ప్రతీకాత్మక చిత్రం
లక్నో: ప్రస్తుతం కోవిడ్ విస్తరిస్తుండటంతో ఆంక్షల మధ్య, అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఏ పెళ్లిలోనైనా సాధారణంగా కనిపించే దృశ్యాలు ఏంటి అంటే.. గౌరి పూజ, కన్యాదానం, మంగళ సూత్ర ధారణ ఇవే సన్నివేశాలు. కాకపోతే అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటలు కూడా చోటు చేసుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి అనూహ్య సంఘటనే. మండపానికి వచ్చిన వరుడు.. తాళి కట్టేలోపు అదృశ్యమయ్యాడు. ఇక పెళ్లి వాయిదా వేయడం ఇష్టం లేని వధువు తల్లిదండ్రులు వివాహానికి హాజరైన బంధువుల్లో ఒక అబ్బాయికిచ్చి పెళ్లి పూర్తి చేశారు. ఆ తర్వాత పారిపోయిన వరుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని మహారాజ్‌పూనర్‌లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ‘జైమాల’ (దండల మార్పిడి) తర్వాత రెండు కుటుంబాల ప్రధాన వివాహ వేడుకకు సిద్ధమవుతుండగా.. వరుడు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. దాంతో రెండు కుటుంబాలు వరుడి కోసం వెతకడం ప్రారంభించారు. కానీ అతడి ఆచూకీ దొరకలేదు. అసలు ఇంత అకస్మాత్తుగా ఎందుకు మాయమయ్యాడు అనే దాని గురించి కేవలం ఆ వరుడికి మాత్రమే తెలుసు.
పీటల వరకు వచ్చిన పెళ్లి ఇలా సడెన్‌గా ఆగిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడ్డారు. దాంతో వివాహానికి వచ్చిన అతిథులలో ఒకరు.. ఈ వేడుకకు వచ్చిన వారిలో మరొక అబ్బాయితో వివాహం జరిపించాల్సిందిగా సూచించారు. దాంతో వధువు కుటుంబం ఒక అబ్బాయిని ఎన్నుకుని.. అతడి కుటుంబంతో సంప్రదింపులు జరిపారు.
సదరు పెళ్లి కుమార్తెను వివాహం చేసుకోవడానికి వారు కూడా అంగీకరించడంతో ఆగిపోవాల్సిన పెళ్లి కాస్త ప్రశాంతంగా పూర్తయ్యింది. వివాహం తర్వాత వధువు కుటుంబం.. పారిపోయిన వరుడు, అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. మరో ట్విస్ట్ ఏంటంటే పీటల మీద నుంచి పారిపోయిన వరుడి కుటుంబ సభ్యులు అదే స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment