
చచ్చిపోతా... అనుమతివ్వండి
గ్రీవెన్స్‌సెల్‌లో తెలంగాణ ఉద్యమకారుడి విజ్ఞప్తి
వరంగల్ రూరల్: తెలంగాణ పోరాటంలో పాల్గొన్న తనను ప్రభుత్వం ఆదుకోవాలని లేని పక్షంలో ‘మెర్సీ కిల్లింగ్’ పద్ధతిలో చనిపోయేందుకు అనుమతించాలని వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం లెంకాలపల్లికి చెందిన ఆకుల సాంబరావు కోరారు. ఈ మేరకు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌సెల్‌లో వినతిపత్రం అందజేశారు. అనంతరం సాంబరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పదిహేనేళ్ల పాటు పాల్గొన్న తాను మానసిక క్షోభకు గురికావడంతో పాటు వివిధ వ్యాధుల బారిన పడ్డానని పేర్కొన్నారు.
ఇకనైనా సీఎం సహాయ నిధి నుంచి చికిత్స కోసం ఆర్థిక సాయం అందజేయడంతో పాటు ఉపాధి నిమిత్తం బీసీ కార్పొరేషన్ ద్వారా రుణం ఇప్పించాలని కోరారు. లేనిపక్షంలో మెర్సీ కిల్లింగ్ పద్ధతిలో చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.