Groom disappear
-
కిలేడీ మాస్టర్ ప్లాన్.. పెళ్లైన మరుసటి రోజే డబ్బు, నగలతో పరార్!
లక్నో: వివాహం జరిగిన మరుసటి రోజునే వరుడికి షాక్ ఇచ్చింది ఓ నవ వధువు. ఇంట్లోని డబ్బులు, బంగారు ఆభరణాలతో పరారైంది. ఆ తర్వాత వరుడికి ఫోన్ చేసి తన కోసం వేచి చూడొద్దని తెగేసి చెప్పేసింది. ‘నేను నిన్ను ప్రేమించలేదు. నున్వు నాకు ఫోన్ చేయొద్దు’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఈ అరుదైన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగు చూసింది. ఇంట్లోని డబ్బులు, నగలు, ఇతర విలువైన వస్తువులను పట్టుకెళ్లిన క్రమంలో పోలీసులను ఆశ్రయించాడు వరుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన అక్టోబర్ 4నే జరిగినా.. బిల్హార్ పోలీస్ స్టేషన్లో శనివారం వరుడు ఫిర్యాదు చేసిన క్రమంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జదేపూర్ గ్రామానికి చెందిన అరవింద్‌ను తాత్కౌలి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి పెళ్లి కుదిర్చుతామని నమ్మించారు. అందుకు తమకు రూ.70వేలు ఇవ్వాలి డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకున్నాక అరవింద్‌ను బిహార్ తీసుకెళ్లి రుచి అనే యువతితో పెళ్లి కుదిర్చారు. సెప్టెంబర్ 30న హోటల్‌కు తీసుకెళ్లి పెళ్లి కూతురి ఫోటో చూపించారు. అక్టోబర్ 1న గయాలోని ఓ ఆలయంలో వివాహం జరిపించారు. ఆ తర్వాత తన భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు అరవింద్. అక్టోబర్ 4న తెల్లవారి నిద్రలేచే సరికి అతని భార్య కనిపించలేదు. ఇంట్లో ఉంచిన రూ.30వేల నగదు, బంగారు నగలు, పెళ్లి కోసం తీసుకున్న బట్టలు సైతం కనిపించలేదు. దీంతో ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆ తర్వాత అరవింద్‌కు రుచి ఫోన్ చేసి తన కోసం వెతకొద్దని చెప్పింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతితో పాటు పెళ్లి కుదిర్చిన ఇద్దరు వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇదీ చదవండి: మాట్లాడుతూనే కుప్పకూలిన ప్రొఫెసర్.. గుండెపోటుతో మృతి -
వరుడు మిస్సింగ్.. వధువు షాకింగ్ నిర్ణయం
లక్నో: ప్రస్తుతం కోవిడ్ విస్తరిస్తుండటంతో ఆంక్షల మధ్య, అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఏ పెళ్లిలోనైనా సాధారణంగా కనిపించే దృశ్యాలు ఏంటి అంటే.. గౌరి పూజ, కన్యాదానం, మంగళ సూత్ర ధారణ ఇవే సన్నివేశాలు. కాకపోతే అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటలు కూడా చోటు చేసుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి అనూహ్య సంఘటనే. మండపానికి వచ్చిన వరుడు.. తాళి కట్టేలోపు అదృశ్యమయ్యాడు. ఇక పెళ్లి వాయిదా వేయడం ఇష్టం లేని వధువు తల్లిదండ్రులు వివాహానికి హాజరైన బంధువుల్లో ఒక అబ్బాయికిచ్చి పెళ్లి పూర్తి చేశారు. ఆ తర్వాత పారిపోయిన వరుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని మహారాజ్‌పూనర్‌లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ‘జైమాల’ (దండల మార్పిడి) తర్వాత రెండు కుటుంబాల ప్రధాన వివాహ వేడుకకు సిద్ధమవుతుండగా.. వరుడు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. దాంతో రెండు కుటుంబాలు వరుడి కోసం వెతకడం ప్రారంభించారు. కానీ అతడి ఆచూకీ దొరకలేదు. అసలు ఇంత అకస్మాత్తుగా ఎందుకు మాయమయ్యాడు అనే దాని గురించి కేవలం ఆ వరుడికి మాత్రమే తెలుసు. పీటల వరకు వచ్చిన పెళ్లి ఇలా సడెన్‌గా ఆగిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడ్డారు. దాంతో వివాహానికి వచ్చిన అతిథులలో ఒకరు.. ఈ వేడుకకు వచ్చిన వారిలో మరొక అబ్బాయితో వివాహం జరిపించాల్సిందిగా సూచించారు. దాంతో వధువు కుటుంబం ఒక అబ్బాయిని ఎన్నుకుని.. అతడి కుటుంబంతో సంప్రదింపులు జరిపారు. సదరు పెళ్లి కుమార్తెను వివాహం చేసుకోవడానికి వారు కూడా అంగీకరించడంతో ఆగిపోవాల్సిన పెళ్లి కాస్త ప్రశాంతంగా పూర్తయ్యింది. వివాహం తర్వాత వధువు కుటుంబం.. పారిపోయిన వరుడు, అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. మరో ట్విస్ట్ ఏంటంటే పీటల మీద నుంచి పారిపోయిన వరుడి కుటుంబ సభ్యులు అదే స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. చదవండి: వైరల్: 17 నిమిషాల్లో పెళ్లి.. కట్నంగా ఏం కోరాడంటే -
