషన్‌ను పరిష్కరించిన పాపాన పోలేదు. మండల స్థాయిలోనూ ‘మీ కోసం’ గ్రీవెన్స్‌సెల్ వచ్చేవారం నుంచి ‘మీ కోసం’గా రూపాంతరం చెందుతోంది. ఇప్పటి వరకు డివిజనల్, జిల్లా స్థాయిల్లో జరిగే ఈ గ్రీవెన్స్‌ను ఇక నుంచి శాఖల వారీగానే కాకుండా మండల స్థాయిలో కూడా నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు. ఫిబ్రవరి రెండవవారం నుంచి అధికారికంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
అమాత్యులకు టైం లేదట!
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఒకరు.. ఇద్దరు కాదు వేలాది మంది పింఛన్ లబ్ధిదారులు మంత్రులు, ఎమ్మెల్యే పుణ్యమా అని పింఛన్లు అందుకోలేకపోయారు. రెండేళ్ల నిరీక్షణ తర్వాత మంజూరైన పింఛన్లు.. మంత్రులకు సమయంలేక నిలిచిపోయూరుు. రెండో విడత రచ్చబండ, గ్రీవెన్స్‌సెల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ ముగిశాక పింఛన్లు మంజూరు చేసింది. సామాజిక భద్రత కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలో 34,691 మందికి ఆగస్టు 1న పింఛన్లు మంజూరు చేశాయి. ప్రస్తుతం ఆ సొమ్ము డీఆర్డీఏ ఖాతాలో మూలుగుతోంది. రెండేళ్ల నిరీక్షణ తర్వాత.. రెండేళ్లుగా జిల్లాలో ఒక్కరికి కూడా ప్రభుత్వం పింఛన్ మంజూరు చే యలేదు. చివరిగా అక్టోబర్, 2011లో మొదటి రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత రెండో విడత రచ్చబండలో పింఛన్ల కోసం ఇచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. వీటితోపాటు ఎంపీడీఓలు ఆన్లైన్లో, గ్రీవెన్స్‌సెల్ ద్వారా జిల్లా నుంచి 39వేల వరకు పింఛన్లు కావాలని గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన అధికారులు జిల్లాలో మొత్తం 34,691 మందికి పింఛన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అందుకు సంబంధించిన డబ్బులను డీఆర్డీఏకు జమచేశారు. ఎన్నికల కోడ్ ముగిసినతర్వాత ఆగస్టు మొదటివారంలో వాటిని పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈలోగా వాటిని పంపిణీ నిలిపివేయాలని హైదరాబాద్‌నుంచి ఫ్యాక్స్ ద్వారా డీఆర్డీఏకు ఉత్తర్వులు అందాయి. మంత్రులకు సమయం లేదట ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న నిరుపేదలకు పింఛన్లు మంజూరు అయితే వాటిని పంపిణీ చేయడానికి మన మంత్రులకు సమయమే ఉండడం లేదు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని భావించిన ప్రభుత్వం వారు సమయం కేటాయించే వరకు వాటిని పంపిణీ చేయవద్దని ఆదేశాలు ఇవ్వడంతో మన అధికారులు మిన్నకుండిపోయారు. 34,691 మందికి రూ.76,41,100 రెండో విడత రచ్చబండ, ఆన్లైన్, గ్రీవెన్స్‌సెల్‌లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సొసైటీ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ (సెర్ప్), డీఆర్‌డీఏల ద్వారా సామాజిక భద్రత కింద జిల్లాకు 34,691 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. వృద్ధులు, వితంతువులు, చేనేతవృత్తిదారులు, గీత వృత్తిదారులకు నెలకు ఒక్కొక్కరికి రూ.200 పింఛన్‌ను సామాజిక భద్రత కింద ఇస్తున్నారు. వికలాంగులకు నెలకు రూ.500 పంపిణీ చేస్తున్నారు. కొత్తగా వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత వృత్తిదారులకు 32,348, వికలాంగులకు 2343 మందికి పింఛన్లు మంజూరు చేసిన సర్కారు మొత్తం రూ. 76,41,100 విడుదల చేసింది. అయితే పంపిణీ నిలిచిపోవడంతో ఈ నగదును తాజాగా వెనక్కి పంపించారు.