తెల్లారితే పెళ్లి.. కనిపించకుండా పోయిన వరుడు
సాక్షి, బెంగళూరు: పెళ్లి సమయానికి వరుడు కనిపించకపోవడంతో మరో యువకుడు పెళ్లి కూతురి మేడలో తాళి కట్టిన వైనం కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాలు.. కర్ణాటకలోని చిక్ మంగళూరు తారికారే తాలుకాలో సింధు, నవీన్ అనే యువతీయువకులకు పెద్దలు పెళ్లి కుదిర్చి ముహుర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో నిన్న వారిద్దరి వివాహానికి ముహుర్తం నిర్ణయించి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. బంధువులంతా కూడా వచ్చేశారు. తెల్లారితే (మంగళవారం) పెళ్లి ఉండటంతో వచ్చిన బంధువులంతా సంతోషంగా విందు కార్యక్రమాన్ని జరపుకున్నారు. ఈ క్రమంలో ఉదయం పెళ్లి మూహుర్తం దగ్గరపడుతున్న సమయంలో ఆకస్మాత్తుగా వరుడు నవీన్ కనిపించకుండా పోయాడు. అయితే నవీన్ అప్పటికే మరో యువతితో ప్రేమలో ఉండటంతో ఆ యువతి పెళ్లి ఆపేస్తానంటూ బెదిరిచిట్టు సమాచారం. దీంతో భయపడిపోయిన నవీన్ పెళ్లి ముహుర్తానికి కొద్ది గంటల ముందు కల్యాణ మండపం నుంచి పరారయ్యాడు. ఇక ఎన్నో ఆశలతో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన నవ వధువు సింధు తీవ్ర నిరాశకు గురైంది. ఆమె జీవితం ఏమవుతుందో అని అందరూ ఆందోళన చెందుతున్న క్రమంలో బంధువుగా పెళ్లికి హజరైన చంద్రు అనే వ్యక్తి సింధును పెళ్లి చేసుకోటానికి ముందుకు వచ్చాడు. దీంతో పెద్దలు వారిద్దరి వివాహం జరిపించారు. -
వరుడు పరారీ.. తాళి కట్టిన మరో యువకుడు
హుస్నాబాద్ రూరల్: ఉదయం 11 గంటలకు వివాహ ముహూర్తం.. వధువు బంధువులు వరుడిని తీసుకొచ్చేందుకు అబ్బాయి ఊరు వెళ్లారు. అబ్బాయిని తీసుకుని పెళ్లి మండపానికి వచ్చే క్రమంలో.. వరుడు వాహనం దిగి పారిపోయాడు. దీంతో ఏం చేయాలనే అయోమయంలో పడ్డ వధువు తల్లిదండ్రులు.. అనుకోకుండా ఓ యువకుడి నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు. పెళ్లి ఆగిన క్రమంలో సదరు యువకుడు ముందుకొచ్చి వధువు మెడలో తాళి కట్టాడు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. పొట్లపల్లి గ్రామానికి చెందిన కోల రాజలింగు, భూలక్ష్మి దంపతులు తమ కుమార్తెను మేనత్త కొడుకు, చిగురుమామిడి మండలం చినముల్కనూర్‌కు చెందిన పందిపెల్లి శ్రీనివాస్‌కు ఇచ్చి పెళ్లి చేసేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. అయితే శ్రీనివాస్ నుస్తులాపూర్‌కు చెందిన మరో యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇది తెలిసే తమ కుమార్తెను మొదట ముల్కనూర్‌కు చెందిన పందిపెల్లి రమేశ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు వధువు తల్లిదండ్రులు నిర్ణయించారు. అయితే, శ్రీనివాస్ తల్లి అడ్డుపడి తన కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయాలని పట్టుబట్టడంతో పెళ్లి కుదుర్చుకున్నారు. కానీ పెళ్లిపీటల పైకి వచ్చే సమయంలో శ్రీనివాస్ పరారు కావడంతో మొదట నిర్ణయించిన వరుడైన రమేశ్ తల్లిదండ్రులతో మాట్లాడి.. అదే వేదికపై పెళ్లి కానిచ్చారు. పందిపెల్లి రమేశ్ పెద్ద మనసుతో ముందుకు వచ్చి వధువు మెడలో తాళికట్టి, అమ్మాయి తల్లిదండ్రుల ముఖంలో సంతోషం నింపడంతో బంధువులు ప్రశంసలతో ముంచెత్తారు. -
మరికొద్ది గంటల్లో పెళ్లి..వరుడు అదృశ్యం
తుమకూరు: మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు హఠాత్తుగా కనిపించక పోవడంతో వివాహం అర్ధాంతరంగా రద్దయిన ఘటన ఆదివారం జిల్లాలోని కుణిగల్ తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కల్లేగౌడనదొడ్డికి చెందిన శివకుమార్‌కు బిళిదేవాలయ గ్రామానికి చెందిన భైరప్ప అనే వ్యక్తి కుమార్తెతో వివాహం నిశ్చయించారు. ఈ క్రమంలో శనివారం శాస్త్రోత్తమ కార్యక్రమాల్లో పాల్గొన్న శివకుమార్ ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు.వి వాహ సమయం సమీపిస్తున్నా శివకుమార్ పెళ్లిమంటపానికి చేరుకోకపోవడంతో ఇరు వర్గాల బంధువులు వరుడి కోసం వెతికినా ఫలితం లేదు. దీంతో వివాహం అర్ధాంతరంగా రద్దయింది. దీంతో వధువు తల్లితండ్రులు వరుడితో పాటు వరుడి తల్లితండ్రులపై ఫిర్యాదు చేయడంతో అమృతూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కాబోయే వరుడు అదృశ్యం
పలమనేరు : మరో మూడు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లికొడుకు అదృశ్యమయ్యాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వరుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. పలమనేరు సిల్క్‌ఫామ్‌లో నివాసముంటున్న సిద్దప్ప కుమారుడు వినోద్‌కుమార్‌కు కడప జిల్లా చక్రాయపేట మండలం అద్దాలమర్రికి చెందిన పెద్దగంగన్న కుమార్తె నవేణితో వివాహం నిశ్చయమైంది. వీరికి ఈ నెల 29న వధువు స్వగృహంలో పెళ్లి జరగాల్సి ఉంది. రెండు కుటుంబాల వారు లగ్నపత్రికలు కూడా పంచారు. పెళ్లి పనులు పూర్తి చేశారు. మూడు రోజుల క్రితం వినోద్ కనిపించకుండా పోయాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు పెళ్లి కుమార్తె గ్రామం, ఇతర బంధువుల ఇళ్ల వద్ద గాలించినా ఆచూకీ లేదు. అతని సెల్‌ఫోన్ సైతం పనిచేయడంలేదు. దీంతో ఆందోళనకు గురైన అతని తల్లిదండ్రులు ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వధువు కుటుంబ సభ్యులు పలమనేరు చేరుకున్నారు. పెళ్లికొడుకు అదృశ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఇద్దరూ ప్రేమించుకోవడంతోనే పెళ్లికి అంగీకరించామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వినోద్ ఎందుకు కనిపించకుండా పోయాడో అర్థం కావడం లేదని అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసును పోలీసులు విచారిస్తున్నారు. -
వరుడు అదృశ్యం
తిరువొత్తియూరు: ఆవడి సమీపం పట్టాభిరామంలో వరుడు అదృశ్యమవడంతో శుక్రవారం జరగవలసిన వివాహం ఆగిపోయింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆవడి, పట్టాభిరామంకు చెందిన ఢిల్లీ. ఇతను చిల్లర దుకాణం నడుపుతున్నాడు. ఇతని కుమార్తెకు నాగై జిల్లా నాగూర్, తెత్తి గ్రామానికి చెందిన దురై కుమారుడు కన్నాభిరాన్‌తో శుక్రవారం ఈ వివాహం జరగవలసి ఉంది. గురువారం రాత్రి విందు కార్యక్రమం జరిగింది. వధువు వివాహ మండపానికి చేరుకుంది. కానీ వరుడు, వరుని తరపున బంధువులు పెళ్లి మండపానికి చేరుకోలేదు. దీని గురించి వధువు తండ్రి వరుని తండ్రికి ఫోన్ చేసి సంప్రదించగా కుమారుడు కనబడడం లేదని తెలిపారు. అయినప్పటికీ వరుని తరపున వారు వస్తారనే నమ్మకంతో వివాహ ఏర్పాటు కొనసాగించారు. కానీ వివాహ ముహూర్తం సమయం వరకు వరుని కుటుంబికులు, వరుడు రాలేదు. విచారణలో వివాహం ఇష్టంలేదని వరుడు కన్నాభిరామన్ అదృశ్యమైనట్టు తెలిసింది. ప్లస్‌టూ వరకు చదివి దుబాయిలో పని చేస్తూ వివాహం కోసం సొంత ఊరికి వచ్చినట్టు తెలిసింది. దీంతో కుమారుడు కనబడలేదని దురై నాగూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వరుడు లేకపోవడంతో శుక్రవారం జరగవలసిన వివాహం ఆగిపోవడంతో ఆగ్రహం చెందిన ఢిల్లీ దీనిపై పట్టాభిరామం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.